12న జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీతో బండి సంజయ్ భేటీ

• క్షేత్రస్థాయిలో చేరికలపైనే ప్రధాన చర్చ
• పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు
• ఈనెల 16న జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలోని యువ తెలంగాణ పార్టీ విలీనం

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై ద్రుష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలుసహా వివిధ పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులకు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ బండి సంజయ్ మాత్రం ప్రధానంగా స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు గ్రామ, మండల స్థాయిలో ప్రజల్లో పేరున్న నేతలను చేర్చుకునే అంశంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

అందులో భాగంగా అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకునే అంశంపై జిల్లా అధ్యక్షులు, జాయిన్సింగ్స్ కమిటీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధుసూదన్ తాజాగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అట్లాగే జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణిరుద్రమదేవి ఆధ్వర్యంలోని యువ తెలంగాణ పార్టీ ఈనెల 16న బీజేపీలో విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.

త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీలో వలసల ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దీనిని ద్రుష్టిలో ఉంచుకున్న బండి సంజయ్ ఈనెల 12న ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలోని జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై పార్టీలో చేరికల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

జాయినింగ్స్ అండ్ కో ఆర్డి నేషన్ కమిటీ ఛైర్మన్ గా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బండారి రాధిక లను జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా నియమించారు.

రాష్ట్రంలో ఇతర పార్టీల్లోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, యువకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, పట్టణస్థాయిలో ప్రజల్లో పట్టున్న నేతలను మాత్రమే పార్టీలో చేర్చుకునే అంశంపై ఈ కమిటీ ప్రాధాన్యతనిస్తోంది.

అదే సమయంలో పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న వారిని మాత్రమే గుర్తించి బీజేపీలోకి చేర్చుకునే పనిలో పడింది. దీంతోపాటు స్థానికంగా మొదటి నుండి పనిచేస్తున్న సీనియర్ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత-కొత్త నేతల కలయికతో పార్టీని సమన్వయం చేయడమే లక్ష్యంగా ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలోని జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 12న జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply