స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనే గాంధీజీకి ఘనమైన నివాళి

– రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడమే మహాత్మా గాంధీజీ కి ఘనమైన నివాళి అని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 2వ తేదీన గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ లో మహాత్మా గాంధీజీ 152 వ జయంతి వేడుకలను మద్య విమోచన ప్రచార కమిటీ ఘనంగా నిర్వహించింది.ఈ సభకు మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ స్వాతంత్ర ఉద్యమం తో పాటు గ్రామ స్వరాజ్య సాధన కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, తాగుడు మాన్పించడం కోసం, సామాజిక న్యాయం సాధన కోసం, మత సామరస్యం కోసం అహర్నిశలు కృషి చేసిన ధన్యజీవి అని కొనియాడారు.నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీజీ ఆశయాల లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ,శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజీ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారని, మత సామరస్యానికి పాటుపడి మతోన్మాదుల చేతిలో హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రపంచంలో రాజనీతిజ్ఞులుగా కొద్ది మందిలో మహాత్మాగాంధీజీ ఒకరన్నారు. శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ప్రవేశించిన తర్వాతనే ప్రజా ఉద్యమంగా మారిందని,బహుజనులు భాగస్వాములు అయ్యారని తెలిపారు.
శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి ప్రసంగిస్తూ నేడు ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఎమ్మెల్యే మద్దాల గిరి మాట్లాడుతూ పూజ్య బాపూజీ కలలు గన్న భారతావని కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో సామాన్యులను భాగస్వాములను చేసిన ఘనత గాంధీజీ అని తెలిపారు.సహాయ నిరాకరణ ఉద్యమం,అహింసా పద్ధతి,సత్యాగ్రహం లాంటి
వినూతన్న పోరాట పద్ధతులను స్వాతంత్ర ఉద్యమానికి అందించారన్నారు.
సభకు అధ్యక్షత వహించిన లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గాంధీజీ ఆశయమైన మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ మద్యం వినియోగాన్ని 40 శాతం,బీర్ వినియోగాన్ని 78 శాతం తగ్గించిందని పేర్కొన్నారు.గ్రామ స్వరాజ్ లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను,సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
తొలుత నాయకులు అందరూ కలిసి మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సేవలను గుర్తించి స్మరించుకున్నారు.జై కిసాన్ జై జవాన్ నినాదాలను భారతీయులకు అందించారని,అమూల్ సంస్థ స్థాపనకు తోడ్పడిన నిస్వార్థ రాజనీతిజ్ఞులు లాల్ బహుదూర్ శాస్త్రి అని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా రంగం ప్రజా సాంస్కృతిక వేదిక పలు పాటలను ఆలపించి ప్రజలను ఉత్తేజపరిచారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్.సజిల,ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్,రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సిహెచ్ చక్రపాణి,స్థానిక నాయకులు తులూరి సూరి బాబు, కిక్కురు శివరామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply