మరి ఎన్ టి ఆర్ , పివి లకు భారతరత్న ఎప్పుడు?

– అద్వానీకి అభినందనీయం
– పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్

అకలంక దేశభక్తుడు, పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానిని అత్యున్నత పౌరసత్కారం “భారతరత్న”తో గౌరవించడం అభినందనీయయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు మోడీ, గతంలో వాజపేయి ప్రధానమంత్రులుగా పనిచేయడానికి పునాదులు వేసిన దివంగత నందమూరి తారక రామారావుకు కూడా భారత రత్న ఇవ్వాలని యార్లగడ్డ కోరారు.

కాంగ్రెసేతర పక్షాలను ఏకత్రాటికి తీసుకువచ్చి ఎన్ టి ఆర్ ఒక వేదిక కల్పించారన్నారు. బడుగు, బలహీన వర్గాల గుండెలలో చోటు సంపాదించుకుని, వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తి హక్కు వంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిన యన్.టి.ఆర్. భారత రత్నకు అన్ని విధాల అర్హులన్నారు. తమిళనాడుకు చెందిన యమ్. జి. రామచంద్రన్ కు మూడు దశాబ్దాల క్రితమే “భారతరత్న”ఇచ్చారని గుర్తు చేసారు. ఈ క్రమంలో యన్.టి.ఆర్.కు “భారతరత్న” సత్కారాన్ని ఇచ్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని ప్రధానికి విన్నవించారు.

మరోవైపు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడి, గొప్ప దిశానిర్దేశం చేసిన పూర్వ ప్రధాని పి. వి. నరసింహారావుకు “భారతరత్న” ఇవ్వకపోవడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. ప్రణబ్ ముఖర్జీ కి “భారతరత్న” ఇవ్వడం అభినందనీయమే అయినా, పి. వి. నరసింహారావును “భారతరత్న”తో సత్కరించక పోవడం అన్యాయమని యార్లగడ్డ ఆక్షేపించారు. పి. వి. నరసింహారావు, యన్. టి. రామారావులను “భారతరత్న” తో గౌరవించాలని అమెరికాలో ఉన్న పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

Leave a Reply