ఇది జరిగిన యదార్థ సంఘటన
ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుని పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్, వయస్సు 65 సంవత్సరాలు. ఈయన తిరుచ్చిలో నివాసముంటున్నారు. ఈయన్ని అందరూ కిట్టూ మామ అని పిలుస్తుంటారు .
వీరు పేద బ్రాహ్మణులు, వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లి కొట్టు. తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది. వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా, తనకున్నదాంట్లో ఆకలితో బాధపడేవారికి అన్నం పెడుతూ, తన స్థాయికి తగిన దాన ధర్మాలు కూడా చేస్తుంటారు .
ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్, మద్యం తాగి, తన వాళ్ళతో కిట్టు మామ కొట్టుకు వచ్చి కడుపు నిండా తినాడు. తను తిన్నవాటికి బిల్లు కట్టమని కిట్టు మామ భార్య అడిగితే, పాండియన్ కు కోపం వచ్చింది. ఈ ప్రాంతపు కౌన్సిలర్ నే డబ్బులు అడుగుతారా అంటూ, కొట్టులోని సామాన్లను బయట పారేసి గొడవ చేసాడు .
అడ్డుగా వెళ్ళిన కిట్టు మామను తిడుతూ, బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ తన జంధ్యం పట్టుకున్నాడు. అప్పటి వరకూ ఒర్చుకున్న కిట్టు మామకు జంధ్యం పట్టుకోగానే ఒక్కసారిగా విరుచుకుపడి, పక్కనే ఉన్న కర్రతో పాండియన్ న్ను, తన పరివారాన్నీ చితకబాది, నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జాగ్రత్త అన్నాడు. దాంతో అహం దెబ్బ తిన్న పాండియన్ నీ అంతు చూస్తా, రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు .
మరుసటి రోజు పాండియన్ కొట్టు దగ్గరకు రాలేదు, కానీ కిట్టు మామకు ఒక విషయం తెలిసింది, నిన్న రాత్రి గొడవ పడి వెళ్తున్న పాండియన్ బండికి ఆక్సిడెంట్ అయ్యింది అని, అంతే కాదు ఆ ఆక్సిడెంట్ లో పాండియన్ కు బలమైన గాయాలయ్యాయని, రక్తం చాలా పోయిందని … అయితే పాండియన్ కు వెంటనే ఆపరేషన్ చేయాలి అని, అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది, వారి దగ్గర స్టాక్ లేదని, ఆ బ్లడ్ గ్రూపు వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్త దానం చేయమని చెప్పారట, విచిత్రంగా కిట్టు మామ బ్లడ్ గ్రూపు కూడా అదే కావడంతో.. వెంటనే కిట్టు మామ హాస్పిటల్ కు వెళ్ళి, రక్త దానం చేసి, ఆపరేషన్ అయ్యేంత వరకూ ఉండి వెళ్ళాడు . ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక కిట్టు మామ చేసిన సహాయం గురించి తెలుసుకునిన పాండియన్, వెళ్ళి క్షమాపణ చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు .
అప్పుడు కిట్టు మామ అన్న మాటలు ” అయ్యా, ఆరోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని, మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేశారు, మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను, కానీ మీరు నా జంధ్యం తెంపాలని ప్రయత్నించారు, ఒక బ్రాహ్మణుడిగా జంధ్యం కాపాడుకోవడం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను, మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడడం కూడా నా కర్తవ్యం అని వచ్చి రక్త దానం చేశాను, అంతే తప్పా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంత డబ్బు నాకు అవసరం లేదు, మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట ” …
కిట్టు మామ ఔదార్యానికి పాండియన్ కన్నీళ్ళ పర్యంతమయ్యాడట … అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే మనసుకెంతో ఆనందం కలిగింది.
– ఎంబిఎస్ గిరిధర్‌రావు