Suryaa.co.in

Features

చతుర్వేద పాండిత్యం – సామ్యవాద సాంగత్యం

పాల నురగ లాంటి తెల్లప్యాంటు, తెల్లచొక్కా, ఎండకి మెరిసే వెండి పోగుల్లా అలా అలా కదిలీకదలని జట్టు. చేతిలో రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్. కాలినడక, కాదంటే రిక్షా. విజయవాడ సున్నపుబట్టిల సెంటర్లోనో, విశాలాంధ్ర చుట్టుగుంట సెంటర్లోనో, అదీఇదీ కాకపోతే ఏ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దో, సిద్దార్ధ ఆడిటోరియం వద్దో ఇలాంటి మనిషి కనిపిస్తే ఆయనెవరో ఇంకెవరో చెప్పాల్సిపని ఉండదు. ఆయనే విశాలాంధ్ర రాఘవాచారి. ఆయన మాటన్నా, రాతన్నా బోలెడంత ఇష్టం. ప్రేమ. ఎందుకంటే వాటిల్లో జ్ఞానసుమాలు, చమత్కారబాణాలేకాదు; వాడి ఖడ్గ చాలనాలు కూడా ఎన్నో ఎన్నెన్నో. ఆ సభ ఈ సభ అని తేడా లేకుండా అన్నింటికీ వెళ్లడం ఆయన అలవాటు. వక్తగా వెళితే వేదిక మీద లేకుంటే శ్రోతగా వేదిక ముందు. ఆయనతో చేయి కలిపేందుకు గొంతు కలిపేందుకు తహతహలాడిన రోజులెన్నో..

రాఘవాచారి 1939, సెప్టెంబరు 10న ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం, శాతాపురంలో సనాతన శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టారు. నుదుట నామాలు, గుండు, పిలక. సికింద్రాబాదు లాలాగూడ రైల్వే పాఠశాలలో అయిదో తరగతి పూర్తయ్యే వరకు ఇదే వరస. ఆరో తరగతిలోనో ఏడులోనో ఆ ఆహార్యానికి స్వస్థి పలి కినట్టు ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. 1953 నుంచే విశాలాంధ్ర చదవడం అలవాటైంది. ఎర్రజెండా ఇష్టమైంది. నిజాం కళాశాలలో పి.యు.సి.. ఉస్మానియా యూనివర్శిటీలో ఆరో ర్యాంకు. తర్వాత ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి మధ్యలోనే వదిలేసి ఓరుగల్లు బాట పట్టారు. బీఎస్సీ చదివారు. మళ్లీ హైదరాబాదు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ఎల్‌.ఎల్‌.ఎం. చేశారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ లో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఏఐఎస్ఎఫ్. అభ్యర్ధిగా లా-కళాశాల విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు. పాలకుర్తి తెలంగాణ సాయుధ పోరాట కేంద్రం. అక్కడి ప్రముఖులుగా పేరొందిన ఐదారుగుర్లో చుక్కా రామయ్య, అంపశయ్య నవీన్, రాఘవాచారి ఉంటారు.

2022 జూన్ 12 ఆదివారం. హైదరాబాద్. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధుం భవన్. నేనూ, మిత్రుడు పంతంగి రాంబాబు కాస్తంత నీరసంగా, మరికొంత ఆలస్యంగా బయలుదేరి మఖ్దుంభవన్ నాలుగో ఫ్లోర్ కి చేరాం. మేమనుకున్నట్టే 50,60,70 ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువ మంది, 30, 40 ఏళ్ల మధ్య వాళ్లు చాలా తక్కువ మంది. వక్తలు వేదిక మీదున్నా కుర్చీలప్పుడే నిండుతున్నాయి. రాఘవాచారంటే అభిమానమున్నోళ్లు ఒక్కొక్కళ్లే వస్తున్నారు. ఒకప్పుడు బెజవాడలో ఉన్నాం కనుక రాఘవాచారిగారు, వారి భార్య, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కనపర్తి నాగయ్య గారి కుమార్తె జ్యోత్స్నగారు కూడా పరిచయస్తులే. సమకాలీన సంపాదకుల్లో రాఘవాచారిగారిది విశిష్ట వ్యక్తిత్వం. అటువంటి మనిషికి నివాళిగా ఆయన సంపాదకీయాల రెండో సంపుటిని తీసుకువస్తున్నారని తెలిసి వెళ్లాం. వేదిక మీదున్న వక్తలు, వేదిక ముందున్న సభికులూ అందరూ రాఘవాచారిగారి ఆత్మీయులే. విశాలాంధ్ర ప్రస్తుత సంపాదకుడు ఆర్వీ రామారావు, ప్రముఖ కవి అంపశయ్య నవీన్, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి తదితరులు వాళ్ల జ్ఞాపకాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. వాటి సమాహారమే ఈ నాలుగు మాటలు..

“1962 ఫిబ్రవరి.. లోక్ సభ ఎన్నికలకు తెర లేచింది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సహా కాంగ్రెస్ పెద్దలు గెలుస్తారా లేదా అనే దానిపై ఎవ్వరికెటువంటి అనుమానం లేదు. కానీ దేశం యావత్తూ మాత్రం నార్త్ ముంబాయి నియోజకవర్గం వైపు చూస్తోంది. అక్కడ పోటీ చేస్తోంది ఇద్దరు ఉద్దండ పిండాలు కావడమే కారణం. ఒకరు కమ్యూనిస్టుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నెహ్రూ అనుచరుడు వెంగలీల్ కృష్ణన్ కృష్ణ మీనన్ (వీకే కృష్ణమీనన్) కాగా మరొకరు ఆచార్య జీవత్రాం భగవాన్ దాస్ కృపలానీ (జేబీ కృపలానీ). ఇద్దరూ ఇద్దరే. హోరాహోరీ ప్రచారం. ఇంతలో కృపలానీ నాటకీయంగా ఓ ప్రకటన చేశారు. కమ్యూనిస్టు పార్టీని బహిరంగంగా విమర్శిస్తూ తాను కమ్యూనిస్టును కాదని వీకే మీనన్ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కృపలానీ స్టేట్మెంట్. అదైతే జరగలేదు గానీ వీకే మీనన్ మాత్రం నార్త్ ముంబాయి నుంచి అఖండ మెజారిటీ గెలిచారు. సీన్ కట్ చేస్తే…
అదే ఏడాది ఫిబ్రవరి. హైదరాబాద్ లా కళాశాల. ఓ యువకుడు హైదరాబాద్ లో కమ్యూనిస్టు అభిమానులందర్నీ కూడేసి మార్క్సిజాన్ని నూరిపోస్తున్నాడు. పనిలో పనిగా కృష్ణ మీనన్ గెలవాల్సిన అవసరాన్ని వివరిస్తూ కరపత్రాలు వేసి పంచుతున్నారు. ఆ యువకుడే చక్రవర్తుల రాఘవాచారి. ఎలియాస్ విశాలాంధ్ర రాఘవాచారి. వరంగల్.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. వార్షికోత్సవ సందర్భం. డాక్టర్ వైద్యనాధన్ ప్రిన్సిపల్. ఆంగ్ల సాహిత్యంపై చర్చ. William Shakespeare ఆంగ్ల సాహిత్యంలో గొప్పోడన్నారు డాక్టర్ వైద్యనాధన్. దానికి కౌంటర్ గా ఓ విద్యార్ధి Shakespeare కంటే కూడా George Bernard Shaw గొప్పోడన్నారు. అంతే.. హాల్ మూగబోయింది. అదెలాగో చెప్పమన్నారు ప్రిన్సిపల్. ఆ విద్యార్ధి ఏకధాటిగా బెర్నాడ్ షా పై అరగంట సేపు ప్రసంగించాడు. భేషనిపించుకున్నాడు. ప్రిన్సిపల్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ముక్కున వేలేసుకుని “ఇంత చిన్న వయసులో అంత ఆంగ్ల సాహిత్యం ఎలా చదివా”వని ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్ధే సి.రాఘవాచారి.

ఇంకొక్కసారి వీకే కృష్ణమీనన్ ప్రస్తావన. “కృష్ణమీనన్ 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రక్షణ శాఖ మంత్రి అయ్యారు. ఇంతలో చైనాతో యుద్ధం వచ్చింది. ఇండియా ఓడింది. మీనన్ రాజీనామా చేయకతప్పలేదు. అది వేరేవిషయం. మంత్రి హోదాలో హైదరాబాద్ పిలిపించుకుని ఆయన ఉపన్యాసం వినాలన్నది ఉస్మానియా విద్యార్ధులు – ప్రత్యేకించి నాటి వామపక్ష అభిమానుల కోరిక. అంపశయ్య నవీన్, వరవరరావు లాంటి వాళ్లు ఆ బాధ్యతను రాఘవాచారికి అప్పగించారు. లా కళాశాల ప్రెసిడెంట్ హోదాలో రాఘవాచారి వీకే కృష్ణమీనన్ ను ఆహ్వానించారు. సభలో మాట్లాడేందుకు ఆయన లేచినిలబడగానే ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలతో నిరసించారు. ఈ గోల మధ్యలోనే వీకే కృష్ణమీనన్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతే…నిరసనకారుల నోళ్లు మూతపడ్డాయి. ఉపన్యాసం పూర్తయ్యాక లెఫ్టిస్టులూ, రైటిస్టులూ అందరూ రాఘవాచారిని చాలా మెచ్చుకున్నారు.” ఇలా తన అమూల్య జ్ఞాపకాల్ని పంచుకున్నారు అంపశయ్య నవీన్.

