-తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టని ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
– ఆమె ఫొటో లేకుండానే పేపర్లకు ప్రకటనలు
– పొంగులేటి ప్రకటనల్లో కనిపించని మీనాక్షి ఫొటో
– మంత్రి వివేక్ ప్రకటనలో మాత్రమే ప్రత్యక్షం
– ఖర్గే సమక్షంలో ఏఐసిసి నేత మీనాక్షికి అవమానం
– పొంగులేటికి క్లాస్ పీకినందుకే ఆమె ఫొటో వేయలేదన్న ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆమె కాంగ్రెస్ అధినేత్రి కాని అధినేత్రి సోనియా.. కాంగ్రెస్ దళపతి కాని దళపతి లాంటి రాహుల్ ఏరికోరి తెలంగాణ ఇన్చార్జిగా పంపించిన ఓ మహిళా నాయకురాలు. ఆమె రాష్ట్రానికి వచ్చినవెంటనే క్రమశిక్షణారాహిత్యానికి పెద్దమ్మలాంటి కాంగ్రెస్‌కు రిపేర్లు మొదలుపెట్టారు. పెద్ద నేతలను కూడా పిలిచి తలంటుతున్నారు. దానితో ఆమె పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి.
మరి అలాంటి మహిళా నేతకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వసే, రాష్ట్ర నేతలు-మంత్రులూ ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలి? కానీ తె లంగాణ కాంగ్రెస్ పార్టీ-ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి ఆమెను డోంట్‌కేర్.. ఇన్చార్జి అయితే ఏంటట? అంటూ, అసలు ఆమె ఫొటో లేకుండానే పేపర్లలో యాడ్లు ఇవ్వడం దుమారం రేపింది.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు హాజరయ్యారు. ఆ సందర్భంగా నగరానికి వచ్చిన ఖర్గేను స్వాగతిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలక ఫుల్‌పేజీ యాడ్స్ ఇచ్చారు. పైన ఖర్గే-సీఎం రేవంత్ ఫొటోలు పెద్దగా వేసి.. ఆపైన రాష్ట్ర మంత్రుల ఫొటోలు చిన్నవిగా పెట్టారు.
కానీ ఆ పత్రికల్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫొటో భూతద్దం వేసినా కనిపించలేదు. కనీసం చిన్న స్టాంప్ సైజ్ ఫొటో కూడా లేకపోవడం.. మరో మంత్రి వివేక్ వెలుగు పత్రికల్లో ఇచ్చిన యాడ్‌లో మాత్రం, మీనాక్షి నటరాజన్ ఫొటో ఉండటం కనిపించింది. ఇది తాజా దుమారానికి కారణమయింది.
అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి యాడ్స్ విడుదల చేసిన వారి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ పిసిసి అధ్యక్షుడే వాటిని విడుదల చేసి ఉంటే, కచ్చితంగా మీనాక్షి ఫొటో ఉంచేవారు. కాబట్టి అది పొంగులేటి ఇచ్చిన ప్రకటనగానే స్పష్టమవుతోంది. కాగా ఇటీవలి కాలంలో పొంగలేటి దూకుడుకు.. మీనాక్షి బ్రేకులు వేస్తున్నారన్న ఆగ్రహంతోనే, ఆ ప్రకటనల్లో ఆమె ఫొటో వేయలేదన్నది పార్టీ వర్గాల ఉవాచ. కాంగ్రెస్‌లో ఏది జరిగినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే… అది కాంగ్రెస్ కాబట్టి!