-‘జగన’ంత కుటుంబమేదీ?
-కెవిపి నుంచి ఉండవల్లి వరకూ
-కడప హుస్సేన్ నుంచి అమలాపురం హర్షకుమార్ వరకూ
-చివరకు చెల్లి షర్మిల-సునీత నుంచి తల్లి విజయమ్మ వరకూ
-నాటి వైఎస్ సన్నిహితులు కూడా జగన్ వెంట లేని వైనం
-వైఎస్ విధేయులు జగన్‌కు దూరంగా ఎందుకున్నారు?
-సోషల్‌మీడియాలో ఆసక్తి కలిగిస్తున్న కథనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పాదయాత్ర ముగిసి అధికారంలోకి వచ్చే ముందు వరకూ ఆయనది ‘జగన’ంత కుటుంబమని పేరు. కానీ తర్వాతనే కథ మారింది. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో చివరివరకూ కలసి నడిచిన.. పెద్దాయన సన్నిహితులు-కుటుంబ శ్రేయోభిలాషులంతా, జగన్ వెంట కనిపించడం మానేశారు. పెద్దాయన ఎక్కడికి వెళితే అక్కడ కనిపించే ‘కట్టర్ వైఎస్ బ్యాచ్’ కూడా, తనయుడు జగన్‌తో నడవలేదు. చివరాఖరకు వైఎస్ జీవించినంత వరకూ ఆయననే అంటి పెట్టుకున్న, నాటి ఉద్యోగ విధేయబృందం కూడా జగన్ వద్ద కొనసాగలేక వెళ్లిపోయారు.
సహజంగా సూపర్ ఇమేజ్ ఉన్న ఒక రాష్ట్ర స్థాయి పెద్ద నేత చనిపోతే, ఆయన సహచరులు-అనుచరులు-మిత్రులు-శ్రేయోభిలాషులంతా, రాజకీయంగా ఆ నేత కొడుకుతో కలసి పయనిస్తుంటారు. భారత రాజకీయాల్లో ఇది మనం చాలాకాలం నుంచి చూస్తున్నదే. కానీ ఏపీలో, దివంగత నేత వైఎస్ తనయుడు జగన్‌తో మాత్రం.. వైఎస్ మిత్రులు-సహచరులు-అనుచరులు-కుటుంబ శ్రేయోభిలాషులెవరూ కలసి నడవడం లేదు. అందుకు భిన్నంగా, కూతురు షర్మిలకు దన్నుగా నిలుస్తున్నారు. మరికొందరు టీడీపీలో వైఎస్ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు వెంట నడుస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్‌మీడియాలో కథనాలుగా ప్రవహిస్తున్నాయి.
ఇప్పుడు తల్లి-చెల్లి-బావ- మరో చెల్లి అయిన బాబాయ్ కూతురు కూడా, జగన్‌కు దూరంగా ఉండటమే కాదు.. ఆయనపై యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఫలితంగా ‘సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగనన్న రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలకు ఇంకేం చేస్తారంటూ’’ శూలాల్లాంటి ప్రశ్నాస్త్రాలు. షర్మిల-సునీత నుంచి చంద్రబాబు-లోకేష్-అనురాధ- వంగలపూడి అనిత వరకూ అదే మాటలతో ఎదురుదాడి. ఎందుకీ పరిస్థితి? వైఎస్ విధేయ-సన్నిహిత-శ్రేయోభిలాష బృందమంతా, జగన్‌కు దూరంగా ఉండటానికి కారణమేమిటి? ఎన్నికల ముందు ఇదే అంశం మహిళలపై ప్రభావం చూపి, మహిళలను వైసీపీకి దూరం చేస్తోందా? ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పిన వెంటనే అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు, ఆయన వెన్నంటి కనిపించే తెల్లజుట్టు సూరీడు. అలాంటి సూరీడు వైఎస్ మృతి తర్వాత కొద్దిరొజులే జగన్ వద్ద ఉండగలిగారు. ఆ తర్వాత గుర్తుకొచ్చే పేరు కెవిపి రామచంద్రరావు. ఇంకొం ముందుకు వెళితే గుర్తుకొచ్చే పేరు ఆయన ఓఎస్డీ రవిచంద్, వ్యక్తిగత కార్యదర్శి భాస్కరశర్మ, నరసింహాచారి. భాస్కరశర్మ-నరసింహాచారికి వైఎస్ ఏదైనా పని చెబితే, వాటిని చిటికెలో పూర్తి చేసేవారు. ఇక రవించద్ వైఎస్ చెప్పకముందే పార్టీ అవసరాన్ని గ్రహించి, వ్యూహరచన అమలు చేసేవారు. ఈ ముగ్గురంటే వైఎస్‌కు అంత గురి, నమ్మకం!
ఇందులో భాస్కరశర్మ ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద పనిచేస్తుండగా, నరసింహాచారి తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రవిచంద్ సర్వే సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు వైఎస్‌కు ఆత్మీయులే కాదు. అంతకుమించి వీర విధేయులు. సూటిగా చెప్పాలంటే.. ఈ ముగ్గురిదీ పెద్దాయనతో కుటుంబ బంధం. వైఎస్ మృతి చెందిన తర్వాత వీరెవరూ జగన్ వద్ద కొనసాగలేకపోవడమే ఆశ్చర్యం.
వైఎస్ వద్ద వ్యూహకర్తగా ఉన్న రవిచంద్.. పెద్దాయన మృతి తర్వాత కొద్దికాలం జగన్‌తోపాటు బెంగళూరులో ఉన్నప్పటికీ, ఆయన వైఖరి నచ్చక బయటకు వచ్చేశారు. కొంతకాలం వైసీపీ వ్యవహారాలు చూసిప్పటికీ, స్వతంత్ర వైఖరితో ఉండే ఆయన జగన్ వద్ద కొనసాగలేకపోయారు. ఇప్పుడు వైఎస్ ఆత్మీయులైన ఈ ముగ్గురూ ఆయన కొడుకు జగన్‌తో లేరు.
ఇక వైఎస్‌కు మరో వీరవిధేయడు గిడుగు రుద్రరాజు .యూత్ కాంగ్రెస్ నుంచే వైఎస్‌తోనే ఆయన పయనం. ఇలాంటి కరుడుగట్టిన వైఎస్ విధేయులే జగన్ వద్ద లేకపోకవడం బట్టి.. వైఎస్‌కు-జగన్‌కు అన్ని అంశాల్లో చాలా వ్యత్యాసం ఉందని స్పష్టమవుతోందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. మొన్నటి వరకూ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు, ఇప్పుడు సీడబ్ల్యుసీ సభ్యుడిగా ఉన్నారు.
కెవిపి అయితే వైఎస్‌కు ఆత్మ అని కొత్తగా చెప్పాల్సిన పనేమీలేదు. పెద్దాయనను కలవాలంటే, ముందు కెవిపిని కలవాల్సిందే.సహజంగా అయితే వైఎస్ మరణానంతరం కెవిపి జగన్‌ను అనుసరించాలి. కానీ ఆయన ఇంకా కాంగ్రెస్‌లో ఉంటూ, షర్మిలకు దన్నుగా నిలుస్తుండమే విశేషం. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అయితే శాసనసభా సమావేశాల్లో, వైఎస్ మాటల అస్త్రాలకు కావలసిన సరకూ సరంజామా అందిస్తుంటారు. రవిచంద్ కూడా అదే పనిచేసేవారు. మరో మాజీ ఎంపి సాయిప్రతాప్ ఢిల్లీ అడ్రస్ ఎప్పుడూ కేరాఫ్ వైఎస్ ఇల్లే. ఇప్పుడు వీరెవరూ జగన్‌తో లేరు. కెవిపి కాంగ్రెస్‌లోనే ఉంటే, సాయిప్రతాప్ గతంలో టీడీపీలో చేరారు.
ఉండవల్లి తాను రాజకీయాల్లో లేనంటూనే, స్నేహితుడి కొడుకు జగన్‌కు ఉపయోగపడేలా పరోక్షంగా అస్త్రాలందిస్తున్నారు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా, ఆయనను బయటపడేసేందుకు పరితపిస్తున్నారు. తనకున్న మేధావి కార్డు సంధించి, చంద్రబాబు-పవన్ మీద విమర్శలతో జగన్‌కు ఊరట కల్పిస్తున్నారు. అలాగని ఆయన నేరుగా జగన్‌తో లేరు. స్నేహితుడి కొడుకు దారితప్పుతున్నాడన్న బాధ. వైసీపీతో మూగ ప్రేమ. అంతే! మళ్లీ జగనే సీఎం కావాలని మనసునిండా కోరిక నింపేసుకున్న మాజీ నాయకుడు ఉండవల్లి.
ఇంకొంచెం లోతుకు వెళితే..మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, రఘువీరారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజులురెడ్డి, గౌరువెంకటరెడ్డి- గౌరు చరితారెడ్డి, బాలశౌరి, పితాని సత్యనారాయణ, హర్షకుమార్, బూరగడ్డ వేదవ్యాస్, మండలి బుద్దప్రసాద్, కనుమూరి బాపిరాజు, జెడి శీలం, చింతామోహన్, కొణతల రామకృష్ణ, కాసు కృష్ణారెడ్డి, వీరశివారెడ్డి, పల్లంరాజు, లగడపాటి రాజగోపాల్, ఆదినారాయణరెడ్డి, తులసిరెడ్డి, శైలజానాధ్, గల్లా అరుణ, ఎస్‌విసివి నాయుడు, సికెబాబు, చెంగారెడ్డి, పనబాక లక్ష్మి, రుద్రరాజు పద్మరాజు, కొండ్రు మురళి, సుజయకృష్ణ రంగారావు, పెన్నా ప్రతాపరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు, గంగుల భానుమతి, రౌతు సూర్యప్రకాష్‌రావు, దట్టా రామచంద్రరావు వంటి ప్రముఖులంతా హార్డ్‌కోర్ వైఎస్ గ్యాంగ్‌గా కాంగ్రెస్‌లో ముద్రపడ్డారు. ఇప్పుడు వీళ్లెవరూ ఆయన కొడుకు జగన్ వెంట లేకపోవడాన్ని, సోషల్‌మీడియా కథనాలు ప్రత్యేంగా ప్రస్తావిస్తున్నాయి.
గౌరు వెంకటరెడ్డి జైలులో ఉన్నప్పుడు.. వైఎస్ స్వయంగా జైలుకు వెళ్లి మరీ, ఆయనను పరామర్శించిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అలాంటి గౌరు కుటుంబం జగన్ వెంట కాకుండా, టీడీపీలో ఉండటం విశేషం. వీరిలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం టీడీపీలో ఉండగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీలో ఉన్నారు. ఆదినారాయణరెడ్డి తొలుత టీడీపీలో చేరి, తర్వాత బీజేపీలో కొనసాగుతున్నారే తప్ప జగన్ వెంట లేరు.
జగన్ సొంత జిల్లాలో వైఎస్ వెంట నడిచిన.. డీఎల్, వరదరాజులురెడ్డి, తులసిరెడ్డి, అహ్మదుల్లా, షేక్ హుస్సేన్, వీరశివారెడ్డి వంటి వైఎస్ సన్నిహితులెవరూ.. ప్రస్తుతం జగన్‌తో లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీరిలో రఘువీరారెడ్డి సీడబ్లుసీ సభ్యుడిగా కొనసాగుతుండగా, గిడుగు రుద్రరాజు, శైలజానాధ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. తులసిరెడ్డి, పల్లంరాజు, జెడి శీలం, చింతా మోహన్, చెంగారెడ్డి, హర్షకుమార్, బాపిరాజు, సుంకర పద్మశ్రీ వంటి విధేయులు ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.
అసలు వైఎస్‌కు మొట్టమొదట రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇప్పించిన, ఆయన మిత్రుడైన కాసు కృష్ణారెడ్డి కూడా జగన్ వెంట లేకపోవడమే ఆశ్చర్యం. అయితే ఆయన తనయుడు మహేష్‌రెడ్డి మాత్రం, వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అది వేరే విషయం.
ఇక తొలి రోజుల్లో వైఎస్‌ను అన్ని విధాలా ఆదుకున్న అప్పట్లో స్థితిమంతులైన అహ్మదుల్లా-షేక్ హుస్సేన్ కుటుంబం ఇప్పుడు జగన్ వైపు కాకుండా.. షర్మిల వైపు ఉండటం ఆసక్తికర అంశం.
వైఎస్ తన కుటుంబ సమస్యలు-కష్టనష్టాలన్నీ, మాజీ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్‌కు మాత్రమే చెప్పేవాళ్లనే ప్రచారం లేకపోలేదు. వైఎస్, ఆయన బావమరిది రవీంద్రారెడ్డికి, కడప టౌన్‌లో రాజకీయంగా ఆశ్రయం ఇచ్చిన అహమ్మదుల్లా కుటుంబం కూడా.. ఇప్పుడు షర్మిల పక్షానే ఉండటం గమనార్హం.
ఇప్పుడు రాజన్న బిడ్డ షర్మిల పీసీసీ చీఫ్‌గా, జగన్ అన్న ఎదురునిలబడి ఆయనను సవాల్ చేస్తున్నారు. జగన్ అన్న కోసం తాను 3 వేలకిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశానని, బైబై బాబు కార్యక్రమం చేపట్టానని, వైసీపీ అనే మొక్కకు అప్పుడు నీరు పోస్తే.. అదిప్పుడు చెట్టయిందని, షర్మిల ప్రతి వేదికపైనా చెబుతున్నారు.
ఆ క్రమంలో ఆమె క్యారెక్టర్‌ను కూడా డామేజీ చేసేందుకు వైసీపీ సిద్ధమయింది. తల్లి విజయమ్మ కూడా కొడుకు జగన్ వద్ద కాకుండా కూరుతు షర్మిలతో ఉన్నారు. సహజంగా మన సమాజంలో, తల్లి తన కొడుకు దగ్గరే ఉంటుంది. కానీ విజయమ్మ మాత్రం కూతురుతో ఉంటున్న పరిస్థితి. ఇక సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత కూడా, సోదరుడు జగన్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు.
ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈ అంశం.. సరిగ్గా ఎన్నికల ముందు ‘లేడీ ఫ్యామిలీ సెంటిమెంటు’గా సోషల్‌మీడియాలో రూపాంతరం చెందడం, సహజంగా వైసీపీ నాయకత్వానికి ఇబ్బందికరంగానే పరిణమిస్తోంది. షర్మిలను పక్కకుపెడితే.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, రఘురామకృష్ణంరాజు, సోమిరెడ్డి, కన్నా, పితాని, అయ్యనపాత్రుడు, నాదెండ్ల మనోహర్, అమర్నాధ్‌రెడ్డి, పట్టాభి, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, వంగలపూడి అనిత వంటి అగ్రనేతలు దాదాపు ప్రతిరోజూ ఈ అంశాన్ని ప్రస్తావించడం మహిళల సెంటి’మంట’ పెట్టినట్లవుతోంది.
‘‘సొంత చెల్లెళ్లు-తల్లికే న్యాయం చేయలేని జగన్, ఇక రాష్ట్రంలోని మహిళలకేం న్యాయం చేస్తార’’న్న ప్రచారం.. పోలింగ్ రోజు వరకూ మహిళాలోకంలో స్థిరపడితే, కొంపకొల్లేరవుతుందన్నది ైవైసీపీ నేతల ఆందోళన.