Suryaa.co.in

Andhra Pradesh

అమల్లోకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం

-మారనున్న భూమి హక్కుల చరిత్ర
-ఎంపీ విజయసాయి రెడ్డి

నవంబర్ 19, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూమి హక్కుల చట్టం సమూలంగా మారనుందని అన్నారు. వివిధ రకాల భూ రికార్డుల స్థానంలో ఇక ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ ఉంటుందని అన్నారు. ఒకసారి యజమానికి టైటిల్ ఇస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి హక్కుకు ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ సదుపాయం కూడా వర్తింపజేస్తుందని అన్నారు. భూముల చిట్టాలను తిరగరాసేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని అన్నారు.

దిగ్విజయంగా సామాజిక సాధికార యాత్ర
అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యం గా చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. సామాజిక సాధికార నినాదం దద్దరిల్లిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉత్సాహంతో కదం తొక్కారని అన్నారు.

లోకేష్, భువనేశ్వరిలు ఏమయ్యారు?
చంద్రబాబుకు అనారోగ్యం – బెయిల్ షరతులు సరే– పార్టీలో లోకేష్ – భువనేశ్వరి అందరూ ఏమయ్యారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా, తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. అలాగే టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టినట్లున్నారని అన్నారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ బావ పార్టీ టీడీపీని బతికించడంలో ఎంతమాత్రమూ కాదని అన్నారు.

2019 ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పురందేశ్వరి
బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందేనని విజయసాయి రెడ్డి అన్నారు. ఆమెకు నోటా కు పడిన ఓట్లు కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయని, 33,892 ఓట్లు మాత్రమే రావడంతో పురందేశ్వరి డిపాజిట్ కూడా కోల్పోయారని గుర్తుచేశారు. ఏమాత్రం ప్రజాబలం లేని వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బిజెపి పెద్ద సాహసమే చేసిందని అన్నారు.

LEAVE A RESPONSE