Suryaa.co.in

Telangana

నయీం కేసు ఫైళ్లు ఏమయ్యాయి?

– అప్పుడు కాంగ్రెస్ నేతల ఆరోపణలేమయ్యాయి?
– భూకుంభకోణాల వెనుక ఉన్నవి బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలే
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, బీజేపీ – కాంగ్రెస్ కలిసి హైదరాబాద్‌లో భూకుంభకోణాలపై నిజాలు బయటపెడతానని చెప్పారు. కానీ వాస్తవానికి భూకుంభకోణాల వెనుక ఉన్నవి బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలే. తమపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ బిజెపిని బద్నాం చేసేలా మాట్లాడుతున్నారు.

ఎక్కడ వాళ్ల మధ్య ఉన్న అవినీతి, కుంభకోణాల వ్యవహారాల్లో సంబంధాలన్నీ బయటపడతాయేమోననే భయంతో.. ఆ ఆరోపణల నుంచి పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ మాట్లాడారు. గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఆగ్రహంగా మాట్లాడారు.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు రికవరీ చేస్తామని కూడా చెప్పారు. కానీ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అవినీతి, స్కాంల విషయంలో ఏ కేసు రిజిస్టర్ కాలేదు. ఏ నాయకుడు అరెస్ట్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో మిలాఖత్ అయి..గతంలో జరిగిన అవినీతి బయటపడకుండా రాజకీయాలు చేస్తోంది.

ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, రైతుల భూములను తమ పేర్లకు మార్చుకున్నారని రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి బయటపెడతామని చెప్పినా… ఒక్క ఎకరం కూడా తిరిగి ఇవ్వలేదు.

ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అదే పరిస్థితి. ఐపీఎస్ అధికారుల ద్వారా రాజకీయ నాయకులు, బిజినెస్ మేనేజర్లు, మీడియా ప్రతినిధుల ఫోన్‌లు ట్యాప్ చేయించారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ కేసును మున్ముందు విచారణకు లాగుతామని, తడాఖా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ అవినీతిని తవ్వింది లేదు.

కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తూ బిజెపి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. హెచ్‌సీయూ భూముల విషయంలోనూ ఇదే కుతంత్రం. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు విలువైన భూములను అమ్ముతున్నాయి.

భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై గళమెత్తింది. రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టుపెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో భూముల అమ్మకాలపై కూడా పోరాటం చేస్తోంది.

నయీం కేసులో వేల కోట్ల ఆస్తులు దొరికాయని, ఆ పత్రాలన్నీ బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. వేల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయి..? డాక్యుమెంట్లు ఎవరి చేతుల మీదుగా బదిలీ అయ్యాయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.

బీఆర్ఎస్ – కాంగ్రెస్ కలిసి అవినీతిని దాచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. ఇప్పుడు వారిని రక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ – మజ్లిస్ చేతులు కలిపాయి. భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌కు ధైర్యం ఉంటే ఆ వివరాలు బయటపెట్టాలి. లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిజెపి నాయకులు ప్రజాసేవలో నిక్కచ్చిగా ఉంటారు. బీఆర్ఎస్ లాంటి లాలూచీ రాజకీయాలకు దూరంగా ఉంటారు.

రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మెప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిజెపిని విమర్శిస్తున్నడు. తెలంగాణలో బిజెపి ని అడుగుపెట్టనివ్వమని రేవంత్ విమర్శించిండు. ఆల్రెడీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి గెలిచింది. ప్రజలు బిజెపి వైపు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.

LEAVE A RESPONSE