-శాశ్వత కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు
-ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
-నంద్యాల రూరల్ తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్
నంద్యాల: దేశంలోనే *నంద్యాల*కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, నంద్యాలను అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో నిలబడమే లక్ష్యంగా బృహత్ ప్రణాళికతతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మంగళవారం నంద్యాల రూరల్ తహసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఫరూక్, కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ లతో కలిసి ప్రారంభించారు.
రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం నంద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ మరియు రూరల్ విభాగాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రూరల్ తహసిల్దార్ కార్యాలయంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాజకీయంగా, విద్యాపరంగా, వ్యవసాయం , పారిశ్రామిక రంగం, సేవా రంగం తదితర రంగాలలో, సామాజిక,ఆర్థిక రంగాలలో నంద్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని అన్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాలను అన్ని రంగాలలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.