– బాబుపై ఇంకా ఐదుకేసలు కోర్టుల్లోనే పెండింగ్
– ఏడాది దాటినా స్పెషల్ పిపిలను నియమించని నిర్లక్ష్యం
– సర్కారు వచ్చినా ఇంకా సిద్దార్ధ లూద్రా సలహాలేనా?
– జగన్ జమానాలో 5 స్పెషల్ పిపిల నియామకం
– బాబు సీఎం అయినా పట్టించుకునే దిక్కులేని ధిక్కారం
– లీగల్ వ్యవహారాలపై టీడీపీ న్యాయవాదుల అసంతృప్తి
– ఆయనను గుడ్డిగా నమ్మితే నష్టపోతారని న్యాయవాదుల హెచ్చరిక
– గతంలో ఒక మహిళా న్యాయవాది పేరు సూచించిన డీజీపీ
– ఆమె వైసీపీ సానుభూతిపరురాలన్న ఫిర్యాదుతో నిలిపివేయమన్న సీఎంఓ కీలక అధికారి
– ఇది మరీ మంచి ప్రభుత్వం గురూ!
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా ఏ పార్టీ అయినా గెలిచి, ఆ అధినేత సీఎం అయితే ఏం చేస్తారు? తనపై గత సర్కారు బనాయించిన కేసులను పరిష్కరించుకునేందుకు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. అసలు అడ్వకేట్ జనరలే వాటిని భుజానేసుకుని కావలసిన కార్యం పూర్తిచేస్తారు. ఆ కేసులు పరిష్కారమయ్యే వరకూ సీఎంఓ ముఖ్య అధికారి వాటిని పర్యవేక్షింటారు. అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం చర్చిస్తుంటారు.
గతంలో జగన్ కూడా ఇదేమాదిరిగా చంద్రబాబు కేసులకు సంబంధించి స్పెషల్ జీపీలను నియమించారు. కానీ ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటిదాకా చంద్రబాబునాయుడుపై గత సర్కారు బనాయించిన 5 కేసులకు సంబంధించి.. ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ న్యాయవాదినీ నియమించని అద్భుతం టీడీపీ న్యాయవాదులను నోరెళ్లబెట్టిస్తోంది. ప్రభుత్వ న్యాయపెద్ద నిర్లక్ష్యం ఆశ్చర్యపరుస్తోంది. అంటే కేసుల వాదన విషయంలో సీఎం కే దిక్కులేదంటే.. సర్కారు ఏరికోరి నియమించుకున్న ప్రభుత్వ న్యాయవాదపెద్ద ఏం చేస్తున్నట్లు? ఎక్కడున్నట్లు? ఏమిటీ ధిక్కారం? ఎందుకీ నిర్లక్ష్యం? బహుశా మంచి ప్రభుత్వమన్న చులకనా? ఏమీ చేయరన్న ధీమానా?.. ఇదీ ఇప్పుడు టీడీపీ న్యాయవాదవర్గాల్లో హాట్ టాపిక్.
మంచి ప్రభుత్వంలో ఇదో మంచి వార్త.. మంచి ఘటన.. మంచి నిర్లక్ష్యం.. మంచి ధిక్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షంలో ఉండగా, జగన్ ప్రభుత్వం ఆయనపై ఐదు కేసులు పెట్టింది. అందులో రెండు అసైన్డ్‌భూములు, ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్‌మెంట్, అవుట్‌రింగ్‌రోడ్ కేసుల్లో ఆయనను ముద్దాయిగా చేర్చింది.
సీన్ కట్‌చేస్తే.. చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటివరకూ ఆ ఐదు కేసుల పరిష్కారం కోసం, ఒక్క ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించకపోవడం ఆశ్చర్యం. నిజానికి 5 కేసులకు, ఐదుగురు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని నియమించాల్సి ఉంది. వీటిని అడ్వకేట్ జరనల్ సమీక్షించి, సమర్ధులైన న్యాయవాదులను నియమించాల్సి ఉంటుంది.
కానీ ఇప్పటివరకూ సీఎం చంద్రబాబు కేసుల కోసం, ఒక్క న్యాయవాదిని కూడా నియమించకపోవడం బట్టి.. చంద్రబాబునాయుడు.. రాష్ట్రంలో ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ, న్యాయవ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తికి, ఎంత స్వేచ్ఛ- చనువు ఇచ్చారో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేదా చంద్రబాబు నాయుడు ఆయనపై ఎంత గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నారన్నదీ అర్ధమవుతోందంటున్నారు.
‘‘ ఎంతోమందికి ఏజీ, జీపీ, పీపీ, ఏపీపీ ఉద్యోగాలిచ్చే ఒక సీఎం కేసుకే దిక్కులేకపోతే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఎవరైనా సీఎం నా కేసు కొంచెం పట్టించుకోండి. నా కేసు ఏమైంది అని అడుగుతారా? ప్రభుత్వ కీలక న్యాయవాదే వాటికి బాధ్యత తీసుకుని పూర్తి చేయాలి. కానీ ఈ మంచి ప్రభుత్వంలో అంతా రివర్సే. స్వయంగా సీఎం గారే తన కేసులో న్యాయవాదులను ఎప్పుడు నియమిస్తారని బేలగా ఎదురుచూడాల్సిన దుస్థితి. ఎక్కడో డిల్లీలో ఉన్న సిద్దార్థ్ లూధ్రా సలహాలు అడగాల్సి వస్తోంది. దీన్నిబట్టి ప్రభుత్వ న్యాయవ్యవస్థలో ఏం జరుగుతోంది? చంద్రబాబు ఇచ్చిన అలుసును ఏ స్థాయిలో నిర్లక్ష్యపరుస్తున్నారో అర్ధమవుతోంది’’ అని, గత ఐదేళ్ల కాలంలో జగన్ సర్కారుపై న్యాయసమరం చేసిన ఓ టీడీపీ న్యాయవాది వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా.. దీనికి సంబంధించి ఒత్తిళ్లు వస్తుండటంతో కొద్ది నెలల క్రితం డీజీపీ గొల్లపూడి కల్యాణి అనే న్యాయవాదిని, సీఎం కేసులకు స్పెషల్ జీపీగా నియమించాలని హోంశాఖ కార్యదర్శికి ప్రోసీడింగ్స్ పంపారట. ఆ విషయం బయటకు పొక్కడంతో.. ఆమె వైసీపీ సానుభూతిపరురాలంటూ టీడీపీకి చెందిన సీనియర్ న్యాయవాదులు సీఎంఓ కీలక అధికారికి ఫిర్యాదు చేశారట. దానితో అప్రమత్తమైన సదరు అధికారి.. హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి, డీజీపీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ నిలిపేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అసలు డీజీపీకి ఆ మహిళ పేరు ఎవరు సిఫార్సు చేశారన్న చర్చ కూపా నడిచింది.
ఇది స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కేసుల దయనీయగాథ! ఏడాది దాటినా తన కేసులోనే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులను నియమించుకోలేని నిస్సహాయత.. నియమించకపోయినా ఏమీ అనలేని అతి మంచిమతనం.. తాను నియమించిన న్యాయపెద్దనే తన పట్ల నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా చర్యల కొరడా ఘళిపించలేని బహు మెతకతనం.. మన మంచి ముఖ్యమంత్రి, మన మంచి ప్రభుత్వానిదేనని టీడీపీ లాయర్లు బోలెడు సానుభూతి ప్రదర్శిస్తున్నారు.
వారికి ‘న్యాయ’ం చేయరా.. నాయకా?
జగన్ జమానాలో పార్టీ నేతలపై జరుగుతున్న యధేచ్చ అరెస్టులను గమనించిన చంద్రబాబునాయుడు గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో లీగల్‌సెల్ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నందున, లీగల్ సెల్ చురుకుగా ఉండి, పార్టీని కాపాడాలని అభ్యర్థించారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో కూడా అలాంటి సమావేశమే నిర్వహించారు. వాటికి హాజరైన సీనియర్ న్యాయవాదులు తమ శక్తిమేరకు పనిచేస్తామని బాబుకు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత వారంతా పార్టీ ఆఫీసులోనే ప్రతిరోజు కూర్చుని, కార్యకర్తల కేసులను మానటరింగ్ చేసి, వాటిని ఆయా కోర్టుల్లో వకాలత్‌లు న్యాయసమరం చేశారు. హైకోర్టు, కింది కోర్టులకు సైతం వెళ్లి వాదించేవారు. అర్ధరాత్రి సైతం పోలీసుస్టేషన్లకు వెళ్లి, కార్యకర్తలకు న్యాయసహాయం చేసి, అండగా నిలిచేవారు. అప్పట్లో… ఇప్పుడు ప్రభుత్వ న్యాయపెద్దగా అవతారమెత్తిన వారెవరూ భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనిపించలేదని, బాబుకి ఇచ్చిన మాట కోసం తామే పోరాడామని టీడీపీ లాయర్లు గుర్తు చేస్తున్నారు.
నిజానికి చంద్రబాబు నాడు ఆ సమావేశంలో జూనియర్ న్యాయవాదుల ఖర్చుల కోసం.. నె ల జీతాలు ఏర్పాటుచేస్తామని చెప్పినా, వారంతా దానిని తిరస్కరించి సొంత ఖర్చులతోనే పార్టీకి పనిచేశారు. ఆవిధంగా సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ, దొద్దాల కోటేశ్వరరావు,గూడపాటి లక్ష్మీనారాయణ, బొద్దులూరి వెం టేశ్వరరావు, హరిబాబు, వజ్జా శ్రీనివాస్, రవియాదవ్, శాఖమూరి రేవతి, కిశోర్, గోపి వంటి న్యాయవాదులు కొన్నేళ్లపాటు పార్టీ ఆఫీసు కేంద్రంగానే కార్యకర్తలకు న్యాయసహాయం చేశారు. వీరిలో ఎవరూ పార్టీ నుంచి నయాపైసా తీసుకోకోవడం విశేషం.
అయితే వీరికి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ ఇస్తారని భావించినా 8 నెలల వరకూ వారికీ దిక్కులేకపోవడం ఇంకో ఆశ్చర్యం. పార్టీ కోసం పోరాడిన న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయంపై ‘సూర్య’’లో ‘న్యాయమెక్కడ నాయకా’ అన్న కథనం వెలువడిన తర్వాతనే.. వారిలో కొందరికి నామమాత్రపు పదవులిచ్చారు. అందులో మిగిలిన వారికి ఇప్పటివరకూ ఎలాంటి పదవులూ లేకపోవడం మరో వైచిత్రి. ఇక వీరిలో రోజు పార్టీ ఆఫీసుకు రాకపోయినా రాజమండ్రికి చెందిన ముప్పాళ్ల సుబ్బారావు లాంటి లాయర్లు కూడా జగన్ సర్కారుపై లీగల్ వార్ చేశారు.
కాగా సుబ్బారావు పేరు ఇప్పటికి మానవ హక్కుల కమిషన్‌కు నాన్ జ్యుడిషియల్ మెంబరుగా సిఫార్సు చేసినప్పటికీ.. ఇంకా చైర్మన్‌ను నియమించనందున, అన్నీ కలిపి ఒకేసారి నియమిస్తామని సీఎంఓ కీలక అధికారి ఒకరు సెలవిచ్చారట. మరొక ప్రభుత్వ ‘న్యాయ’ పెద్ద.. మీకు ఎమ్మెల్సీ రాజబాబు కేసులో లీగల్ అసిస్టెంట్‌గా ఉన్నందున ఇవ్వడం కుదర దని సెలవిచ్చారట. అయితే ఆ కేసులో పిపిని కాదని కేవలం అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ మాత్రమేనని బదులివ్వగా, సరే చూద్దామని సెలవిచ్చినట్లు సమాచారం.
అయితే ఇంకా ఆశ్చర్యమేమిటంటే.. వీరిలో ఒక అరడజను సీనియర్ న్యాయవాదులను చంద్రబాబు పేర్లతో పలకరించి, వారితో చర్చించేవారు. ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేవారు. పాపం అదే వారికి శాపంగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నారు.
‘మా గవర్నమెంట్‌లో లీగల్ వ్యవహారాలు చూసే ఓ పెద్దమనిషికి ఇవన్నీ నచ్చవు. బాబు గారితో ఎవరైనా నేరుగా మాట్లాడేవారుంటే వారిని కత్తిరించేస్తారు. బాగా వాదించగలిగే శక్తి ఉన్న వారిని కూడా బాబుకు దూరం చేస్తారు. ఆయన కొత్తవారిని బాబు దగ్గరకు రానీయరు. ఫలానా లాయర్ బాగా పనిచేశారని బాబుగారు మెచ్చుకుంటే ఇక ఆయన పని ఆరోజుతో అయిపోయినట్లే లెక్క’’ అని ఓ సీనియర్ న్యాయవాది అసలు విషయం వెల్లడించారు.
లా ఆఫీసర్లు, స్టాండింగ్ కౌన్సిల్‌లో ఇంకా వైసీపీ వాసనలే
ప్రభుత్వం మారి ఏడాది దాటినా ఇంకా వైసీపీ ప్రభుత్వం నియమించిన లా ఆఫీసర్లు, స్టాండింగ్ కౌన్సిల్స్‌ను ఈ ‘మంచి ప్రభుత్వం’ కూడా కొనసాగించడం ఆశ్చర్యం. జూన్ వరకూ ఉన్న వివరాల ప్రకారం.. 7 మంది ఏజీపీలు.. ఏపి హౌసింగ్‌బోర్డు, మైనారిటీ ఫైనాన్స్ కార్మొరేషన్, వక్ఫ్‌బోర్డు, వైద్యవిధాన పరిషత్, ఏపి టెక్నాలజీ సర్సీస్, సమగ్రవిక్షా అభియాన్, హ్యాండ్‌లూమ్ కో ఆపరేటివ్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్, మార్క్‌ఫెడ్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, కాపు కార్పొరేషన్, ద్రవిడ వర్శిటీ, రాయలసీమ ఎపి ఎస్సీ ఎస్టీ, బిసి ఎడ్యుకేషన్ సొసైటీస్, ఏపి మారిటైన్ బోర్డు, యోగి వేమన వర్శిటీ, డిఎస్ లా వర్శిటీలో వైసీపీ సర్కారు నియమించిన 17 మంది స్టాండింగ్ కౌన్సిల్స్ ఈ మంచి ప్రభుత్వంలో ఇంకా కొనసాగుతుండటమే ఆశ్చర్యం.
జగన్ లాయర్లే దిక్కా?
‘మంచి ప్రభుత్వం’ నియమించిన ప్రభుత్వ ‘న్యాయ’పెద్ద తీరును, ఇటీవల ఓ సీనియర్ న్యాయవాది ప్రభుత్వం దృష్టికి సాక్షాధారాలతో సహా తీసుకువెళ్లినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో జగన్ నియమించుకున్న ఇద్దరు న్యాయవాదులనే , మన ప్రభుత్వ న్యాయపెద్ద కూడా తన కేసులో నియమించుకున్న విషయాన్ని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
జగన్ సీబీఐ కేసులు, ఓబుళాపురం మైనింగ్ కేసులను ఢిల్లీకి చెందిన పరమాత్మాసింగ్, మాధుర్ జైన్, మయాంక్ జైన్‌లు వాదిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ‘న్యాయ పెద్ద’ సైతం.. సుప్రీంకోర్టులో తన కేసుకు అదే పరమాత్మాసింగ్, మయాంక్‌జైన్‌ను నియమించుకున్నారన్న సుప్రీంకోర్టు రికార్డు ప్రొసీడింగ్స్‌ను.. ఆ సీనియర్ న్యాయవాది, ప్రభుత్వంలోని ఓ కీలకనేతకు చూపించడంతో, ఆయన సైతం నోరెళ్లబెట్టారట.
పాత ఏజీపీలకు ఇంకా లక్షల ఫీజులు
జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా.. వైసీపీ ప్రభుత్వం నియమించిన ఏజీపీలు, కేసు ఫీజుల పేరిట ఇంకా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల వసూలు చేస్తున్న వైనం.. ప్రభుత్వ న్యాయపెద్ద నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని టీడీపీ లాయర్లు విమర్శిస్తున్నారు. వీరిలో లక్షరూపాయల నుంచి 5 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న వారి సంఖ్య బోలెడు. వీరంతా 3 నెలల నుంచి 11 నెలల కాలంలోనే ఇంత సంపాదించడం విశేషం.
‘ అదే వారిని తొలగించి, వారి స్థానంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారిని నియమిస్తే మా పార్టీ వాళ్లే ఆ లబ్థిపొందేవారు కదా? ఆ పనిచేయకుండా ఇంకా పాత వారినే కొనసాగిస్తున్నారంటే, మా ప్రభుత్వ న్యాయపెద్దకు పార్టీపట్ల ఏం అంకిత భావం-చిత్తశుద్ధి ఉందో మీరే చెప్పండి. అసలు ప్రభుత్వం మారగానే వైసీపీ నియమించిన వారితో రాజీనామా చేయించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? నిజంగా పార్టీ కోసం పనిచేసేవారయితే అంత నిర్లక్ష్యంగా ఉంటారా? చంద్రబాబు-లోకేష్‌పై రోజూ ఎదురుదాడి చేస్తున్న వైసీపీ నియమించిన వారినే ఇంకా కొనసాగిస్తారా? ఇదంతా దేవతావస్త్రాల కథలా ఉంది’’ అని టీడీపీకి చెందిన ఓ సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు.