మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముమ్మాటికీ విరుద్ధమే

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దిగ్భ్రాంతి

విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో పాత్రికేయులపై , మీడియా సంస్థలపై జరుగుతున్న తీవ్రతరమైన వరుసదాడుల పట్ల సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

పాత్రికేయులపై , సంస్థలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఆమేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చైర్మన్ , హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు , రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పూర్వ ఎన్నికల ప్రధానాధికారి, డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పాత్రికేయులపై ఉద్దేశపూర్వక దాడులు , మీడియా సంస్థల కార్యాలయాల విధ్వంసం వంటి చర్యలు , మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముమ్మాటికీ విరుద్ధమేనన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలోనాలుగో స్థంభంగా కొనియాడ బడుతున్న మీడియా ,ప్రజలకు వాస్తవాలను నిజాయితీగా నివేదించే కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నదని , మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి జరిగే ప్రయత్నాలు గర్హనీయమని వారా ప్రకటనలో పేర్కొన్నారు.

మీడియా స్వేచ్ఛను హరించడానికి జరిగిన ప్రయత్నాలు చరిత్రలో ఎన్నడూ విజయవంతం కాలేదని , ఇప్పుడుకూడా జయప్రదం కాజాలవని వారా ప్రకటనలో పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డ దుండగులు ఏ రాజకీయ పార్టీలకు చెందినవారైనా వెంటనే అరెస్టు చేయాలని, చేసిన దురాగతాలకు తగిన మూల్యం వారు చెల్లించేటట్లు గట్టి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని వారా ప్రకటనలో కోరారు.

నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలకు దేశం సిద్ధం అవుతున్న ప్రస్తుత కీలకమైన తరుణంలో చట్టబద్ధ పాలనకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను అనుమతించరాదని వారా ప్రకటనలో పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛకు అండగా పౌరసమాజం నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply