ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
– సి ఎస్ .విజయానంద్
అమరావతి: రాష్ట్రాన్ని గంజాయి,డ్రగ్సు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పని చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు.సోమవారం నార్కో కోఆర్డినేషన్ కు సంబంధించి మొదటి రాష్ట్ర స్థాయి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని గంజాయి,డగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేదుంకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈలక్ష్యంతోనే గత నవంబరు నుండి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూపు ఫర్ లా ఎన్పోర్సుమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గంజాయి,డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాలతో కూడా ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకుంటూ వీటిని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రతి విభాగం కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
గంజాయి,డ్రగ్స్ కు బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు(డీ అడిక్షన్ కేంద్రాలను)పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సిఎస్ విజయానంద్ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.ప్రతి మూడు మాసాలకు ఒకసారి రాష్ట్ర స్థాయి కమిటీ సమవేశాన్ని నిర్వహించి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలక్టర్ల అధ్యక్షతన గల జిల్లా నార్కో కమిటీల సమావేశాలను కూడా క్రమం తప్పక నిర్వహించాలని ఆదేసించారు.
ఈసమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ. రాష్ట్రంలో గంజాయి సాగు చాలా వరకూ తగ్గిందని అయితే ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఎపి మీదగా గంజాయి రవాణా అవుతోందని దానిని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.గంజాయి,డ్రగ్స్ సరఫరా,రవాణా చేసే అంతర్ రాష్ట్ర గ్యాంగులకు సంబంధించిన డేటా బేస్ ను సిద్దం చేసి వివిధ విభాగాల సమన్వయంతో వాటి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇందుకు రైల్వే,రవాణా,పోస్టల్ తదితర విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.అంతేగాక గంజాయి,డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నిందుతులకు సంబంధించిన చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని ఆయా కేసులను సకాలంలో పరిష్కరించ గలిగితే ఈఅక్రమాలకు పాల్పడే వారిలో భయం ఏర్పడుతుందని చెప్పారు.
అంతకు ముందు ఈగల్ ఐజిపి మరియు స్టేట్ ఎన్కార్డు కన్వీనర్ ఎ.రవికృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో 2024లో జిల్లా స్థాయిలో 56 ఎన్కార్డు సమావేశాలను, 2025లో ఇప్పటి వరకూ 2 సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు.గంజాయి,ఇతర మత్తు పదార్ధాల రవాణా,సేవణం నియంత్రణకు 26 జిల్లాల్లో జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ పని చేస్తున్నాయని వివరించారు.అంతేగాక ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబరుతో పని చేస్తోందని చెప్పారు.ఈగల్,ఆర్డీజిఎస్,ఎపి డ్రోన్ కార్పొరేషన్,ఎక్సైజ్,జైళ్ళ శాఖలతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన కమిటీను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కాంప్రహెన్సివ్ డ్రగ్ అఫెండర్స్ కు సంబంధించిన డేటా బేస్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
కాగా 2024లో గంజాయి,డ్రగ్స్ కు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేపట్టి 1820 కేసులను నమోదు చేసి 53వేల 97 కిలోల గంజాయిని,815 వాహనాలను స్వాధీనం చేసుకుని 5వేల 45 మంది నిందుతులను అరెస్టు చేసినట్టు రవికృష్ణ వివరించారు.45 మంది నిందుతులకు శిక్షలు పడేలా చేయడం జరిగిందన్నారు.ముఖ్యంగా గంజాయి సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7 మండలాల్లో 375 గ్రామాల్లో హాట్ స్పాట్లను గుర్తించి డ్రోన్ల సాయంతో నిరంతర పర్యవేక్షణ చేసి 85 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మించినట్టు పేర్కొన్నారు.
గంజాయి సాగు చేయకుండా గిరిజన ప్రజలు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టేలా 22 రకాల పంటలకు సంబంధించి 46 లక్షల 82వేల 882 వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశామని చెప్పారు.అంతేగాక గంజాయి,మత్తు పదార్ధాల సేవణం చేయరాదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలు,ఇతర కమ్యునిటీలకు 12వేల 163 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు ఐజి రవికృష్ణ వివరించారు.అదే విధంగా వివిధ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేశామని అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ,మరియు స్వచ్ఛంధ సంస్థల భాగస్వామ్యంతో 44 డ్రగ్ డీ అడిక్షన్ కేంద్రాలను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమీషనర్ నిశాంత్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి.కృష్ణ బాబు, ఎన్సిపి,డిఆర్ఐ, ఇడి,రైల్వే,పోస్టల్,కోస్టుగార్డు తదితర కేంద్ర ప్రభుత్వ విభాలకు చెందిన అధికారులు,పోలీస్ సహా రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అదికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.