– హేపెనింగ్ సిటీ వైజాగ్ వేదికగా చంద్రబాబు బృందం ఆగడాలు చెల్లవు
(విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)
తెలుగుదేశం మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు తన ఏలుబడిలో ‘కలల రాజధాని’ అమరావతి ‘నగర నిర్మాణం’ తేలిక కాదని తెలిసి మరీ నాటకాలు ఆడారు. నాలుగొందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ నిర్మాత తానేనని ఆయన గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్ తన పాలనలోనే మహానగరం అయిందనే కల్లిబొల్లి కబుర్లతో 2014లో విభజిత ఆంధ్రకు మొదటి సీఎం అయ్యారు టీడీపీ అధినేత.
రాజధాని పేరిట గుంటూరు, విజయవాడ మధ్య ‘న్యూ సిటీ’ కట్టడానికి చంద్రబాబు వేసిన ‘గట్టి పునాది’ ఆ దిశగా సాగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం చావు దెబ్బతిన్నాక కూడా అమరావతి కబుర్లతోనే నారా వారు కాలక్షేపం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్రకు గుండెకాయ విశాఖపట్నాన్ని రాష్ట్రానికి పాలనా రాజధాని చేయాలని సంకల్పించింది. ఆర్థిక పునాదులు పటిష్ఠంగా ఉన్న వైజాగ్ వైఎస్సార్సీపీ పాలనలో శరవేగంతో ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతతో వ్యవహరించాల్సిన తెలుగుదేశం వికృత చేష్టలతో ఉద్యమాల పేరిట విధ్వంసకాండకు తెగబడుతోంది. చంద్రబాబు అండ్ కంపెనీ అరాచక ఆందోళనలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంటే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చూడడానికి ఇష్టపడని టీడీపీ గావుకేకలు పెడుతోంది. జగన్ గారి ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల విశాఖపట్నం బ్రాండ్ వాల్యూ ఊహించని రీతిలో పెరుగుతోంది.
‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో వైజాగ్ బ్రాండ్ వాల్యూని తగ్గించే కుట్రలు ఫలించవు..
‘అమరావతే’ అని భీష్మించుకుని కూర్చోవడంతో తమకు ఉత్తరాంధ్రలో నిలువ నీడ దక్కదనే భయంతో ‘సేవ్ ఉత్తరాంధ్ర’ అంటూ దుర్మార్గమైన నాటకానికి స్క్రిప్టు రూపొందించారు చంద్రబాబు వర్గీయులు. కడుపుమంటతో, రాజకీయ అసూయాద్వేషాలతో తెలుగుదేశం తెరతీస్తున్న అబద్ధాలు, అర్థసత్యాల ప్రచారోద్యమం జనాదరణ లేక నీరుగారిపోతోంది. అయినా, ఈ పార్టీ భజనలో తరించే మీడియా మద్దతుతో పరుపుపోయిన టీడీపీ నేతల వికృత నాట్యాల మధ్య చంద్రబాబు గారి ఘీంకారాలు ఆగడం లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల చేష్టలు, ప్రకటనల వల్ల గత మూడేళ్లుగా పెరుగుతున్న విశాఖపట్నం ప్రతిష్ఠకు హాని జరుగుతుందనే ఆలోచన ‘విజనరీ’ మాజీ సీఎంలో కనిపించడం లేదు.
ఉత్తరాంధ్రను కాపాడతామనే పేరుతో విశాఖనగరానికి కీడు చేస్తున్నామనే వాస్తవం 72 ఏళ్ల నేత కళ్లకు కానరావడం లేదు. తన హయాంలో రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చేసిన నష్టం ఆయన మరిచిపోయారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలు వేగంగా విస్తరించే అవకాశాలున్న హైదరాబాద్ ను అభివృద్ధి జరుగుతున్న నగరం అనే అర్ధంలో ‘హేపెనింగ్ సిటీ’ అనేవారు. అదేవిధంగా నేడు విశాఖ కూడా ప్రగతిశీల నగరంగా పరుగులు పెడుతూ మరో హేపెనింగ్ సిటీ అవుతోంది. ఈ తరుణంలో నగర అభివృద్ధికి గండికొట్టడానికి ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలను వారి నాయకుడు నిస్సుగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. ఓటమి పాలైన టీడీపీ ఏం చేయకూడదో అదేచేస్తున్నదనే వాస్తవాన్ని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు అందరూ గమనిస్తున్నారు.