- రుణ రికవరీ ఏజెంట్లు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల సమయం లోపల మాత్రమే రుణ గ్రహీతలకు ఫోన్ చేయాలి
- బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
రుణ వసూలు విషయంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. రుణ గ్రహీతతో పాటు అతడికి సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాక అర్థరాత్రి వేళల్లో, వేకువ జామున సైతం ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అధికమవుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ బ్యాంకులు, రుణ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాత్రి 7 తరువాత ఫోన్ లు చేయొద్దు..
ఆర్బీఐ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీ) ఈ నిబంధనలను తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రుణ గ్రహీతల నుంచి రుణం వసూళు చేయాల్సి వస్తే ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటల వరకు మాత్రమే రుణ రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీతలకు ఫోన్ చేయాలని, రాత్రి 7గంటలు తరువాత ఫోన్లు కూడా చేయొద్దని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
రికవరీ ఏజెంట్లు రుణ వసూలు క్రమంలో మాటల రూపంలో, భౌతికంగా రుణ గ్రహీతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకూడదని, ఈ విషయాన్ని బ్యాంకులు తమ ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణ గ్రహీతల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని, వారిని భయపెట్టేందుకు కూడా ప్రయత్నించకూడదని, వారి గురించి తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ లో బ్యాంకులు, రుణ సంస్థలను ఆదేశించింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, అసెట్ రీకన్స్ట్రన్ కంపెనీలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణాలకు ఈ సర్క్యూలర్ వర్తించదని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ లో పేర్కొంది.