‘గిరిజన ద్రోహి జగన్ రెడ్డి’ అన్న పేరుతో కరపత్రం విడుదల చేసిన అచ్చెన్న

– జగన్ రెడ్డి పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాలను కరపత్రంలో ప్రచురించిన తెదేపా
– కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధారు నాయక్, ఎస్టీ సెల్ నాయకులు

జగన్‌రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాలపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. అందులో తెదేపా హయంలో జరిగిన గిరిజన సంక్షేమం, జగన్ రెడ్డి పాలనలో జరిగిన గిరిజన ద్రోహంతో పాటు ఇటీవల కేంద్ర నేరగణాంక సంస్థ విడుదల చేసిన లెక్కలను కరపత్రంలో ముద్రించారు.

విడుదల సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి అన్న లక్ష్యంతో పనిచేశామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్టీలకు 35%, మహిళా పారిశ్రామిక వేత్తలకు 45% రాయితీ కల్పించాం. ఇళ్ల నిర్మాణం కోసం గిరిజనులకు రూ.50వేల నుండి రూ.లక్ష వరకు అధనపు సహాయం అందించాం.

గిరిజన గ్రామ పంచాయతీల్లో సమాచార సదుపాయాలను మెరుగుపర్చడానికి రూ.90 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో గిరినెట్ పథకం ద్వారా 184 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాం. 3.45 లక్షల మంది గర్భిణులకు, 7.40 లక్షల మంది బాలింతలకు గిరి గోరుముద్ద, 14.90 లక్షల మంది పిల్లలకు బాలామృతం 104 ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేస్తే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటిని పూర్తిగా నిలిపివేశారని అన్నారు.

తెదేపా ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం.ధారు నాయక్ మాట్లాడుతూ..జగన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2023 మధ్యకాలంలో గిరిజనులపై 1725 దాడులు, 63 మంది హత్యలకు,148 మంది గిరిజన మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి పాలనలో గిరిజనులపై అమానుషంగా దాడులు పెరిగిపోయాయి. జగన్ పాలనలో గిరిజనులపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు ఎన్నడూ జరగలేదు.

రాష్ట్రంలో గిరిజనులపై రోజుకో దాడి నిత్యకృత్యమైందని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు కత్తి పద్మ, ఈగా రాందాస్, బాలాజీ నాయక్, మొగిలి శ్రీనివాస్, రెడ్డన్న, చెన్నకేశవులు, బి.వెంకటేశ్వర్లు, ఇస్లావత్ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply