-
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వారికి నో బెయిల్
-
బాబు ఇంటిపై దాడి కేసులో జోగికి సైతం బెయిల్ తిరస్కరణ
-
హైకోర్టు తీర్పుతో వారి అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి: ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన నాటి వైసీపీ ఎంపి, ఎమ్మెల్సీల అరెస్టుకు రంగం సిద్ధమయింది. వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు, వీరిని అరెస్టు నుంచి రక్షించలేమని స్పష్టం చేసింది. అటు నాటి విపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు సైతం హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఫలితంగా బెజవాడ వైసీపీ యువనేత దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపి నందిగం సురేష్ అరెస్టు ఇక లాంఛనప్రాయమే.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌కు ధర్మానసం బెయిల్ తిరస్కరించింది . హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు. అయితే, సుప్రీంకోర్టు ఎప్పుడూ ఇలాంటి తీర్పు ఇవ్వలేదని టీడీపీ తరఫున న్యాయవాదులు స్పష్టం చేశారు. తీర్పులను పరిశీలించిన ధర్మాసనం, తన తీర్పును వెలువరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి, కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది.