– రూ.251.69 కోట్లతో అభివృద్ధి పరుగులు పెట్టించిన మంత్రి గొట్టిపాటి
– ప్రాణం పోసుకున్న రహదారులు, సంక్షేమ వసతి గృహాలు
– బాలికల విద్య, సంక్షేమ పాఠశాలలు, పేదల వైద్యానికి పెద్దపీట
– వాడ వాడలా కమ్యునిటీ హాళ్లు, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు
– విజన్ 2047 లక్ష్యం దిశగా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి అడుగులు
అద్దంకి: రాష్ట్ర స్థాయిలో కీలకమైన విద్యుత్ శాఖను తనదైన రీతిలో ముందుకు నడిపిస్తున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్… తన సొంత నియోజకవర్గమైన అద్దంకిని ఏడాది కాలంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. రూ.251.69 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను మంత్రి గొట్టిపాటి అద్దంకి ప్రజలకు అందించారు. నియోజకవర్గంలో వాడ వాడలా కమ్యునిటీ హాళ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాలను చేపట్టారు.
అంతేగాక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు. అంతేగాక కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా బాలికలకు వసతి గృహాలను నిర్మించారు. విద్యకు బాలికలు దూరం కాకుండా విద్యార్థినీలకు సైకిళ్లను అందజేశారు. కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే సాయం ఆశించక, తనదైన శైలిలో సీఎస్ఆర్ నిధులను కూడా నియోజకవర్గంకు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాడు జన నాయకుడు గొట్టిపాటి.
ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి గురువారం అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు, జె.పంగలూరు మండలాల్లో పర్యటించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి గొట్టిపాటి… అనంతరం జె.పంగలూరు మండలం ముప్పవరం గ్రామంలో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ లను ప్రారంభించారు. ఆ తరువాత లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను 16 మంది చిరు వ్యాపారస్థులకు అందించారు.
సంతమాగలూరు మండలం సజ్జాపురం గ్రామంలోనూ పర్యటించిన మంత్రి, రూ.1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అద్దంకి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీసుకొచ్చిన విజన్ 2047 తోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కూటమితో ఊరట….
దార్శనిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో… కేవలం అద్దంకి నియోజకవర్గంలోనే రూ.251.69 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ ప్రత్యక్ష నరకం చూశారని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కూడా నాశనం చేశారని చెప్పారు.
రోడ్లను కూడా తవ్వేసి, గ్రావెల్ అమ్ముకున్న నీచమైన చరిత్ర వైసీపీ నాయకులదని విమర్శించారు. అభివృద్ధి జరగనీయకుండా…, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని గొట్టిపాటి ఆరోపించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కిలోమీటర్ రోడ్డు వేయకుండా, కనీసం మరమత్తులు చేయకుండా ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడల్ నియోజకవర్గంగా అద్దంకి….
ఒక్క ఏడాది కాలంలోనే అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో రూ.251.69 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులను పూర్తి చేసినట్లు మంత్రి గొట్టిపాటి ప్రజలకు వివరించారు. మొత్తంగా 832 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులను అందించామన్నారు. అదే విధంగా సుమారు 550 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు సీఎస్ఆర్ కింద ఉచితంగా సైకిళ్లను అందించామని., అద్దంకి నియోజకవర్గం మొత్తం మీద మరో 10,000 మంది బాలికలకు త్వరలోనే కొత్త సైకిళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా రూ.3.84 లక్షల తో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించామని మంత్రి తెలిపారు. 42 మంది దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు ఇప్పటికే పంపిణీ చేశామని త్వరలోనే మరో 100 మందికి అందిస్తామని చెప్పారు. 300 మందికి పైగా తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు ఇచ్చామని చెప్పారు. మేదరమెట్ల గ్రామంలో 374 మంది ఎస్టీ కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు పత్రాలను అందించడం, దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం, వివిధ సామాజిక వర్గాల ఉపయోగార్థం కమ్మూనిటీ హాళ్ల నిర్మాణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారికీ…. కూటమితోనే న్యాయం….
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, ఈబీసీ వర్గాలన్నింటికీ కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాసంగులపాడు, పమిడిపాడు, కుంకుపాడు, మోదేపల్లి, భూదవాడ, కొమ్మినేనివారిపాలెం, కొండమూరు, ఏల్చూరు, రావినూతల, తక్కెళ్లపాడు, నాగులపాడు గ్రామాల్లో రూ.2.99 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రూ.40 లక్షలతో పంగలూరు, టీ.కొప్పెరపాడులో అభివృద్ధి పనులు చేశామన్నారు.
అదే విధంగా కొమ్మాల పాడులో కాపు సామాజిక వర్గానికి కూడా రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. వీటితో పాటు కోట్లాది రూపాయిలతో నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో కొత్తగా 132\33 కేవీ సబ్ స్టేషన్ తో పాటు 10 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు చెప్పిన మంత్రి గొట్టిపాటి.., మొత్తంగా రూ.82 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టామని వెల్లడించారు.