Suryaa.co.in

Andhra Pradesh

మడకశిరకు ‘కల్యాణి’ రాక

• రూ.1430 కోట్లతో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటు
• ప్రత్యక్షంగా 565 మంది ఉద్యోగవకాశాలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు.

రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశ్రమతో 565 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు.

ముఖ్యంగా 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహానిస్తూ, భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే సమయంలో గత వైసీపీ పాలనలో వేధింపులు తాళలేక తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి రప్పించడానికి సీఎం చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.

LEAVE A RESPONSE