కాకినాడ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు శుక్రవారం అర్జిదారులు పోటెత్తారు. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం జరిగిన 26వ ప్రజా దర్బార్ లో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఇళ్ళ స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, సీఎం రిలీఫ్ ఫండ్, వైద్య సహాయం, బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు-చేర్పులు, పింఛన్లు, వంటి అంశాలపై మొత్తం 29 వినతులు అందాయి. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా, మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించామని కార్యాలయ ఇన్చార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించి, వెంటనే పరిష్కారం పొందుతున్నారని, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్ , శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, ఆర్యుసీసీ సభ్యుడు ముత్యాల అనిల్, నాయకులు జున్నూరు బాబ్జి, సిరియాల కొండబాబు, ఐటీడీపీ పాలికా సతీష్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.