Suryaa.co.in

Editorial

అమరావతిపై అన్నీ అబద్ధాలే!

– అమరావతి మునిగిపోతుందంటూ అబద్ధాల ప్రచారం
– ఓడినా వీడని వైసీపీ దుష్ప్రచారం
– వైసీపీ సోషల్‌మీడియాలో అబద్ధాల ‘వరద’
– బెజవాడ సాయంలోనూ అంతే
– వైసీపీ కార్యకర్తలకు టీడీపీ ముసుగు
– వాటితో వార్తల వైరల్
– చేష్టలుడిగిన కూటమి సర్కారు
– సర్కారు మౌనంపై కూటమి నేతల కన్నెర్ర
-చర్యల కొరడా ఝళిపించడంలో చేష్టలుడిగిందంటూ అసంతృప్తి
– జగన్ జమానాలో సోషల్‌మీడియాపై ఉక్కుపాదాన్ని గుర్తు చేస్తున్న తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఓ వైపు బెజవాడను ముంచెత్తిన భారీ వర్షంలో చిక్కుకున్న వారికి సాయం చేయడంపై సర్కారు దృష్టి సారిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ సోషల్‌మీడియా అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం గందరగోళానికి కారణమవుతోంది. ఇంతజరుగుతున్నా విషప్రచారం చేస్తున్న వారిపై జగన్ జమానా తరహాలో పోలీసులు, చర్యల కొరడా ఝళిపించడంలో తమ ప్రభుత్వం భయపడుతోందన్న విమర్శలు కూటమి కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులూ అహోరాత్రులు పనిచేస్తూ బాధితులకు సాయం అందిస్తుంటే, రాజధాని నగరమైన అమరావతి మునిగిపోతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై.. సర్కారు మౌనంగా ఉంటున్న తీరు కూటమి కార్యకర్తలు అసంతృప్తికి కారణమవుతోంది. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ విషప్రచారాన్ని అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో బాబు సర్కారు పూర్తి స్థాయిలో విఫలమైందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలంగా కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న వరస సంఘటనలు పరిశీలిస్తే.. బాబు సర్కారు మెతకవైఖరే వైసీపీ విజృంభణకు అసలు కారణమని పార్టీ వర్గాలు తేల్చేస్తున్నారు. దీన్ని బట్టి ఇకపై భవిష్యత్తులో కూడా వైసీపీ దూకుడు, ఆ పార్టీ సోషల్‌మీడియా-అనుకూల మీడియాను, సర్కారు ఏమీ చేయలేదన్న ముందస్తు నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో పాఠశాలలు, హాస్టళ్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న వరస ఘటనలపై, వైసీపీ సోషల్‌మీడియా జూలు విదిలించిన నేపథ్యంలో.. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఉదహరిస్తున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం-పార్టీలో ఒకరమైన నిస్తేజం-సమన్వయలోపం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇపపుడు బెజవాడలో భారీ వర్షాల నేపథ్యంలో.. అమరావతి మునిగిపోతోందంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు, ఎదురుదాడి చేయడంలో వ్యవస్థగా ప్రభుత్వం-పార్టీగా టీడీపీ విఫలమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నిజానికి సెక్రటేరియేట్‌కు వెళ్లే రహదారులన్నీ సాధారణంగానే కనిపించాయి. ఆ మార్గంలో ఎక్కడా నీరు నిలిచిన దాఖలాలు లేవు. ఐఏఎస్, ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాల మార్గం కూడా ఎక్కడా నీరు నిలిచిన దాఖలాలు లేవు. మందడం వరకూ సీడ్ యాక్సిస్ రోడ్డు ఎప్పటిమాదిరిగానే ఉంది. కాకపోతే ఆ మార్గాల్లో చిన్న గుంతలేమైనా ఉంటే అక్కడ నీళ్లు నిలిచాయే తప్ప, రాకపోకలకు ఆటంకం కలిగించే స్థాయిలో ఆ రహదారులు కనిపించవు. అయినప్పటికీ అమరావతి మునిగిపోతుందంటూ మొదలైన విష ప్రచారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

అసలు విజయవాడలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, వాటికి సమీపంలోని కాలనీల్లో ఎక్కడా వర్షం ప్రభావం కనిపించలేదు. బస్టాండు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాలే ముంపునకు గురయ్యాయి. వాగులకు సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న వారు, లోతట్టు ప్రాంతంలో ఇళ్లు, అపార్టుమెంట్లు నిర్మించిన ప్రాంతాలే మునకకు గురయ్యాయి. అయినా ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక స్పందించి, డ్రోన్లు-హెలికాప్టర్లు, ట్రాక్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేసింది. ఈ మూడురోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఇంటికి సైతం వెళ్లకుండా, సీఎం చంద్రబాబు వెంట ఉండి జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, బాధితులకు సాయం అందించడంలో సఫలీకృతులయ్యారు.

నిజానికి వరదనీరు మొత్తం కొండవీటివాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణాన దిలోకి ఎప్పటికప్పుడు వెళ్లిపోతుంటుందనేది బెజవాడ వాసులకు తెలిసిన విషయమే.

అయితే బెజవాడలో కురిసిన భారీ వర్షాలను బూచిగా చూపిస్తూ.. ఏకంగా అమరావతి మునిగిపోతోందంటూ వైసీపీ సోషల్‌మీడియా చేస్తున్న హడావిడికి, గుంటూరు-కృష్ణా జిల్లా వాసులు హడలిపోతున్నారు. ఆ వాదనకు మద్దతుగా కొన్ని పాత వీడియోలు, బాధితుల వాయిస్‌ను చూపెట్టడం ద్వారా, అమరావతి మునిగిపోతోందన్న భావనను నిజం చేసేలా మారాయి. దీనిపై రెండో రోజు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఖండించి హెచ్చరించినప్పటికీ.. ఆ ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరదించే ప్రయత్నాలేమీ పోలీసు చర్యల రూపంలో జరగడం లేదని, టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

బెజవాడలో ముంపు ప్రాంతాలు మునిగిన గ్రామాల్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలే.. ‘‘సహాయ చర్యలు తీసుకోవడంలో మా ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. మేం నిఖార్సయిన టీడీపీ యువగళం కార్యకర్తం. అయినా సరే ఉన్న నిజాలు చెబుతున్నాం. ఇప్పటిదాకా ఎవరూ రాలేదు’’ అని వైసీపీ అధికార చానెల్‌లో చెప్పడం సంచలనం సృష్టించింది. నిజానికి ఇలాంటి వైసీపీ కార్యకర్తలు చాలామంది టీడీపీ ముసుగులో మీడియాముందుకొచ్చి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంతో.. జనం కూడా అది నిజమేకామోసనే అభిప్రాయం ఏర్పడేందుకు కారణమయింది.

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడంతోపాటు, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేసే ఈ విష ప్రచారంపై.. గత వైసీపీ సర్కారు స్థాయిలో తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో, ఘోరంగా విఫమలయిందంటున్నారు. ఇది ఒకరకంగా తమ ప్రభుత్వ పిరికితనాన్ని ప్రత్యర్ధులకు సానుకూల సంకేతాలు పంపించడమేనని స్పష్టం చేస్తున్నారు.

జగన్ జమానాలో ఒక పోస్టును ఫార్వార్డ్ చేసి, కామెంటు పెట్టినందుకే అంకబాబు అనే ఓ సీనియర్ వృద్ధ జర్నలిస్టు, గుంటూరులో శంకర్‌విలాస్ యజమాని అయిన వృద్ధురాలిపై కేసులు పెట్టి జైలుకు పంపిన ైవె నాన్ని టీడీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. తమ ప్రభుత్వం ఆ స్థాయిలో సగం ధైర్యం కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

LEAVE A RESPONSE