– మహిళలే లక్ష్యంగా ట్రోల్సింగ్‌తో చెలరేగిపోతున్నారు
– కూటమి ప్రభుత్వ అండతోనే సోషల్ మీడియాలో వీరి అరాచకం
– వైయస్ జగన్ కుటుంబంతో సహా అందరిపైనా తప్పుడు పోస్టింగ్స్- కిరణ్‌ను అరెస్ట్ చేసి శుద్దపూసలం అని నాటకాలు
– విచారణలో లోకేష్, చంద్రబాబు పేర్లు కిరణ్ చెప్పారు
– వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
– వైయస్ జగన్ కుటుంబంపై మాట్లాడిన హోంమంత్రిపై చర్యలేవి?
: నిలదీసిన వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ అండతోనే టీడీపీ తోడేళ్ళు, జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టింగ్‌లతో చెలరేగిపోతున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐ-టీడీపీకి చెంది చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి తాము శుద్దపూసలం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల విచారణలో వైయస్ జగన్ కుటుంబంపై లోకేష్, చంద్రబాబు చెబితేనే తాను అభ్యంతరక పోస్ట్‌లు చేశానని కిరణ్ అంగీకరించారని, వారిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అలాగే గతంలో వైయస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రిపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
ఐ-టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ ఇటీవల వైయస్ జగన్ కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీనితో కంగారుపడ్డ కూటమి ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేశామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని గొప్పగా ప్రకటించింది. ఇదే కిరణ్ గతంలో ఇటువంటి అభ్యంతర పోస్ట్‌లు ఎన్నో పెట్టారు. అలాగే చాలా మంది తెలుగుదేశంకు చెందిన సోషల్ మీడియా తోడేళ్ళు, జనసేన గుంటనక్కలు నిత్యం వైయస్ఆర్‌సీపీ వారిపై విషం చిమ్ముతూనే ఉన్నారు.
వారిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు మాత్రం వారిని కాపాడుతూ వచ్చారు. ఈ ప్రభుత్వ అండతోనే ఈ రోజు సోషల్ మీడియాలో సైకోలు పెరిగిపోయారు. ఇప్పుడు కిరణ్‌ను అరెస్ట్ చేయడం ద్వారా తాము నిస్పక్షపాతంగా పనిచేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకునేందుకు నాటకం ఆడుతోంది.
మా ఫిర్యాదులపై చర్యలేవి?
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివీస్ట్‌ల అరాచకాలపై వందల సంఖ్యలో ఫిర్యాదుల చేసినా ఇప్పటివరకు అరెస్టులు చేసిన పాపానపోలేదు. కనీసం మేమిచ్చిన కంప్లైంట్లు చదివారని కూడా మేం అనుకోవడం లేదు. ఎదుటి పార్టీ నాయకుల మీద బూతులతో దాడి చేసి, వ్యక్తిత్వ హననానికి దిగుతున్న ఇలాంటి వారి మీద కేసులు పెట్టడానికి మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రాదు.
ఎందుకంటే, వారిని పోషిస్తున్నది… వెనకుండి నడిపిస్తున్నది వీరే కాబట్టి. అడ్డంగా దొరికిపోయి మీ కుట్రలు బయటపడినప్పుడు, సమాజం నుంచి మీపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ఒకరిని అరెస్ట్ చేసినట్టు చూపించి మహిళల రక్షణ పట్ల గౌరవం, బాధ్యత ఉన్నట్టు కలరింగ్ ఇస్తారు. నిన్న కూడా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఐ-టీడీపీ సోషల్ మీడియా సైకో కిరణ్ బయటకొచ్చి చేసిన తప్పుకు క్షమాపణలు కోరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేం ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అందర్నీ అరెస్ట్ చేయాలి.
హోంమంత్రి అనితపై చర్య తీసుకోవాలి
ఒక మహిళ అయ్యుండి హోంమంత్రి అనిత మాట్లాడే మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. అమ్మ అనే పదాన్ని కూడా అసభ్యంగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ ఆమె గతంలో మాట్లాడిన మాటలకు ఆమెపై తక్షణం పోలీసులు కేసు నమోదు చేయాలి. కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈ సైకోలందరికీ దిశా నిర్దేశం చేస్తూ వెనకుండి నడిపిస్తున్నది మాత్రం సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లే అనేది స్పష్టమైంది.
గుంటూరులో దేవిక అనే చిన్నారి మీద టీడీపీ సైకోలు దారుణంగా ట్రోల్ చేస్తే ఒక్కరిమీదనైనా కేసు నమోదు చేయలేదు. మాజీ సీఎం వైయస్ జగన్ రాప్తాడు వెళితే ఆయన్ను ఉద్దేశించి రౌడీ అని సంబోధించడం కరెక్టేనా? వినే వాళ్లు వెర్రివాళ్లయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు తెలుగుదేశం డ్రామా పార్టీ కాబట్టి పైకి మహిళల మీద గౌరవం, బాధ్యత ఉన్నట్టు బాగా నటిస్తారు. కానీ ఆచరణలో మాత్రం చూపించరు.
వ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్‌లోనే ఉంది. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన నాటి నుంచే ప్రజలందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లోనే మాజీ ముఖ్యమంత్రి కొడుకును ఉద్దేశించి సైకో అనే పదం వాడింది చంద్రబాబు కాదా? ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక సైకో సైకో అంటూ ఆయన మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తూ పలు సందర్భాల్లో వైసీపీ నా కొడకల్లారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి ఆజ్యం పోస్తే, వాళ్లని చూసి టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే రెచ్చిపోతున్నారు. వైయస్ జగన్ ను ఉద్దేశించి సైకో అని మాట్లాడిన చంద్రబాబు మీద, వైసీపీ కార్యకర్తలను చెప్పుతో కొడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారా? ఐ-టీడీపీ అనే విషవృక్షాన్ని పెంచి పోషిస్తూ మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మంత్రి నారా లోకేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
మహిళల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతమంది టీడీపీ, జనసేన సైకోల మీద కేసులు పెట్టారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు, అరాచకాలు చేసిన వాళ్లంతా కాలర్ ఎగరేసుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉంటే రాష్ట్రంలో మహిళలంతా సంతోషంగా ఉంటారనుకుంటే ఆమె మాత్రం మహిళల భద్రత గురించి పట్టించుకోకుండా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్ ని తిట్టడానికే పరిమితం అయ్యారు.
11 నెలల కూటమి పాలనలో వేలమంది అమాయిక మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరిగితే ఒక్కరిని అయినా పరామర్శించి నేనున్నానని ఆమె భరోసా ఇచ్చిన దాఖలాలున్నాయా? మహిళగా, హోంమంత్రిగా ఆమె బాధ్యత తీసుకోలేరా? మేమిచ్చిన ఫిర్యాదులపై విచారణ ఏ స్థాయిలో ఉందో హోంమంత్రి చెప్పాలి.
నాపైనా సోషల్ మీడియా దాడి
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధిగా నాపేరు ప్రకటించిన నాటి నుంచి ఎన్నోసార్లు నన్ను సోషల్ మీడియాలో బూతులు తిట్టి మానసికంగా వేధించారు. నాకు అవకాశాలు రాకుండా చేసి నా వృత్తిని నాకు దూరం చేశారు. మాపై ఎన్ని వేధింపులకు పాల్పడినా భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. చేసే పని ఏదైనా మా నాయకులు వైయస్ జగన్ డైరెక్షన్‌లో నిబద్ధతతో చేసుకుంటూ పోతాం.
సోషల్ మీడియాలో మాపై వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ, జనసేన సైకోలపై ఇప్పటికైనా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళల మీద వేధింపులకు పాల్పడుతున్న సైకోలను అరెస్ట్ చేయడం చేతకాకపోయినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్న వైయస్సార్సీపీ కార్యకర్తల మీద మాత్రం పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీ4 అమలు కావడం లేదు. అక్రమాలు, అఘాయిత్యాలు, అరాచకాలు, అప్పులు పేరుతో ఏ4 ని అమలు అస్తున్నారు.