– రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం
– మార్పు కోరుకుంటే రాదు.. ప్రయత్నిస్తే మార్పు వస్తుంది
– జనసేన వినూత్న కార్యక్రమం
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్
అమరావతి: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే అవకాశం ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇందులో భాగంగా “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమం జనసేన పార్టీ నిర్వహించనుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ యువకులు తమకు నచ్చిన అంశాలను ఎంచుకుని సేవలు అందించడానికి ఈ వేదిక కల్పించనుందన్నారు.
మార్పు కోరుకుంటే రాదని, ప్రయత్నిస్తే మార్పు వస్తుందని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ “ఎక్స్” లో శుక్రవారం ట్వీట్ పోస్ట్ చేశారు.