లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు

– రాకియా పిటీషన్‌ను కొట్టేసిన లండన్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు
– బాక్సైట్‌ సరఫరా చేయనందుకు భారీగా 273 మిలియన్ డాలర్ల పరిహారం కోరిన రాకియా
– మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించిన ఏపీ
– ఒప్పుకోకుండా కోర్టుకెళ్లిన రాకియా కంపెనీ
– సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల ప్రకారం పకడ్బందీగా ముందుకెళ్లిన అధికారులు
– లండన్‌ వెళ్లి వాదనలు వినిపించిన ఏపీ అధికారులు, న్యాయవాదులు
– తుది విచారణలో బుధవారం ఈ కేసు తమ పరిధిలోది కాదని కొట్టేసిన ఆర్బిట్రేషన్‌ కోర్టు

విశాఖపట్నం ఎజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఒప్పందాల విషయంలో ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్‌ కోర్టు లో యుఎఇకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (రాకియా) వేసిన కేసులో రాష్ట్రప్రభుత్వానికే చారిత్రాత్మక విజయం లభించింది. రాష్ట్రానికి చెందిన అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్ట్ లో బలంగా తమ వాదనలను వినిపించారు. ఈ మేరకు లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ భారత దేశం తరుఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోది కాదని పేర్కొంటూ కేసు కొట్టేసింది.

2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్ ను వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు గానూ రాకీయా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్ రాక్ ద్వారా ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) ద్వారా బాక్సైట్ సరఫరా చేసేట్టుగా ఒప్పందం కుదిరింది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది.

ఇదే క్రమంలో ఇండియా, యుఎఇల మధ్య ఉన్న బిఐటి ఒప్పందంను ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడులకు నష్టం కలిగిందని, అందుకు గానూ తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రాకీయా సంస్థ లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో వాదనలు వినిపించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పలుసార్లు ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు రాకియా తో సంప్రదింపులు జరిపినా రాకీయా అంగీకరించలేదు. ఇదే క్రమంలో సీఎం వైయస్ జగన్ సూచనలతో అధికారులు పకడ్భందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో తమ వాదనలను వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గనులశాఖ ఉన్నతాధికారులు, ఎపిఎండిసి అధికారులు, న్యాయనిపుణులు లండన్ కోర్ట్ లో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు. దీనితో లండన్ న్యాయస్థానం ఎపి ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply