Suryaa.co.in

Business News International Telangana

క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న EMPE డయాగ్నోస్టిక్స్

-హైదరాబాద్ లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న స్వీడన్ కు చెందిన EMPE డయాగ్నోస్టిక్స్

క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి తరువాత హైదరాబాద్ ను ఎంచుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్ లో తయారయ్యే కిట్ లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. అదనంగా 50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ కల్పించబోతుంది. మొత్తంగా రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రంపై 25 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ తో EMPE డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు, CEO డాక్టర్ పవన్ అసలాపురం సమావేశం తరువాత తన నిర్ణయాన్ని కంపెనీ ప్రకటించింది.

క్షయ ప్రభావిత 30 దేశాల్లో ఇండియా ఒకటన్నారు EMPE డయాగ్నోస్టిక్స్ డాక్టర్ పవన్ అసలాపురం. కోవిడ్ ప్రభావంతో టీబీ చికిత్స, నివారణ పురోగతిలో ప్రపంచం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇండియాలో టీబీ రోగులు ఎక్కువగా ఉన్నారన్న పవన్, యూరప్ దేశాల్లో అయితే చికిత్సకు లొంగని విధంగా టీబీ వ్యాధి పరిణామం చెందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది వ్యాధి చికిత్సకు అవసరమైన యాంటీ బయాటిక్ లను కాకుండా తప్పుడు ఔషధాలను తీసుకుంటున్నారని చెప్పారు. ఫలితంగా టీబీ వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో TBని గుర్తించి, సరైన యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయడం మునుపటి కంటే చాలా ముఖ్యమైనదన్నారు. ప్రపంచం మానవాళి ఎదుర్కుంటున్న ఈ ముప్పును తప్పించడానికి EMPE డయాగ్నోస్టిక్స్ పని చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని డాక్టర్ పవన్ అసలాపురం చెప్పారు. కిట్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటుచేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన మంత్రి కేటీఆర్ , తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

పురాతన అంటువ్యాధులలో క్షయ ఒకటన్నారు మంత్రి కేటీఆర్. వైద్య రంగానికి ఇప్పటికీ ఇది సవాల్ గానే ఉందన్నారు. టీబీ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక భారాన్ని కలిగిస్తుందన్నారు. అయితే ఈ ముప్పును ఎదుర్కునేందుకు EMPE డయాగ్నోస్టిక్స్ ముందువరుసలో ఉండడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ కేంద్రంగా టీబీ పై చేసే యుద్దానికి తమ సహకారం ఉంటుందన్నారు కేటీఆర్.ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE