– ప్రతి మండలానికి 6 నుంచి 8 మంది
– నక్షా లేని గ్రామాల్లో గ్రామసభలు పూర్తి
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలివిడతలో ఐదువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని తెలిపారు.నక్షా లేని గ్రామాలు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణపై గురువారం నాడు మంత్రి అధికారులతో సమీక్షించారు.
వీరికి ఈనెల 26వ తేదీ నుంచి ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రెండు నెలల పాటు వీరికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు సోమవారం రోజు ఆయా జిల్లా సర్వే అధికారులను సంప్రదించాలని సూచించారు. శిక్షణ పూర్తైన వెంటనే ఆయా మండలాల్లో భూవిస్తీర్ణం , భూ లావాదేవీలను బట్టి ఆరు నుంచి ఎనిమిది మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతిగ్రామంలో మండలంలో రెవెన్యూ డివిజన్‌లో పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించిన అనేక పంచాయితీలను ఈ సర్వేయర్ల ద్వారా శాశ్వత భూ పరిష్కారం చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ దగ్గర భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు సర్వే పత్రాన్ని కూడా జత పరచాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే సర్వే విభాగాన్ని పూర్తి స్ధాయిలో బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
నెలరోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే జరగని ,ఇప్పటివరకు సర్వే రికార్డులు లేని 413 నక్షా గ్రామాలలో రీసర్వే చేపడుతున్నామని ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్ , జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ , ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఐదు గ్రామాల్లో ముందుగా గ్రామసభలు నిర్వహించి సర్వేకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. నెలరోజుల్లో ఈ సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఏ సంస్కరణలు చేపట్టినా ప్రజాకోణంలో ఆలోచించి తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో అధికారులు పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.