Suryaa.co.in

Andhra Pradesh

సహకార డైయిరీలను పునరుద్ధరిస్తామనే మీ హామీని నెరవేర్చాలి

– భారతి సిమెంట్ ధరలను ఎందుకు తగ్గించడం లేదు?
– లీటర్ కు రూ.4 బోనస్ హామీ ఏమైంది?
– ఉపాధి హామీ నిధులను సైతం అమూల్ కోసం దారిమళ్లిస్తున్నారు
– జగన్మోహన్ రెడ్డికి అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ

బహిరంగ లేఖ
గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
అమరావతి
విషయం- రాష్ట్రంలో పాడిరంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం, పాడి రైతులకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం, అమూల్ ముసుగులో సహకార డైయిరీలను నిర్వీర్యం చేయడం గురించి

రాష్ట్రంలో వ్యవసాయం రంగం తర్వాత ఎక్కవ మంది ప్రజలు ఆధారపడి జీవించేది పాడిరంగం. అలాంటి రంగం పట్ల జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పాలను తీసుకెళ్లి అమూల్ కు కట్టబెడుతున్నారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. లీటర్ కు రూ.4 బోనస్ హామీ ఏమైంది? పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్ కు ప్రమోటర్ గా మారారు. అమూల్ పై చూపిస్తున్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదు? రాష్ట్ర నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం అమూల్ కోసం దారిమళ్లిస్తున్నారు.

అమూల్ తో పోటీ వల్ల ప్రైవేటు డైయిరీలు పాల రేట్లు పెంచాయంటూ మీరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు డైయిరీలు లీటర్ కు 45 పైసల నుంచి రూ.10.95 వరకు తక్కువ ధర చెల్లిస్తున్నా రంటూ ప్రజలను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అనంతపురం జిల్లాలో జరిగిన పాల వెల్లువ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన డైయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసేలా అవాస్తవాలు మాట్లాడటం సరికాదు. అమూల్ ముసుగులో లీటర్ కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి జరుగుతోందని మోసం చేస్తున్నారు.

రాష్ట్రానికి చెందిన డైయిరీలను కాదని గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థకు ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అమూల్‌ సంస్థపై ఎందుకంత ప్రేమ? అమూల్‌ కోసం రూ.3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారు. అప్పు.. రాష్ట్ర ప్రజలది అయితే, వ్యాపారం అమూల్‌ సంస్థదా? విజయ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండాల్సిన ప్రభుత్వం అమూల్‌ సంస్థకు అంబాసిడర్‌గా మారింది.

అమూల్‌ సంస్థకు ఇంత పెద్దఎత్తను దాసోహం కావడం వెనుక పెద్దఎత్తున లూటీ దాగి ఉంది. ప్రభుత్వం సమాంతర వ్యవస్థల ద్వారా సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. మీ చర్యలతో ఎన్నో ఏళ్లుగా సహకార రంగంలో నడుస్తున్న డెయిరీలు నిర్వీర్యం అవుతాయి. ప్రైవేటు డెయిరీల మనుగడకూ ప్రమాదం ఏర్పడుతుంది. సహకార డైయిరీలను నిర్వీర్యం చేస్తూ.. ఎక్కడో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలను తీసుకువస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సహకార డైయిరీలను, సంస్థలను వద్దంటున్నారు. అమూల్ పై ఉన్న ప్రేమ రాష్ట్ర రైతులపై ఎందుకు లేదు?

చిత్తూరు జిల్లాలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి పాల డైయిరీలో రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటూ కొన్ని సంవత్సరాలుగా పాడి రైతులను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం శివశక్తి డైయిరీ లీటర్ కు రూ.18 మాత్రమే ఇస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ ఇతర డైయిరీలను రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో 01.02.2022 నుంచి లీటర్ పాల ధర రూ.32.24కు పెంచుతున్నట్లు కరపత్రాలు పంపిణీ చేశారు.

శివశక్తి పాలడైరీలో అనేక సంవత్సరాలుగా అతి తక్కువ ధరకు పాలను కొని పాడి రైతులను మోసం చేస్తున్నారు. ఒక్కో రైతు ఏడాదికి రూ.లక్ష వరకు నష్టపోయారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. లీటర్ కు రూ.18 మాత్రమే చెల్లించి పాడి రైతుల రక్తాన్ని పీల్చుకున్నారు. దేశంలో ఎక్కడైనా లీటర్ పాలకు రూ.18 చెల్లించారా? ప్రశ్నించిన రైతులను బెదిరించి వేధింపులకు గురిచేశారు. తక్షణమే పాడి రైతులకు జరిగిన నష్టాన్ని చెల్లించాలి.

రాష్ట్రంలో సహకార డైయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్ వాడీలకు పాల సరఫరాకు అమూల్ తో ఒప్పదం చేసుకోవడం దుర్మార్గం. సహకార డైయిరీలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే అమూల్ తో ఒప్పందం చేసుకున్నారు. మీ భారతి సిమెంట్ ధరలను ఎందుకు తగ్గించడం లేదు? ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారికి అందుబాటు ధరల్లోకి ఎందుకు తీసుకురావడం లేదు? బాలామృతం, అంగన్ వాడీలకు పాల సరఫరాకు అమూల్ తో ఒప్పంద కుదుర్చుకున్న మీరు .. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన 40 లక్షల మంది కార్మికుల విషయంలో.. ఎందుకు భారతి సిమెంట్ ధరలను తగ్గించడం లేదు?

అమూల్ కు పాలు పోయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. తమ మాట వినని ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైతులకు పాల బకాయిలను అమూల్ సంస్థ చెల్లించలేదు. అమూల్ సంస్థ లీటర్ కు చెల్లించిన సగటు ధర కేవలం రూ.42.50 మాత్రమే కాగా.. లీటర్ కు రూ.20 అదనంగా చెల్లిస్తున్నామని తప్పుడు లెక్కలు చెబుతూ పాడి రైతులను తప్పుదారి పట్టించారు. ఇందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ (ఏఎంసీయూ) ల ఏర్పాటు కోసం దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమూల్ సంస్థ లాభాల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించదు. అలాంటప్పుడు ప్రభుత్వ ధనం రూ.3వేల కోట్లను బీఎంసీయూ, ఏఎంసీయూలకు ఎందుకు వెచ్చిస్తున్నారో సమాధానం చెప్పాలి? మీ ఉన్మాద, కక్షసాధింపు చర్యలతో ఆయా డైరీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకం అవుతోంది.

సహకార డైయిరీలను పునరుద్ధరిస్తామనే మీ హామీని నెరవేర్చాలి. ఒంగోలు డైయిరీ, చిత్తూరు డైయిరీలు మూతపడ్డాయి. వీటిని పునరుద్ధరిస్తామనే హామీని నిలబెట్టుకోవాలి. మూతపడిన విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్‌ డైయిరీ వంటి వాటిని తిరిగి తెరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

కె. అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

LEAVE A RESPONSE