– సమగ్ర సమాచారం అందజేయాలి
– సీడీటీఓల నియామకాలు ఇంకా చాలా చోట్ల జరగలేదు
– వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి
– ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదేశం
అమరావతి: ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అందజేయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని అధికారులను ఆదేశించారు. డేటా అనుసంధానంతో డేటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. కొన్ని శాఖల నుంచి అసమగ్ర డేటా, సమాచారం ఇస్తున్నారని అది సరికాదని సూచించారు.
ఆర్టీజీఎస్ ఏర్పాటు చేస్తున్న డేటా లేక్, డేటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖలు, విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో, విభాగాల్లో ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ని నియమించుకోవాలని గతంలోనే అన్ని శాఖలను ఆదేశించామన్నారు.
అయితే ఇప్పటికి కేవలం 202 విభాగాల్లోనే ఈ అధికారులను నియమించుకున్నారని, ఇంకా 136 విభాగాల్లో సీడీటీఓ నియామకం జరగలేదన్నారు. వెంటనే ఈ నియామకం జరగాలన్నారు. తద్వారా డేటా అనుసంధాన ప్రక్రియకు సంబధించి ఆ శాఖతో ఆర్టీజీఎస్ సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులుండవన్నారు. కొన్ని శాఖల నుంచి కొంత అసమగ్ర సమాచారం, అసమగ్ర డేటా పంపుతున్నారని, అలా కాకుండా వారివద్ద ఉన్న డేటాను సమగ్రంగా అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డేటాను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు.
ప్రభుత్వం ఒక సదాశయంతో డేటా అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు. తద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు ఎంతో మెరుగవుతుందని, ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వర సేవలందించేలా శాఖల పనితీరు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం వల్ల పాలన మెరుగుపరచడానికి ప్రభుత్వ సేవలు సులభంగా అందించడానికి యూస్ కేసెస్ రూపొందించవచ్చన్నారు.
శాఖల మధ్య సమన్వయ లేమితో కొన్ని సార్లు పనులు జాప్యం అవుతున్నాయన్నారు. కొన్ని సార్లు ఒక పని కావాలంటే ప్రభుత్వంలో రెండు మూడు నెలల సమయం కూడా పడుతోందని, అయితే డేటా అనుసంధానం వల్ల రూపొందించే యూస్ కేసెస్‌తో ఆ పని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం ఒక క్లిక్ తో పూర్తి చేయగలమని, టెక్నాలజీలో ఆ సౌలభ్యముందని, దాన్ని ప్రభుత్వ శాఖలన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యూస్ కేసెస్ తో సత్వర సేవలు
ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్న డేటాను ఆర్టీజీఎస్ డేటా లేక్‌తో అనుసంధానం చేయడంతో పాటు సేవలందించడంలో, పనీతీరు మెరుగుపరచుకోవడంలో తమకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు ఏంటీ వాటికి ఎలాంటి పరిష్కారాలు ఆశిస్తున్నారో కూడా తెలియజేస్తే ఆర్టీజీఎస్ ఆ దిశగా యూస్ కేసెస్ రూపొందించి ఆయా శాఖలకు అందజేసి సహకరిస్తుందన్నారు. రోజువారి ఆయా శాఖలు నిర్వహించే కార్యకలాపాలు సులభంగా సరళతరంగా నిర్వహించడానికి వీలుగా ఈ యూస్‌కేసెస్ ఉపయోగపడతాయన్నారు.
ఆర్టీసీలో జీపీఎస్ ప్రకియ వేగవంతం చేయాలి
ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆశయమని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ఆర్టీసీ అధికారులు సంప్రదించి త్వరితగతిన అవగాహన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తయితే వెంటనే గూగుల్ సంస్థ సహకారంతో ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.