గ్లాస్-లైన్ పరికరాల తయారీ కోసం విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన GMM Pfaudler
– హైదరాబాద్ తయారీ కేంద్రంపై 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్న GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ )
మరోఅంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్ లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోంది. ఫార్మా కంపెనీల కు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేసే GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ ) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. GMM Pfaudler-ఇంటర్నేషనల్ బిజినెస్ CEO- థామస్ కెహ్ల్ , వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ డైరెక్టర్- అశోక్ J పటేల్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయి తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు. తమ వ్యాపార ప్రణాళికల్లో హైదరాబాద్ కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి GMM Pfaudler ఆసక్తిని వ్యక్తం చేసింది. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండు సంవత్సరాల క్రితం (2020) 6.3 మిలియన్ డాలర్ల తో హైదరాబాద్ లో GMM Pfaudler తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలనుకున్న కంపెనీ అదనంగా మరో 37 లక్షలడాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 300 కు చేరుతుంది. అక్టోబర్ 2020 – మార్చి 2022 మధ్య కాలంలో కంపెనీ హైదరబాద్ కేంద్రం 700 పరికరాలను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.
ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము ఇండియా వైపు చూస్తున్నామన్న GMM Pfaudler CEO థామస్ కెహ్ల్, హైదరాబాదీ కేంద్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఫార్మా రంగంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలను అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫార్మాపరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని థామస్ కెహ్ల్ చెప్పారు.
హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించాలనుకున్న GMM Pfaudler నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వృద్ధిలో భాగం కావాలనుకునే ఎవరికైనా తమ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఫార్మా పరికరాల తయారీ రంగంలో నెంబర్ వన్ గా ఎదగాలనుకుంటున్న GMM Pfaudler లక్ష్యాన్ని చేరడంలో హైదరబాద్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనుకు ఉందన్నారు కేటీఆర్.
ఈ సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్ రంగ పరిశ్రమలకు అవసరమయ్యే పరికరాలను ఉత్పత్తి చేసే అంతర్జాతీయ సంస్థ GMM Pfaudler. ముఖ్యంగా తుప్పు-నిరోధక సాంకేతికత అభివృద్ధిలో GMM Pfaudler గ్లోబల్ లీడర్. రసాయన, ఔషధ పరిశ్రమలలో తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న పరికరాలు,యంత్రాలను తయారు చేసే సంస్థగా అంతర్జాతీయంగా మంచి పేరుంది.