Home » బాలార్చన

బాలార్చన

ఆదిపరాశక్తి అర్చనల్లో అమ్మవారికి “బాలార్చన” ప్రీతిపాత్రం ఆదిపరాశక్తి అయిన కనకదుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన అర్చనలలో బాలార్చన ఒకటి. రెండు నుంచి పదేళ్ళలోపు ఉన్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారిని ప్రత్యక్షంగా అర్చించే విధానమే ‘బాలార్చన’ దీన్నే ‘కుమారీ పూజ’ అని కూడా
పిలుస్తారు. ఏడాదిలోపు, పదేళ్ళు దాటిన బాలికలు ఈ పూజ అందుకొనేందుకు అనర్హులని శాస్త్రాలు
చెబుతున్నాయి. దసరా ఉత్సవాలు జరిగే రోజుల్లో అన్ని ఆలయాల్లో బాలార్చన తప్పనిసరిగా
చేస్తారు. శ్రీవిద్య ఉపాసన చేసే సాధకులు కూడా ఈ పూజను నిత్యం చేస్తుంటారు. పూజావిధానం… రెండు
నుంచి పదేళ్ళలోపు వయస్సున్న బాలికలను ఈ పూజకు ఎంచుకోవాలి. రెండేళ్ళ బాలికను ‘కుమారీ’గా,
మూడేళ్ళ బాలికను ‘త్రిమూర్తి’, నాలుగేళ్ళ బాలికను ‘కళ్యాణి’, ఐదేళ్ళ బాలికను ‘రోహిణి’, ఆరేళ్ళ
బాలికను ‘కాళి’, ఏడేళ్ళ బాలికను’చండీ’, ఎనిమిది ఏళ్ళ బాలికను ‘శాంభవి’ తొమ్మిది ఏళ్ళ బాలికను ‘దుర్గ’,పదేళ్ళ బాలికను ‘సుభద్ర’ అని పిలుస్తారు. వారికి ముందుగా అభ్యంగన స్నానం చేయించి, చక్కగా
అలంకరించి, ఆదిపరాశక్తి ఆ బాలిక రూపంలో మన ఎదురుగా ఉందని భావించి, ఆమెకే అన్నిరకాల ఉపచారాలతో పూజచేయాలి. చివరగా ఆమెకు మధురపదార్ధాలతో భోజనం పెట్టాలి. దీక్షగా నవరాత్రులు చేసేవారు నిత్యం ఒకే బాలికను(శక్తిని బట్టి ఎంతమందినైనా పూజించవచ్చు) తొమ్మిది రోజుల పాటు పూజించి చివరి రోజున ఆమెకు నూతన వస్త్రాలు, శక్తిని బట్టి ఆభరణాలు ఇవ్వాలి. ఇలా చేస్తే  ఆ ఇంట సకల సౌభాగ్యాలు నిలుస్తాయిని శాస్త్రవచనం. నియమాలు… బాలార్చనకు సంబందించి శాస్త్రం కొన్ని నియమాలు చెబుతోంది.
అనారోగ్యంతో బాధపడేవారు గాయాలు, వ్రణాలు ఉన్నవారికి బాలార్చన చేయడం నిషేదం. పరిపూర్ణ
ఆరోగ్యవంతులైన బాలికలకే ఈ పూజ చేయాలి.నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు బాలార్చన
చేసే శక్తి లేనివారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి తిధుల్లో ఈ పూజ చేయవచ్చు అని, అదీ కుదరనివారు అష్టమినాడు విశేషంగా పూజించవచ్చని శాస్త్రం చెబుతోంది. బాలలు భగవంతుని స్వరూపమని పెద్దలు  చెబుతుంటారు. ఆ భగవత్స్వరూపాన్ని ఆరాధించడమే బాలార్చన… అంటే
భావిప్రగతిశక్తులు బాలలేనని గుర్తెరగడమే బాలార్చనలోని సామాజిక కోణం.

Leave a Reply