-ఇన్వెస్ట్ ఇండియా సంస్థ వెల్లడి
-ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధంటే చంద్రబాబుకు ఏడుపెందుకో
– జాతీయ పార్టీ (సీపీఐ)ని తోక పార్టీగా మార్చిన ఘనుడు నారాయణ
– వలంటీర్లకు సత్కారంతో సేవలకు గుర్తింపు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
కరోనా సంక్షోభంతో దేశమంతా కొట్టుమిట్టాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుచూపు, పాలనా సంస్కరణలు ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా తాజాగా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 451 మిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ పేర్కొందని అన్నారు.
పిల్లలు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడటంలో క్రైస్తవ మిషనరీ స్కూళ్ల పాత్ర అమోఘమని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు అదే నోటితో ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు తల్లి గొంతు కోస్తారా అని ఎలా అనగలుగుతున్నాడని అన్నారు. పేద విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించే దేవాలయాలవంటి ప్రభుత్వ స్కూళ్లపై పడి చంద్రబాబు ఎందుకు ఏడుస్తున్నారని, ఆయనలాగా గారడీ విద్యలు వేరెవరూ ప్రదర్శించలేరని అన్నారు.
జాతీయ పార్టీ (సీపీఐ)ని తోక పార్టీగా మార్చిన ఘనుడు నారాయణ అని, నీడనిచ్చిన పార్టీనే హత్య చేసిన వ్యక్తి ఆత్మహత్యలంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.వారికి, వీరికి కాదు సీపీఐ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో నారాయణ చెప్పాలని అన్నారు. కమ్యూనిస్టు ముసుగు తీసేసి చిలక జోస్యం చెప్పుకోవాలని హితవు పలికారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గడప గడపకూ చేరవేసి లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల నిబద్ధతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ వరుసగా రెండో ఏడాది సత్కరించిందని, సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో సత్కరించడంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేసిందని అన్నారు. వలంటీర్ల పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
అవినీతికి తావు లేకపోవడం, సచ్చీలత, ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, హాజరు, యా వినియోగం, నవరత్నాల అమలులో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పింఛన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాల్లో వాలంటీర్ పనితీరు ఆధారంగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. 875 మందికి సేవా వజ్ర,4136 మందికి సేవా రత్న, 228322 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాన్ని ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనతో వలంటీర్ల సేవలు ఎనలేనివని అన్నారు.