వక్తలందరి స్మృతులు విన్నతర్వాత 30 ఏళ్ల పరిచయమున్నా రాఘవాచారి గురించి ఏమీ తెలియదనిపించింది.లూయి ఫిషర్ అనే రచయిత “20వ శతాబ్దపు చరిత్రనంతా ఒక్కమాటలో చెప్పాలంటే అది లెనిన్” అన్నాడట. యావత్ వామపక్ష జర్నలిజం గురించి అలా చెప్పాల్సి వస్తే రాఘవాచారి పేరు చెప్పాలేమో. ‘ Editor of Editors’ అన్నారొకరు, ‘కిరాతకమైన జ్ఞాపకశక్తి కలవాడ’న్నారు ఇంకొకరు. ‘ సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న మహామనీష’న్నారు మరొకరు. ‘మీరు మరేదైనా పత్రికలో ఉంటే బోలెడంత జీతం, ఎంతో కీర్తిప్రతిష్టలు వచ్చేవి కదా!’ అని ఓ పెద్దాయన అంటే దానికి రాఘవాచారి.. “visalaandhra is my heart and soul” అన్నారట. సాక్షాత్తు నార్ల వారే రాఘవాచారి పెద్ద జిజ్ఞాసపరుడ’న్నారట. చిన జీయర్ స్వామి ఓ సందర్భంలో ‘నాకన్నా గొప్పవాడు మీ రాఘవాచారి’ అన్నాడంటే ఆయనకు సంస్కృతంపైన, వేదాలపైన ఎంత పట్టుందో అర్థమవుతుంది. ‘ఇంతపరిజ్ఞానమున్న మీరు ఏదన్నా రాయొచ్చు కదా!’ అంటే… ‘మనమేమన్నా కాళిదాసు కవిత్వం కన్నా, వాల్మీకి రామాయణం కన్నా, వ్యాసుడి మహాభారతం కన్నా గొప్పగా రాస్తామా!’ అనే వారు. ఇలా ఒకటా రెండా..ఎన్నో.. ఎన్నెన్నో!

1969–71లో ఢిల్లీ నుంచి వెలువడే వామపక్ష అనుకూల పేట్రియాట్‌, న్యూఏజ్ ఇంగ్లీషు పత్రికలకు విలేకరిగా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన రాఘవాచారి కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు 1971లో విజయవాడలో విశాలాంధ్రలో చేరారు. రాఘవాచారిని పేట్రియాట్ లో కొనసాగించమని అరుణ అసఫ్ అలీ అడిగితే కాదని, చండ్ర రాజేశ్వరరావు విశాలాంధ్రకు తీసుకొచ్చారట. 28 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్న రాఘవాచారి ప్ర‌జాప‌క్ష పాత్రికేయుడు. 9వేలకు పైగా సంపాదకీయాలు ఆయన సొంతం. ఇప్పుడు వాటిని గ్రంథస్తం చేసే పనిని సి.రాఘవాచారి ట్రస్ట్ (విజయవాడ) తలకెత్తుకుంది. పాఠకుడుతలకెక్కించుకునే రాతల్ని ఏరి కూర్చేపని ఈ ట్రస్ట్ తలపెట్టింది. ఇందుకు నడుంకట్టిన అక్కినేని చంద్రరావు, వై.వి.కృష్ణ, అక్కినేని వనజ, కె.జ్యోత్స్న, ఆర్వీ రామారావు, డీవీవీఎస్ వర్మ, ప్రొఫెసర్ ఎన్.అంజయ్య, పాత్రికేయులు డి.సోమసుందర్, మందలపర్తి కిషోర్ తదితరులకు మనస్ఫూర్తిగా వందనాలు.
చివరిగా నాదో సూచన… ఆ పుస్తకాలకు ‘అక్షర శస్త్రధారి చక్రవర్తుల రాఘవాచారి’ సంపాదకీయాలు అనే పెట్టేకన్నా ‘విశాలాంధ్ర రాఘవాచారి’ సంపాదకీయాలంటే బాగుంటుందేమో.
కవి అదృష్టదీపక్ అన్నట్టు..
“చతుర్వేద పాండిత్యం- సామ్యవాద సాంగత్యం
భాషా శాస్త్రం, నాట్యం, సంగీతం, సాహిత్యం
సకలకళా ప్రావీణ్యం- అణువణువున చైతన్యం
అవధి లేని విజ్ఞానం- అహమెరుగని వ్యక్తిత్వం.”

– అమరయ్య . ఎ.
9347921291

LEAVE A RESPONSE