Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించాలి

-పేద రోగులకు ఉచిత వైద్యసేవలు పునరుద్ధరించాలి
– ఇన్సూరెన్స్‌ కంపెనీల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోంది
– ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ఆలోచన విరమించుకోవాలి
– పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే కొత్తగా ఆస్పత్రుల నిర్మాణం
– మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించి, పేద రోగులకు ఉచిత వైద్యసేవలు పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పథకాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్న ఆయన, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ఆలోచన విరమించుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.

గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. నాటి సీఎం వైయస్‌ జగన్‌ దాదాపు 10 వేల విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేసి గ్రామ స్థాయికి వైద్యాన్ని విస్తరింపజేశారు.

మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు వైద్యసేవలందించేలా చూడడంతో పాటు, 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేశారు. నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను 10 పడకల స్థాయి నుంచి 30, 50 పడకలకు పెంచారు.

గ్రామీణ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిట్లు.. ఇలా దాదాపు 54 వేల పోస్టులు భర్తీ చేయడంతో పాటు 2800 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లను నియమించిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుంది.

పేదవారికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలన్న ధ్యేయంగా జగన్‌గారు పని చేస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయకుండా వాటిని సేఫ్‌ క్లోజ్‌ చేసి ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామంటున్నారు.

పీపీపీ విధానంలో ఆస్పత్రుల నిర్మాణం చేస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే గతంలో మాదిరిగానే ప్రజల నుంచి యూజర్‌ ఛార్జీలను వసూలు చేసే కుట్రకు తెరలేపున్నట్టుగా తెలుస్తుంది. టీడీప వారికి ప్రభుత్వ స్థలాలిచ్చి బిల్డింగులు కట్టించి వారికి సంపద సృష్టించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.

ఆయా ఆస్పత్రుల నిర్వహణకు, సిబ్బంది నియామకం, వారి జీతాలకు మళ్లీ యూజర్‌ ఛార్జీలు ప్రజల నుంచే వసూలు చేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఐదేళ్లు ఉచితంగా పొందిన వైద్యాన్ని చంద్రబాబు అందని ద్రాక్షగా మార్చబోతున్నారు.

గతంలో 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీకి రూ.700 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోతే, వైయస్‌ జగన్‌ వాటిని క్లియర్‌ చేయడంతో పాటు గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 14 లక్షల మందికి వైద్యం అందించారు. ఇందు కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 11 నెలల్లోనే రూ. 3500 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో వైద్యం అందించేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ముందుకు రాని పరిస్థితి కల్పించారు.

11 నెలలుగా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆస్పత్రుల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాస్తే కేవలం రూ.500 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులిపేసుకుంది. కనీసం సగం బకాయిలు కూడా చెల్లించకపోవడం చూస్తుంటే ఆరోగ్యశ్రీని నడపడం ఇష్టంలేక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హైబ్రిడ్‌ మోడల్‌ పేరుతో ఇన్సూరెన్స్‌ కంపెనీల చేతుల్లో పెట్టడానికే ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్‌ కంపెనీల చేతుల్లోకి వెళితే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలతో ఆస్పత్రులను నడపలేక, మూసేయలేక వైద్యం కోసం వస్తున్న రోగుల నుంచి డబ్బులు వసూలు చేసే దుస్థితికి ఆరోగ్యశ్రీని దిగజార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. బైపాస్‌ సర్జరీలకు రోగుల నుంచి అదనంగా లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించాలి. ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేసే కుట్రలను విడనాడాలి. వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేయకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉచితంగా వైద్యసేవలు అందించాలని డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

LEAVE A RESPONSE