Suryaa.co.in

Editorial

సర్వేలన్నీ సత్యాలేనా?

– తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థల అత్యుత్సాహం
– ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపే మొగ్గు
– సర్వే సంస్థల ‘పబ్లిక్ పల్స్’కు ప్రాతిపదిక ఏమిటి?
– తక్కువ శాంపిల్ సర్వేలతో ఫలితం తెలుస్తుందా?
– జాతీయ మీడియా సంస్థల సర్వేలు నమ్మవచ్చా?
– అసలు జాతీయ మీడియాకు రాష్ట్రంలో ఉన్న నెట్‌వర్క్ ఎంత?
– ‘పీస్ వర్కు’లపై ఆధారపడి ఫలితం తేల్చడం సాధ్యమేనా?
– రాష్ట్రంలో 3 వేల శాంపిల్స్‌తో జాతీయ మీడియా ఫలితం తేల్చేస్తుందా?
– నియోజకవర్గానికి కనీసం 500 శాంపిల్స్ తీస్తేనే సరైన ఫలితాలు
– జాతీయ మీడియా సంస్థలు ఇచ్చే శాంపిల్ ఖర్చు అతి తక్కువేనట
– అంత తక్కువ డబ్బుతో విస్తృత సర్వే ఎలా సాధ్యం?
– ఇంకా అభ్యర్ధులు పూర్తి స్థాయిలో ఎంపిక కాని వైనం
– మరి అప్పుడే సర్వే ఫలితాలు ఎలా తేలుస్తారు?
– అది అమ్ముడుపోవడంగా అనుమానించాల్సిందేనా?
– పార్టీలు మారిన వారి ప్రభావం పరిగణనలోకి తీసుకోరా?
– సెటిలర్లు ఎటు వైపో అప్పుడే తేల్చేస్తారా?
– ఉత్తరాది వారంతా బీజేపీకి వేస్తారా?
– గత అసెంబ్లీ,గ్రేటర్ ఎన్నికల్లో కారెక్కిన ఉత్తరాది ఓటర్లు
– లోక్‌సభకు మాత్రమే బీజేపీకి వేసిన ఉత్తరాది సెటిలర్లు
– బీఎస్పీ, షర్మిల పార్టీలతో ముప్పును అంచనా వేశారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘సర్వే జనా సుఖినోభవన్తు’ మాటకు ఎన్నికల వేళ అర్ధాలు మారుతున్నాయి. డబ్బులిచ్చిన వారికే ‘సర్వే’జనాసుఖినోభవన్తు అని దీవిస్తున్నాయి ఈ సర్వే సంస్థలు! తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పార్టీలు, ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను ప్రకటించలేదు. అధికార బీఆర్‌ఎస్ కూడా ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ తొలి దశ అభ్యర్ధుల జాబితాను మాత్రమే ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? చేయదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.

జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా? జనసేన విడిగా పోటీ చేస్తుందా అన్నదీ ఇంకా స్పష్టం కాలేదు. మజ్లిస్ ఎన్నిసీట్లకు పోటీ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు. ఈలోగా టికెట్లు రాని వారు ఇతర పార్టీలకు మారుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి ప్రభావం తీసేయడానికి లేదు. ఇక షర్మిల పార్టీతో పాటు, దళితుల్లో బలం ఉన్న బీఎస్పీ ఏయే పార్టీల పుట్టి ముంచుతుందన్న దానిపై, ఇప్పుడే అంచనాకు రావడం కష్టం.

అలాంటిది తెలంగాణలో ఏమాత్రం రిపోర్టింగ్ నెట్‌వర్క్ లేని ఉత్తరాది మీడియా సంస్థలు, మరికొన్ని స్థానిక సర్వే సంస్థలూ.. అప్పుడే తొందరపడి ఫలితాలపై ముందే కూస్తున్నాయి. అసలు పూర్తి స్థాయి అభ్యర్ధుల ఎంపికప్రకటనే రాని నేపథ్యంలో.. ఈ సర్వేల హడావిడి అత్యుత్సాహమా? లేక అమ్ముడుబోతున్న చందమా? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్.

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, జాతీయ మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి. లోక్‌పోల్ సంస్థ సంస్ధ బీఆర్‌ఎస్‌కు 45-51 సీట్లు కాంగ్రెస్‌కు 61-67 సీట్లు వస్తాయని పేర్కొంది. పోల్ ట్రాకర్ సంస్థ బీఆర్‌ఎస్‌కు 40-కాంగ్రెస్‌కు 64 సీట్లు; తెలంగాణ పల్స్ బీఆర్‌ఎస్‌కు 46-54, జన్‌మత్ సంస్థ బీఆర్‌ఎస్ 45-47, కాంగ్రెస్ 58-60; ఏబీపీ-సీ ఓటర్ సంస్థ బీఆర్‌ఎస్ 43-55, కాంగ్రెస్‌కు 54 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది.

ఇక ఇండియా టుడే-సీ ఓటర్ సంస్థ బీఆర్‌ఎస్‌కు 49, కాంగ్రెస్‌కు 54 సీట్లు వస్తాయని పేర్కొంది. ఎన్డీటీవీ-ఇండియాటుడే సంస్థలు బీఆర్‌ఎస్‌కు42, కాంగ్రెస్‌కు 62 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. ఈ సర్వేల్లో ఏ ఒక్క సంస్థ కూడా.. బీజేపీకి 1-7 మించి ఇవ్వకపోవడం చూస్తే, ఎన్నికల బరిలో జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ నామమాత్రమేనని స్పష్టమవుతుంది. మిషన్ చాణక్య అనే సంస్థ మాత్రం బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు వస్తాయని పేర్కొంది.

ఇక ఇండియాటుడే- ఎన్డీటీవీ వెలువరించిన ఫలితాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. కాంగ్రెస్ గాలి బాగా వీస్తున్న ఖమ్మం జిల్లాలో, ఆ పార్టీకి ఒకటే గెలుస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌లో నిత్యం అందుబాటులో ఉండే , సనత్‌నగర్ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలసాని శ్రీనివాసయాదవ్ స్దానంలో, కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించడం వంటి అంశాలతో సర్వే ఫలితాలపై, సహజంగానే అనుమానాలకు తెరలేచింది.

ఉత్తరాది-ఆంధ్రా సెటిలర్లు అధికంగా ఉండే సనత్‌నగర్ నియోజకవర్గంలో.. వారంతా గత అసెంబ్లీ-కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. కానీ లోక్‌సభ ఎన్నికలకు మాత్రం బీజేపీకి వేస్తామని స్పష్టం చేశారు. వారికి స్థానికంగా రక్షణ కావాలి. వారంతా హింసను కోరుకోరు. అందుకే లౌక్యంగా … స్థానికంగా బీఆర్‌ఎస్‌కు-జాతీయ కోణంలో బీజేపీని గెలిపిస్తున్నారు. ఒక్క సనత్‌నగర్‌లోనే కాదు. ఉత్తరాది-ఏపీ సెటిలర్లు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది.

అలాంటిది ఈ ఎన్నికల్లో సనత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ గెలవదని సర్వేలో పేర్కొనడమే వింత. పైగా ఆ సర్వే సంస్థ ఫలితం వెలువడిన తర్వాత రోజునే ఉత్తరాది సెటిలర్ల సంఘాలు, బీఆర్‌ఎస్ అభ్యర్ధి తలసానిని పిలిచి తమ మద్దతు ప్రకటించారంటే, సర్వే సంస్థల విశ్వసనీయత ఏమిటన్నది ప్రశ్న.

ఈవిధంగా ఇంకా పూర్తి స్థాయి అభ్యర్ధుల ప్రకటన వెలువడకముందే, సర్వే సంస్థలు ఇచ్చిన ముందస్తు ఫలితాలు ఎంతవరకూ నిజమన్న చర్చకు తెరలేచింది. ఒక నియోజవర్గంలో దాదాపు 10 వేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన ఒక నాయకుడు, అసంతృప్తితో మరొక పార్టీలో చేరితే.. ఆ ప్రభావం ఎవరిపై ఉంటుందన్న కనీస అంచనా కూడా సర్వేల్లో కనిపించలేదన్నది, రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. సీట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, ఆ పార్టీకి వచ్చే నష్టమెంత అన్న అంచనా కూడా సర్వేల్లో కనిపించలేదంటున్నారు.

సాధారణంగా శాస్త్రీయ పద్ధతిలో సర్వే జరిపితే, సరైన ఫలితాలు వస్తాయని ఒక సీనియర్ విశ్లేషకులు వెల్లడించారు. ఆ మేరకు ఆయన సర్వేలకు సంబంధించి తీసుకునే చేసే ప్రాతిపదిక, ఎంచుకునే ప్రశ్నావళి, సర్వే చేసే వ్యక్తులకు వారు ఇచ్చే పారితోషికాలు తదితర అంశాలు వివరిస్తున్నప్పుడు… ప్రస్తుతం వెల్లడవుతున్న సర్వే ఫలితాలపై, అనుమానాలు తెరపైకి రావడం సహజం.

