– యుక్రెయిన్ ను కాపాడుతాం
-పుతిన్ అంతు చూస్తాం
-రష్యా విమానాల పై బైడెన్ ఆంక్షలు..!
యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై దండెత్తివచ్చిన పుతిన్ సేనలపై యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతోంది.ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకీ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. రష్యా చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవసరమైతే అణుబాంబు కూడా ప్రయోగించడానికి వెనుకాడేది లేదని పుతిన్ కూడా గట్టిగానే హెచ్చరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పుతిన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించగా.. తాజాగా అమెరికా కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా విమానాలపై అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రెస్‌లో బైడెన్ ఈ కీలక ప్రకటన చేశారు.