( బాబు భూమా)
విభజన అనంతరం తొమ్మిది నెలలకు తొలి ఉగాది వేడుకలు అమరావతిలోని అనంతవరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామిడికాయతో సహా అన్ని రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఆ పండుగ వేళ నాయుడుకు మరో శుభవార్త అందింది – ఆయన తాతయ్య అయ్యారని! లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు.
పదేళ్లు గడిచాయి.
ఈ ఏడాది అమరావతిలో ఊగాది వేడుకలు పదిరోజుల క్రితం జరిగాయి.
ఇవ్వాళ..
“ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై !!”
అని పోతన వర్ణించిన వామనుడి వలె, పదేళ్ల మనవడు తాతలాగే తల వంచి కొబ్బరికాయ కొడుతూ పూజలన్నీ చేశాడు. రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తమ ఆనందమైన కుటుంబం కోసం నిర్మించుకుంటున్న గృహ శంకుస్థాపనకు మనవడు తోడుగా నిలిచాడు.
విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించి, అక్కడే నివసిస్తూ పాలన సాగించారు చంద్రబాబు. 2019 వరకు రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన ఆయన, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. దేశ, విదేశీ సంస్థలను రప్పించి అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు.
తాజాగా, వెలగపూడి సచివాలయం వెనక కొనుగోలు చేసిన భూమిలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడంతో ప్రజల్లో నమ్మకం, భరోసా ఏర్పడ్డాయి.
అమరావతిపై కుట్రలు జరిగినప్పుడు రైతులకు, ప్రజలకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు, ఇప్పుడు సొంతిల్లు నిర్మించుకోవడం పట్ల రాజధాని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో జోరందుకున్న నిర్మాణ పనులు, చంద్రబాబు నివాసంతో ఈ ప్రాంతానికి కొత్త శోభ వస్తోంది. కొన్ని కొన్ని.. జరగాల్సినవే ఆ సమయంలో జరుగుతాయి అనిపిస్తుంది.
లోకాలన్నిటినీ పాలించే ఇంద్రుడున్న దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దండయాత్ర జరిగినా, విశ్వం యొక్క సమతుల్యత కాపాడబడుతుంది. దానిపై రాక్షసులు విజయం సాధిస్తే, అది భూలోకంతో సహా ఇతర లోకాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ధర్మం క్షీణించి, అధర్మం పెరిగే అవకాశం ఉంది. కానీ, అమరావతిపై రాక్షసుల దండయాత్ర అంతిమంగా వారి ఓటమికి మరియు దేవతల విజయానికి దారితీసింది.
ఇక్కడ కూడా ధర్మం గెలిచింది. ఇంద్రుడు ప్రతిష్టించిన భూలోక అమరలింగేశ్వర పాదాల వద్ద వీరి గృహ నిర్మాణంతో పాటు లక్షలాది ప్రజల నివాసాలు కూడా మొదలై ఆంధ్రులు గర్వపడే రాజధానిగా అమరావతి విరాజిల్లుతుంది. ఆంధ్రా సంక్షేమానికి కల్పవృక్షంగా మారడానికి అమరావతి శరవేగంగా అడుగులు వేస్తోంది.