శాస్త్రీయ పద్ధతిలో సర్వే జరిగితే.. రోజుకు పది శాంపిల్ కంటే ఎక్కువ తీయడం అసాధ్యమన్నది, ఆ సీనియర్ విశ్లేషకుడు చెప్పిన మాట. ఎందుకంటే ఆయన కూడా ఏపీ-తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో సర్వేలు చేయిస్తున్న సంస్థకు ప్రతినిధి కాబట్టి. ఆ లెక్కన సర్వేలు ఆషామాషీగా జరగదని స్పష్టమవుతుంది. ఆ ప్రకారంగా శాస్త్రీయ పద్ధతి ప్రకారమైతే.. కులం-మతం-లింగం-వయసు-గతంలో వేసిన ఓటు-స్థానిక ఎమ్మెల్యే పనితీరు-ప్రభుత్వ పనితీరు- కులాల్లో ఉప కులాలు వంటి ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తారు.

సర్వే చేసే వ్యక్తులు ఓటర్ల వివరాలను నమోదు చేసే ట్యాబ్‌లు, నేరుగా సర్వే సంస్థ ఆఫీసులోని సర్వర్‌లోకి వెళతాయి. అక్కడ విశ్లేషకులు నియోజకవర్గాల వారీగా, రాష్ట్ర స్థాయిలో ఓటర్ల మనోగతాన్ని వెల్లడించి, తుది ఫలితం ఇస్తారు. సహజంగా ఒక్కో నియోజకవర్గంలో కనీసం, 500లకు పైన శాంపిల్స్ తీస్తేనే ఫలితంలో స్పష్టత ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసిన కంపెనీలయితే… తమ విశ్లేషణలో అనుమానం వస్తే, మళ్లీ అదే ప్రాంతంలో మరోసారి సర్వేకు పంపిస్తాయి. ఆ పద్ధతిలో సర్వే చేయాలంటే, రోజుకు పది శాంపిల్ మాత్రమే సేకరించవచ్చు. అంటే ఒక నియోజకవర్గంలో శాస్త్రీయమైన పద్థతిలో సర్వే చేయాలంటే… ఎన్ని రోజులు పడుతుందో ఊహించుకోవచ్చు.

అయితే తాజాగా తెలంగాణలో సర్వే ఫలితాలు విడుదల చేసిన ఓ సంస్థ అయితే.. ఏకంగా తాము 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించామని పేర్కొనడమే ఆశ్చరం. అన్ని లక్షల మందితో సర్వే చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చవుతుంది. అంత డబ్బు ఏ పార్టీ ఇచ్చింది? 14 లక్షల మంది అభిప్రాయాల సేకరణకు ఎన్ని లక్షల ట్యాబ్‌లు కావాలి? వాటి విశ్లేషణకు ఎంత సిబ్బంది కావాలి? అభిప్రాయసేకరణను కులాలు-మతాలు- ఉప కులాలు-వయసు వారీగా విభజించి, విశ్లేషించేందుకు ఎన్ని కంప్యూటర్లు-ఆపరేటర్లు అవసరం అన్నది మరో ప్రశ్న.

సర్వే కోసం ఒక్కో వ్యక్తికి ఎంత సమయం కేటాయించారో వెల్లడిస్తే.. సదరు సంస్థ ఎన్ని నెలల నుంచి సర్వే ప్రారంభించింది? అప్పటికి బీఆర్‌ఎస్ అభ్యర్ధులను ప్రకటించిందా లేదా? అన్న ప్రశ్నలు సహజంగా తెరపైకి వస్తాయి. సహజంగా లక్షల సంఖ్యలో సర్వే చేయాలంటే, సర్వే సంస్థల ఆర్ధికబలం ఏమాత్రం సరిపోదు. అలాగని ఏ సంస్థ కూడా ఉచితంగా సర్వే చేయదు. డబ్బులిచ్చే క్లైంట్ల కోసమే చేస్తాయి. ఆ లెక్కన ఈ సంస్థ బీఆర్‌ఎస్ కోసం చేసిందా? లేక కాంగ్రెస్ కోసం చేసిందా అన్న దానిపై స్పష్టత లేదు.

ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సర్వే చేయించే జాతీయ మీడియా సంస్థలకు, ఆయా రాష్ట్రాల్లో రిపోర్టింగ్ నెట్ వర్క్ ఉండదు. పీస్ వర్కును ఎవరికో ఒకరికి అప్పచెప్పి, ఫలితం రాబడుతుంటాయి. అయితే జాతీయ మీడియా సంస్థలు ఒక్కో శాంపిక్‌కు ఇచ్చే పారితోషికం 200 నుంచి 250 రూపాయలు మాత్రమే. అది కూడా రాష్ట్రానికి 3-4 వేల శాంపిల్ మాత్రమే చాలని నిర్దేశిస్తాయి.

అంత తక్కువ శాంపిల్‌తో-తక్కువ పారితోషికంతో సరైన ఫలితాలు రాబట్టడం అసాధ్యం. అందుకే సర్వే సబ్ కాంట్రాక్టు తీసుకునే, చిన్న చిన్న లోకల్ సర్వే సంస్థలు.. పాన్ డబ్బాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, మార్కెట్ల వద్ద సర్వేలు చేసి, ఆ నివేదికలనే పంపించే పద్ధతి ప్రారంభించాయి. జాతీయ మీడియా దాదాపు ఇలాంటి, చిన్న చిన్న లోకల్ కంపెనీలపై ఆధారపడి ఫలితాలు ప్రకటిస్తున్నాయన్నది ఒక విమర్శ.

ఎన్నికల సమయంలో ఈ బాపతు సర్వే కంపెనీలు పుట్టగొడుగుల్లా, నియోజకవర్గాల స్థాయిలో పుట్టుకొచ్చాయి. ఎక్కువగా జర్నలిజంలో పనిచేసిన వారే వీటికి సారథ్యం వహిస్తుండటం విశేషం. ఇక లక్ష రూపాయాలకు సైతం సర్వే చేసి పెడతామంటూ, మరికొందరు ముందుకొస్తున్నారంటే.. అసలు సర్వేలపై విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఈ తరహా సొంత సర్వేలు చేసేవారికి ఆఫీసు, ట్యాబ్‌లు, సర్వర్లు లాంటివేమీ ఉండవు. ఇళ్ల నుంచే పనిచేస్తుంటారు. సహజంగా ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే అసెంబ్లీ అభ్యర్ధులు శాస్త్రీయంగా నిర్వహించే సర్వే సంస్థలకు 10 లక్షలు ఇచ్చేందుకు ఇష్టపడరు. దానిని లోకల్ వ్యక్తులు సర్వే పేరిట సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి.

ఇక లోకల్ సర్వే సంస్థలు సర్వే చేసిన వారికి, ఒక్కో శాంపిల్‌కు 500 రూపాయలపైనే ఇస్తున్నాయి. ఇవి కూడా ట్యాబ్‌లతో పనిచేస్తున్నాయి. లోకల్ సర్వే సంస్థలు, నియోజకవర్గానికి జీఎస్టీతో కలిపి, 4 నుంచి 5 లక్షల రూపాయల వరకూ క్లైంట్ల వద్ద వసూలు చేస్తాయి. ఏయే ప్రాంతాల్లో తమకు సర్వే చేయాలని, అభ్యర్ధులు సూచిస్తుంటారు. వీటిలో ఎక్కువమంది సెఫాలజిస్టులకు విశ్వసనీయ ఉంది. ఈ సంస్థల సర్వే ఫలితాలు చాలావరకూ గతంలో నిజమైన సందరాలున్నాయి.

సర్వేలకు ఇంత శాస్త్రీయత ఉంటే… ఎలాంటి నెట్‌వర్క్ లేకుండా, సిబ్బంది లేకుండా, జనసమూహంలోకి వె ళ్లి చేసే జనాభిప్రాయాలతో ఫలితాలు వస్తాయనుకోవడం భ్రమే అన్నది, సీనియర్ సెఫాలజిస్టుల మనోగతం.

కానీ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే వందశాతం ఓటు శాతం పెరగడం ఖాయమని, ముస్లిం మైనారిటీల ఓట్లు భారీ స్థాయిలో చీలిపోవడం ఖాయం కాబట్టి.. దానితో బీఆర్‌ఎస్‌కే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం మాత్రం, క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్న మాట వాస్తవం.

LEAVE A RESPONSE