– జమ చేయవద్దని లేఖ రాశాం
– ఆయన ఒక సైకో రామ్
– అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు
– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. చట్టబద్ధంగా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధన. నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా, పెట్టుబడులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ కోసం, కార్పస్ ఫండ్ కింద పలు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా అదానీ కూడా రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఆదానీతో సహా ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదు. జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని లేఖ రాశాము. రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని లేఖలో పేర్కొన్నాం.
పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో అదానీ విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ నుంచి రూ.100 కోట్లు తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూసి వివాదాస్పదం చేయవద్దని కోరుతున్నా.
నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మీడియా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇవాళ్టి నా ఢిల్లీ పర్యటన ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావడానికి, ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రేపు తెలంగాణ లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై వారితో చర్చిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతుల కోసం రేపు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తాం.
కొంతమంది అర్రాస్ పాటలా నా పర్యటనకు లెక్కలేస్తున్నారు. నేనేమీ మీలా మోదీ ముందు మోకరిల్లాడానికి ఢిల్లీవెళ్లడం లేదు. ఎవరి కాళ్ళో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదు. గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కేంద్రం నుచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ తన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుంది.
రాజకీయ పక్షపాతం చూపకుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగలం. ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతాం. మీ కడుపు మంట, దుఃఖం మాకు తెలుసు.. మీ కాకి గోలను మేం పట్టించుకోము. ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదు. కార్యదీక్షతో తెలంగాణ అభివృద్ధి కోసం మేం ముందుకు వెళతాం. అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. పెట్టుబడుల విషయంలో ఎవరికీ ఆయాచిత లబ్ది చేకూర్చము. కేసీఆర్ లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. ఆదానితో ఇన్ని ఒప్పందాలు చేసుకున్నవారూ మాపై ఆరోపణలు చేస్తున్నారు.
మహారాష్ట్ర నాందేడ్ లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. వయనాడ్ లో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. రాష్ట్రానికి ఒకరకంగా, కేంద్రానికి ఒకరకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీని తిరస్కరించారు. బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆయన ఒక సైకో రామ్.. సైకో రామ్ గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదు.