Suryaa.co.in

Telangana

ఏప్రిల్ 13 నుంచి 25వ తేదీ వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్: భారతీయ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఏప్రిల్ 13 నుంచి 25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఏప్రిల్ 13వ తేదీ కార్యక్రమాలు
రాష్ట్రంలోని ప్రతి బూత్, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి, అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి శుభ్రపరిచి దీపాలంకరణ చేస్తారు. కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , కరీంనగర్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి శుభ్రపరిచి, పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ , జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీకి చెందిన ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, కార్యకర్తలు తమ తమ జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఏప్రిల్ 14వ తేదీ – అంబేద్కర్ జయంతి
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, స్థానిక పురప్రముఖులు, దళిత, బహుజన నేతలు, ఉద్యమకారులతో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివించే కార్యక్రమాన్ని బిజెపి చేపడుతుంది. ఏప్రిల్ 15 – 25 తేదీల మధ్య సదస్సులు.

ప్రతి జిల్లా కేంద్రంలో ప్రముఖ మేధావులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సంఘసంస్కర్తలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సెమినార్లు నిర్వహించబడతాయి. ఈ సమావేశాలకు బిజెపి రాష్ట్ర శాఖ నుండి ఇద్దరు ముఖ్య అతిథులు హాజరై ప్రసంగిస్తారు. ఈ సెమినార్లలో ప్రధానంగా ఈ అంశాలు చర్చించబడతాయి:

అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం వల్ల దేశ ప్రజలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ గురించి, గత 74 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎలా మోసం చేసిందో వివరణ, అలాగే గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ కి అందించిన గౌరవం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.

దళిత కుటుంబాలతో సామూహిక భోజనాలు:
బిజెపి నాయకులు, కార్యకర్తలు స్థానిక దళిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబాలతో కలిసి భోజనం చేయడం. తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాల వారికి అంబేద్కర్ సందేశాలను చేరవేయాలన్నదే బిజెపి లక్ష్యం.

LEAVE A RESPONSE