ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా అన్ని సర్టిఫికెట్లు అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చూచిరాతల అవకాశం ఉండడంతోనే జిల్లా, పక్క జిల్లాలనుండి, సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్, డిప్లొమా, ఎంబీఏ అభ్యసించేందుకు తాడిపత్రి, గుత్తి ని ఎంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.మంచి మార్కులు రావాలని చూచిరాత కు అవకాశం ఇస్తే విద్యావ్యవస్థ నాశనమవుతుందని, కాగితపు డిగ్రీలతో ప్రయోజనం లేదు కడుపునింపే డిగ్రీల కోసం విద్యార్థులు సంసిద్ధం కావాలి. ఇలాంటివి ప్రోత్సహిస్తున్న కళాశాలపైన, కళాశాల యాజమాన్యం పై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
‘‘చదివి రాస్తున్నారా? చూసి రాస్తున్నారా ? అన్న ప్రశ్నకు సమాధానం చూసి రాస్తున్నారు. కళాశాలల్లో పట్టుమని నాలుగు గదులు ఉండవు కానీ ఎంబీఏ చదివే వారి సంఖ్య 180 విద్యార్థులకు తక్కువ కాకుండా ఉంటుంది. పిజి కోర్సులకు చదువు చెప్పే వారు ఉండరు, కళాశాలల్లో ఎప్పుడు వెళ్లిన స్మశాన ప్రశాంతత నెలకొని ఉంటుంది. పరీక్షల సమయంలో కళాశాలలు సందడిగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ఐదు వేల నుండి పదివేలు సమర్పించు కోవాల్సిందే. ఈ కళాశాలల్లో ఆస్థాన విద్వాంసులు ఏళ్ల తరబడి ఇక్కడే అదే కళాశాలల్లో పనిచేస్తూ ఇలాంటి విషయాల్లో మంచి గా ఆరితేరి ఉంటారు.
వీరిని ఇక్కడ నుండి తప్పించిన అదే యాజమాన్యం వారి సేవలను ఇలాంటి కళాశాలల్లో వినియోగించుకోవడానికి యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి బేవర్సు పనులు చేసే బ్యాచికి రాష్ట్రంలో ఉన్నత విద్యాధికారులు దగ్గర నుండి విశ్వవిద్యాలయ అధికారులు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. పరీక్ష ఏదైతేనేమి విద్యార్థికి డెబ్భై శాతం మార్కులు తెప్పించడంలో కృతకృత్యులవుతున్నారు. ఇంటర్నల్ పరీక్షలు పిజి లో వ్రాయరు, ఆన్లైన్ అస్సైన్మెంట్, ఆన్లైన్ పరీక్షలు వేరే విద్యార్థులతో అధ్యాపకులతో రాసినందుకు వీటికి ఐదు వేలు సమర్పించుకోవాల్సిందే.
ఎలాగైనా 70 శాతం మార్కులు రావాలని కోరుకుంటున్న విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాలిటెక్నీక్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కొన్ని సంవత్సరాలు చదువు చెప్పక పోయిన కళాశాలకు అఫిలియేషన్ ఇస్తున్నారు. అలాగే ల్యాబులు లేకపోయినా కళాశాలలు అద్దెకు ఇచ్చినా పట్టించుకునే నాథుడే లేడు. విశ్వవిద్యాలయ అధికారులు ఇలాంటి కళాశాలలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారు. ఇన్ని అనర్థాలకు దారి తీస్తున్న విశ్వవిద్యాలయ అధికారులతో పాటు విద్యా శాఖ కార్యదర్శులను, కళాశాల యాజమాన్యం ని చూచిరాతలకు బాధ్యులుగా చేయాలని, అప్పుడే కొంత ఫలితం ఉంటుందని పౌర సమాజం భావిస్తున్నది.
చూచిరాత ఎక్కువగా జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబ్జర్వర్, ఎగ్జామినేషన్ స్క్వాడ్ తప్పనిసరి చేయాలి. పరీక్ష కేంద్రాల నుండి ఆన్సర్ బండిల్ ఎప్పుడు పంపుతున్నారో గ్రహించాలి. చాల చోట్ల ఇంపర్సనేషన్, ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాయటం జరుగుతున్నది. . ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో యూనివర్సిటీ అధికారులు తెలపాలి. చూచిరాతకు అనుమతించే ఇన్విజిలేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని సర్క్యులర్ జారీ చేయాలి. గుత్తి తాడిపత్రి ల్లో నెలకొన్న కళాశాలల్లో అధ్యాపకులు లేరు కేవలం బ్రోకర్లు ఉంటున్నారు.
చాలా కళాశాలలు సమస్యాత్మక సెంటర్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెబుతారు కానీ అవి ఎప్పుడు పనిచేయవు. విచ్చలవిడిగా చూచిరాత జరుగుతున్నా , పరీక్ష బండిల్ ఎప్పుడు పంపినా, అధ్యాపకులు కాకుండా అటెండర్లు స్వీపర్లు ఇన్విజిలేషన్ చేసిన, ఇన్విజిలేషన్ చేసిన అధ్యాపకులకు రెమ్యునరేషన్ ఇవ్వకున్నా విశ్వవిద్యాలయం పట్టించుకోదు, చర్యలు తీసుకోదు విశ్వసనీయ వర్గాల సమాచారం తాడిపత్రి, గుత్తి పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కళాశాల రెండు పిజి కళాశాలల విద్యార్థులు గత వారం రోజుల నుంచి మరో ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. యథేచ్ఛగా పుస్తకాలు ముందర పెట్టుకుని పక్కపక్కనే కూర్చొని పరీక్షలను రాస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇందుకు పరీక్షా కేంద్రం యాజమాన్యం సహకరిస్తుండడం, యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చూచిరాతల కోసం విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యం ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో పరీక్షా కేంద్రం యాజమాన్యాలకు, యూనివర్సిటీ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు బెంగళూరు లో చిన్న ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉద్యోగస్తులు కొన్నేళ్లుగా క్యూ కడుతున్నారు.
– డా ఏ. నాగ ప్రతాప్ రెడ్డి, ఎండి, వేద లాబ్స్