Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డిని సీపీఎస్ ఉద్యోగులు నమ్మినందుకు..ఇప్పుడు జీపీఎస్ రూపంలో ఏకంగా పెద్ద మేకు గుచ్చాడు

• 2004లో తండ్రి… 2023లో కొడుకు.. పోటీలు పడీ మరీ ఉద్యోగులు, ఉపాధ్యాయలకు తీరని అన్యాయం చేశారు
• సీపీఎస్ గురించి పూర్తిగా తెలియకుండా హామీ ఇచ్చామని జగన్ రెడ్డి, సజ్జల చెప్పడం ఉద్యోగుల చెవుల్లో పూలు పెట్టడమే
• 3.50 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు కన్నెర్రజేస్తే జగన్ సర్కార్ ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
• తమకు జరిగిన అన్యాయానికి జవాబుగా ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులు ఓట్లరూపంలో తీర్పు ఇస్తే జగన్ రెడ్డి అతని ప్రభుత్వం దుకాణం కట్టేయడం ఖాయం
– మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ

జగన్ రెడ్డి సర్కార్ నిన్న మరో పెద్ద బండను రాష్ట్ర ఉద్యోగులపై వేసిందని, 01-09-2004 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన సీపీఎస్ స్థానంలో ఉద్యోగులకోసం జీపీఎస్ అమలుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ, మండలిలో వైసీపీ ప్రభుత్వం ఆమోదిం చడం ముమ్మాటికీ దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

నాడు తండ్రి.. నేడు కొడుకు. ఇద్దరూ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు
“ జగన్ రెడ్డి ఆయన కుటుంబం ఆదినుంచీ సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూనే ఉంది. 2004లో కేంద్రప్రభుత్వం సీపీఎస్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు, నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని నాటి ప్రభుత్వ ఉద్యోగులంతా, ఓపీఎస్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ నాడు రాజశేఖర్ రెడ్డి అందుకు విరుద్ధంగా సీపీఎస్ కు అనుకూలంగా సంతకం పెట్టారు. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో 01-09-2004 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో టీడీపీ మినహా అన్ని పార్టీలు సీపీఎస్ అమలుకే మొగ్గుచూపాయి. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తామని నాడు ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. సీపీఎస్ రద్దు హామీతో పాటు.. అనేక హామీలి చ్చాడు. కానీ అవేవీ ఈ నాలుగున్నరేళ్లలో అమలుచేయలేదు. పైగా హామీలపై తనను నిలదీస్తున్నారన్న అక్కసుతో ఉద్యోగులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజలపై తీవ్రమైన అణ చివేత చర్యలకు పాల్పడ్డాడు.

సీపీఎస్ రద్దు హామీలోని లోటుపాట్లు…కష్టనష్టాలు సజ్జలకు, ముఖ్యమంత్రికి అధికారం చివర్లనే గుర్తొచ్చాయా? హమీ ఇచ్చేముందు తెలియదా?
జగన్ రెడ్డి మొత్తంగా అమలుచేస్తానన్న నవరత్నాల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీ రత్నం కూడా ఒకటి. సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ రెడ్డి మాటలు నమ్మి, జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగులంతా ఆయనకు బాసటగా నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు శాయశక్తులా సహకరించారు. అలాంటి ఉద్యోగుందరికీ ముఖ్యమం త్రి అయిన వెంటనే జగన్ రెడ్డి పంగనామాలు పెట్టాడు. సీపీఎస్ రద్దుచేసి, దాని స్థానం లో పాత ఓపీఎస్ విధానమే అమలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తో ప్రభుత్వసలహాదారు సజ్జల…. తమ నాయకుడు తెలియక పొరపాటున హామీ ఇచ్చాడని నాలుక మడతేశాడు.

సీపీఎస్ రద్దు చేయడం వెనకున్న లోటుపాట్లు.. కష్టా లు తెలియకనే జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీ ఇచ్చాడని చెప్పా డు. సజ్జల అలా చెప్పడానికి.. అతనితో అలా చెప్పించడానికి ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి సిగ్గుందా? సీపీఎస్ గురించి పూర్తిగా తెలియకనే హామీ ఇచ్చామని జగన్ ప్రభుత్వం చెప్పడం ఉద్యోగుల చెవుల్లో పూలు పెట్టడమే. కాలిలోఉన్న ముల్లు తీస్తాడని జగన్ రెడ్డిని నమ్మిన సీపీఎస్ ఉద్యోగులకు ఈ ముఖ్యమంత్రి పెద్ద మేకు గుచ్చాడు. న్యాయం చేయండని ఎప్పటినుంచో తనను ప్రాధేయపడుతున్నవారి కళ్లల్లో జగన్ రెడ్డి నీళ్లు తెప్పించాడు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నాడు చంద్రబాబునాయడు ఉద్యోగుల మేలుకోసం 62 జీవోలతో పాటు అడిగినవన్నీ ఇచ్చారు
తన వైఫల్యాలు నిలదీస్తూ, ప్రజల్లో తనను దోషిగా నిలబెడుతున్నాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి చంద్రబాబునాయుడిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక సీపీఎస్ ఉద్యోగుల బాధలు, సమస్యలు గ్రహించి వారికి న్యాయం చేశారు. సీపీఎస్ ఉద్యోగులు చనిపోతే, వారి కుటుంబసభ్యుల కు మేలు కలిగేలా ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ స్కీమ్ ను అమలు చేసిన ఏకైక నాయకు డు దేశంలో చంద్రబాబునాయుడు ఒక్కరే.

సీపీఎస్ ఉద్యోగి చనిపోతే అతని భార్యకు నెలకు రూ.43వేల వరకు పింఛన్ వచ్చేలా చంద్రబాబు సరికొత్త నిర్ణయం అమలు చేశారు. అలానే రాష్ట్ర లోటు బడ్జెట్లో ఉన్నా ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని రూ.2,110కోట్లతో 43 శాతం ఫిట్ మెంట్ అందించారు. ఉద్యోగులకు అనుకూలంగా దాదాపు 62 జీవోలు ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఉత్సాహం వల్లే, 2019లో వచ్చిన జగన్ సర్కార్ కు దాదాపు 700 వరకు కేంద్రప్రభు త్వ అవార్డులు లభించాయి. ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోయినా.. టీడీపీప్రభుత్వ కృషి, ముందుచూపుతో వచ్చిన అవార్డుల్ని తమ పనితీరుతోనే వచ్చాయని వైసీపీ నేతలు.. మంత్రులు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటున్నారు.

జగన్ రెడ్డి బటన్ నొక్కుడులోని బోగస్ వ్యవహారాలను సెక్రటేరియట్ ఉద్యోగులు బయటపెడితే.. ఈప్రభుత్వ బండారం బట్టబయలవుతుంది
జగన్ రెడ్డి బటన్ నొక్కుడు అంతా బోగస్ అని ఈ మధ్యనే తెలిసింది. అమ్మఒడి.. రైతు రుణమాఫీ… వైఎస్సార్ చేయూత… వాహన మిత్ర సహా చేతివృత్తిదారులకు అందిస్తు న్న ఆర్థికసాయం అంతా కొద్దిమందికే ఇస్తూ.. అందరికీ ఇస్తున్నట్టు అధికారులతో తప్పుడు సంతకాలు పెట్టిస్తున్నారు. ఇటీవలే సీపీఎస్ స్కీమ్ లో చేరిన 1.20లక్షల మంది సెక్రటేరియట్ ఉద్యోగులు నోరు విప్పితే, పథకాల అమలు పేరుతో ప్రజల్ని నిలువునా వంచిస్తున్న జగన్ రెడ్డి బండారం బట్టబయలవుతుంది.

సెక్రటేరియట్ ఉద్యోగులతో కలిపి దాదాపు 3.50లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు కన్నెర్రజేస్తే జగన్ సర్కార్ ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమకు చేసిన అన్యాయాని కి ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులందరూ కలిసి 15 లక్షల మంది ఓటర్లు ఒకేసారి తీర్పు ఇస్తే జగన్ రెడ్డి అతని ప్రభుత్వం ఒకేసారి దుకాణం కట్టేయడం ఖాయం.

జీపీఎస్ బిల్లులో ప్రవర్తన అనే మాటకు అర్థం ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. వైసీపీ కండువాలు కప్పుకొని ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఈ గుడ్డి సర్కార్ కు వంత పాడాలన్నది పాలకుల ఉద్దేశమా?
సీపీఎస్ రద్దు చేయడం వీలేకాదని చెప్పిన జగన్ ప్రభుత్వం…. కనీసం పాత విధానమైన ఓపీఎస్ అమలుచేయకుండా.. దానికి బదులు జీపీఎస్ విధానం తీసుకు రావడం ద్వారా దాదాపు 7 నెలలనుంచి ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు అందాల్సిన నిధుల్ని నిలిపేసింది. నిన్న వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొన్న అంశాలు కూడా ఎప్పుడు అమలవుతాయనేది ఉద్యోగులకు స్పష్టత ఇవ్వలేదు. సీపీఎస్ విధానంలో ఉండే ఉద్యోగి తన వంతుగా 10శాతం సొమ్ము పొదుపుచేస్తే, దానికి ప్రభుత్వం మరో పదిశాతం ఇచ్చి, ఆ ఉద్యోగి రిటైరయ్యాక మొత్తంగా తన బేసిక్ మూలవేతనంలో దాదాపు 60 శాతం డబ్బురూపంలో తీసుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన 40శాతం ఇతర మార్గాల్లో తీసుకోవచ్చు.

ఆ విధంగా దేశమంతా సీపీఎస్ విధానం అమలుచేస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం జీపీఎస్ విధానం తీసుకురావడం ఉద్యోగులకు తీరని ద్రోహం చేయడమే. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు పదవీ విరమణానంత రం ఆర్థిక భద్రత కల్పించడమనేది ప్రభుత్వాల బాధ్యతని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా జగన్ సర్కార్ జీ.పీ.ఎస్ విధానం తీసుకొచ్చింది. జగన్ రెడ్డి చెబుతున్న గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) లో పెన్షన్ కు ఎక్కడ గ్యారంటీ ఉందో ఆయనే చెప్పాలి. జగన్ రెడ్డికి ఉద్యోగులంటే.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులంటే విపరీతమైన కక్ష ఉంది. వారిని దెబ్బకొట్టాలన్న తన ఆలోచనలో భాగమే జగన్ రెడ్డి సర్కార్ జీపీఎస్ విధానం తెరపైకి తెచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది.

జీ.పీ.ఎస్ విధానానికి సంబంధించి నిన్న ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో ‘ప్రవర్తన’ అనే మాట దాని వెనకున్న అంతరార్థం ఏమిటో ముఖ్యమంత్రి ఉద్యోగులకు స్పష్టం చేయాలి. ప్రవర్తన అంటే ఉద్యోగులు..మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ వైసీపీ కండువాలు వేసుకొని మూకమ్మడిగా ఆ పార్టీ తరుపున ప్రచారం చేయాలా? అదే జగన్ రెడ్డి ఆంతరంగిక భావనా? జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ గ్యారెంటీ స్కీమ్ కాదు.. ముమ్మాటికీ అన్ గ్యారెంటీ స్కీమే.

ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఉద్యోగ సంఘం నేతలు ఎందుకు నోరెత్తరు? జీపీఎస్ విధానాన్ని సంఘనేతలు సమర్థిస్తున్నారా?
3.50 లక్షల మంది ఉద్యోగులు లబోదిబోమని మొత్తుకుంటుంటే, వారిపై లాఠీ దెబ్బలు పడుతుంటే ఉద్యోగసంఘాల నేతలు మొద్దునిద్ర పోతున్నారా? బండి శ్రీనివాస్.. బొప్ప రాజు వెంకటేశ్వర్లు… వెంకట్రామిరెడ్డి ఎందుకు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయ లేని దుస్థితిలో ఉన్నారు? ఎవరిని అడిగి ప్రభుత్వం జీపీఎస్ విధానం అమలుకు సంబంధించి బిల్లు తీసుకొచ్చిందో ఉద్యోగసంఘ నేతలు ఎందుకు ప్రశ్నించరు? ఉద్యోగ సంఘాల సలహాదారుగా ఉన్న వ్యక్తి నెలకు రూ.5లక్షలు తీసుకుంటూ ప్రభుత్వ అన్యాయానికి బలైన ఉద్యోగుల తరుపున ఎందుకు ఒక్కమాటకూడా మాట్లాడలేదు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ..ఓపీఎస్ విధానం పునరుద్ధరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిసీ, జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదో ఉద్యోగులకు సమాధానం చెప్పాలి. పశ్చిమబెంగాల్, పంజాబ్, కర్ణాటక, సిక్కిం సహా అనేక రాష్ట్రాలు ఆర్టికల్ 309ని అనుసరించే ఇప్పటికీ ఓపీఎస్ విధానాన్నే ఉద్యోగుల కు అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు ఒక బృందాన్ని పంపి, ఓపీఎస్ అమలు సాధ్యాసాధ్యాలు పరిశీలించే ఆలోచన కూడా జగన్ రెడ్డి చేయకపోవడం ముమ్మాటికీ ఉద్యోగులుపై కక్షసాధించడమే.

రూ.13లక్షలకోట్ల అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం చివరకు అటు ప్రజలకు సక్రమంగా పథకాలు అందించకుండా, ఇటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ, ప్రజల సొమ్మును దిగమింగుతున్నది నిజం కాదా? పీఆర్సీ అమల్లో.. డీఏల చెల్లింపులో ఉద్యోగుల్ని మోసగించిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా సీపీఎస్ రద్దు హామీని గాలికివదిలేసి… దానిస్థానంలో జీపీఎస్ తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం నిజంగా దున్నపోతు ప్రభుత్వమనే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు తగిన న్యాయం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ బిల్లుని తెలుగుదేశం పూర్తిగా వ్యతిరేకిస్తోంది.” అని రామకృష్ణ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE