Suryaa.co.in

Editorial

జగన్‌పై బాలినేని తిరుగుబాటు?

– ఎమ్మెల్యే, ఎంపీలను ప్రకటించిన ధిక్కారం
– ఒంగోలు ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటన
– ఒంగోలు ఎంపీగా మాగుంట బరిలో ఉంటారని స్పష్టీకరణ
– అధినేత జగన్‌ నిర్ణయంతో సంబంధం లేకుండానే సొంత ప్రకటన
– సమన్వయకర్తలను పక్కనపెట్టి సొంత ప్రకటనతో సంచలనం
– ఒంగోలులో బాలినేని బదులు కరణం బలరాం?
– అభ్యర్ధుల మార్పుపై బాలినేని గుర్రు
– స్థానికేతరులకు ఒంగోలు అడ్డానా అని ఆగ్రహం
– ఒంగోలులో సమర్ధులు లేరా అని నిలదీత
– మీరు ఎంపిక చేసి నాకు బాధ్యత ఇస్తే ఎలా?
– విజయసాయిరెడ్డి, సజ్జలకు స్పష్టం చేసిన బాలినేని?
– టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమవుతోందా?
– మాగుంట, కరణం బలరాం, శిద్దా, జంకె సహా జంప్‌?
– టీడీపీ కీకల నేతలతో మంతనాలు?
– ప్రకాశం వైసీపీలో ‘బాలినేని’ బాంబు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని బాంబు పేలింది. పార్టీ అధినేత జగన్‌ నిర్ణయంతో సంబంధం లేకుండా… సమన్వయకర్త ప్రకటనతో పనిలేకుండా ..ఎన్నికల్లో తనతోపాటు సిట్టింగ్‌ ఎంపీ మాగుంట మళ్లీ పోటీ చేస్తారంటూ బాలినేని చేసిన ప్రకటన, వైసీపీ అధినేత జగన్‌ను సవాల్‌ చేసేలా మారింది. పార్టీ సంప్రదాయానికి భిన్నంగా, తనంతట తానే అభ్యర్ధిని ప్రకటించుకున్న బాలినేని.. జగన్‌ నాయకత్వాన్ని దాదాపు ధిక్కరించినంత పనిచేశారు.

ఎంపి విజయసాయిరెడ్డి సూచన మేరకు.. తాను సిఫార్సు చేసిన అభ్యర్ధులకు బదులు, మరొకరిని ఇన్చార్జిలుగా ప్రకటించడంపై బాలినేని భగ్గుమంటున్నారు. ‘‘మీరే అభ్యర్ధులను ఎంపిక చేసుకుని, అక్కడ గొడవలు జరగకుండా చూడాలని నన్ను అడిగితే కుదరదు. టికెట్లు ఇచ్చారు కాబట్టి నేతలను కూడా మీరే సముదాయించుకోండి. నేను కూడా ఒంగోలు నుంచి పోటీ చేయమంటే చేస్తా. లేదంటే చేయను’’ అని సమన్వయకర్త విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, బాలినేని కుండబద్దలు కొట్టిన వైనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధినేత జగన్‌పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా? బాసుతో తాడోపేడో తేల్చుకునేందుకు బాలినేని రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవలికాలంలో శరవేగంగా జరుగుతున్న వైసీపీ రాజకీయాలు.. పార్టీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయాల అనంతరం మారుతున్న పరిణామాలు.. ఈ సంకేతాలనే ఇస్తున్నాయి.

మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత జిల్లాలో తన ప్రాధాన్యాన్ని, జగన్‌ కావాలనే క్రమేపీ బలహీనపరుస్తున్నారని బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్‌ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో, ఆగ్రహించి వెళ్లిన బాలినేని వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమయింది. ఇప్పుడు జిల్లాలో తన ప్రమేయం లేకుండానే జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై, ఆగ్రహంతో రగిలిపోతున్న బాలినేని.. ఇక బాసుతో తాడోపేడో తేల్చకునేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

తాజాగా నాయ త్వం ప్రకటించిన 11 మార్పుల్లో భాగంగా, మంత్రి నాగార్జునను, ఒంగోలు జిల్లాకు తీసుకురావడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఆయన గెలవడం కష్టమని.. జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎంపి విజయసాయిరెడ్డికి బాలినేని కుండబద్దలుకొట్టారట. జిల్లాలో చాలామంది సమర్ధులుంటే వారిని కాదని, పక్క జిల్లా నుంచి అభ్యర్ధులను తీసుకువస్తే వారిని ఎవరు గెలిపిస్తారని, బాలినేని నిలదీసినట్లు సమాచారం.

ఇక విజయసాయిరెడ్డి సూచన మేరకు, ఎర్రగొండపాలెం అభ్యర్ధిగా టి.చంద్రశేఖర్‌ పేరును బాలినేని సిఫార్సు చేశారు. ఆ ప్రకారంగా విజయసాయి రెడ్డి, సదరు చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌ రమ్మని కబురు చేసి.. ‘మాటా- ముచ్చట’తోపాటు, ‘అన్ని వ్యవహారాలు’ మాట్లాడుకుని, ఒకరోజు వరకూ వెయిట్‌ చేయించారట. చివరకు ఎర్రగొండపాలెం సీటును.. బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌ బదులు, గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్‌ భర్త సురేష్‌కు ఇస్తున్నట్లు విజయసాయి ఫోన్‌లో బాలినేనికి చెప్పారట.

దీనితో ఆగ్రహోదగ్రుడైన బాలినేని.. ‘జిల్లాలో మీ ఇష్టం వాళ్లని పెడుతున్నారు. వాళ్లను మీరు, సజ్జల, జగన్‌ కలిసి గెలిపించుకోండి. మళ్లీ అక్కడ నేతలు సహకరించడం లేదని మీరు నాకు ఫోన్‌ చేయవద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తాము నిమిత్తమాత్రులమని, జగన్‌ చెప్పిందే అమలుచేస్తాం కదా’ అని విజయసాయి, ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారట.

అందుకు స్పందించిన బాలినేని ‘అయితే మీరెందుకు నన్ను సలహాలు అడగటం? జిల్లాలో బాలినేని నిర్ణయం ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని పార్టీ వారికి చెప్పడం ఎందుకు’ అని అగ్గిరాముడ య్యారట.‘ మీ ఇష్టం ఉన్న వారికి ఇవ్వండి. నన్ను కూడా ఒంగోలు నుంచి పోటీ చేయమంటే చేస్తా. లేకపోతే అది కూడా చేయను’ అని నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం.
సంతనూతలపాడు ఇన్చార్జిగా నాయకత్వం ప్రకటించిన, మంత్రి నాగార్జునకు స్థానికులెవరూ పనిచేయరని కుండబద్దలు కొట్టారట. దీనితో మొన్నటి జాబితాలో ఎర్రగొండపాలెం ఇన్చార్జిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కాగా ‘‘కనిగిరిలో బుర్ర మధుసూదన్‌ గెలవడు. అక్కడ రెడ్డికే సీటివ్వాలి లేకపోతే టీడీపీ నుంచి ఉగ్ర నర్శింహారెడ్డి ఖాయంగా గెలుస్తార’’ని బాలినేని హెచ్చరించినట్లు సమాచారం. అద్దంకి ఇన్చార్జిగా వైవి సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి హనిమిరెడ్డి నియామకంపైనా, బాలినేని అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు చైతన్యను మార్చడంతో అద్దంకి వైసీపీ రెండుగా చీలిపోయింది. జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, చైతన్య అనుచరులు బాహాటంగానే డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు బాలినేనికే టికెట్‌ ఉండదన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి ఉధృతంగా సాగుతోంది. ఒంగోలులో కరణం బలరాం, చీరాలలో మోపిదేవి వెంకట రమణ, పరుచూరులో కరణం వెంకటేష్‌ లేదా కొత్త అభ్యర్ధి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్‌, మార్కాపురంలో మాగుంట రాఘవ రెడ్డి, గిద్దలూరుకు శిద్దా రాఘవరావును ఇన్చార్జిలుగా ప్రకటిస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ మార్పులకు రాజశేఖర్‌ తప్ప ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తోంది.

ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో హటాత్తుగా తెరపైకొచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు అసెంబ్లీకి, మాగుంట ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి, జగన్‌కు సవాల్‌ విసిరారు. వైసీపీలో సహజంగా ఏ నిర్ణయమైనా, జగన్‌ ఆదేశాలతో సమన్వయకర్తలు ప్రకటిస్తుంటారు. కానీ ఎవరి ప్రమేయం లేకుండా స్వయంగా బాలినేని, తనంతట తాను అభ్యర్థులను ప్రకటి ంచడంతో, ఇక జగన్‌పై నేరుగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లే స్పష్టమవుతోంది.

కాగా బాలినేని తన వర్గమైన మాగుంట, కరణం బలరాం, శిద్దా రాఘవరావు, జెంకె వెంకటరెడ్డితో కలసి టీడీపీలో చేరేందుగు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు , వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరంతా చాలా ఏళ్ల నుంచి ఒకేమాటపై ఉండి, జిల్లా రాజకీయాలు నడిపిస్తున్నారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావును అద్దంకి నుంచి పోటీ చేయాలని నాయకత్వం ఒత్తిడి చేస్తుండగా, ఆయన మాత్రం తనకు పట్టున్న దర్శి నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. టీడీపీ వర్గాలు సైతం.. బాలినేని పార్టీలో చేరితే ఉమ్మడి జిల్లాలో వైసీపీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి.

‘వాసు, బలరాం, శిద్దా పార్టీలో చేరితే బాగుంటుంది. పార్టీ బలపడుతుంది. మెజారిటీ సీట్లు మాకే రావడం ఖాయం. అయితే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ను ఒప్పిస్తే, ఎలాంటి సమస్యలూ ఉండవ’’ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు విశ్లేషించారు.

LEAVE A RESPONSE