Suryaa.co.in

International

సైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్..

(వివి శ్రీనివాస్ బత్తిన)

బంగ్లాదేశ్ రాష్ట్రంలో నెలల తరబడి నిరసనలు.. ఆందోళనలతో రగిలి పోయిన రచ్చలో వందలాది మంది మృతి.. కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలన లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతి యుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారి తీశాయి. దేశ వ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్‌ హసీనా ప్రభుత్వం వణికి పోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగాల్సి వచ్చింది.

కొన్ని నెలలుగా జరుగుతోన్న ఆందోళన.. రెండు, మూడ్రోజుల నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించారు ఆందోళనకారులు.. పరిస్థితి చేయి దాటి పోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు..

45 నిమిషాల గడువు
పరిస్థితులు ఆందోళన కరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు, భద్రతా కారణాల దృష్ట్యా దేశం వెడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.

అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్‌కు చేరుకున్నారు. యూపీ లోని ఘజియాబాద్ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్న షేక్ హసీనా లండన్ కు వెళ్లనున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వదిలి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు..

హసీనా ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌ ఇతర వస్తువులను పగలగొట్టి.. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు.

మరోవైపు, బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్‌ బార్డర్‌లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ డీజీ కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.

కరోనా తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాల వరకు అన్నీ ధరలు 20 శాతం వరకు పెరిగాయి.

యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను విధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి.. స్టూడెంట్స్‌లో ఉన్న ఆగ్రహావేశాలను బంగ్లాదేశ్‌ లోని అపోజిషన్‌ పార్టీ.. బంగ్లా దేశ్‌ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది.

LEAVE A RESPONSE