చదువుకున్నోడి కంటే..?

ఈ కథ చదవండి!

కొందరు దుండగులు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి ఒక గదిలో ఉంచారు.ఆ గది నిండా ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు.బందీలుగా ఉన్నా కూడా తిండి ఉన్నందుకు సంతోషిస్తూ, వాళ్లంతా బుర్రలకు పదును పెట్టడం ప్రారంభించారు.బందీల్లో ఒకరు ఆరితేరిన వ్యాపారి..అక్కడ ఉన్న ఆహార పదార్థాల విలువ ఎంతో లెక్క కట్టి ఖచ్చితంగా చెప్పాడు.విని అందరూ అతగాడిని అభినందించారు.

ఆ వెంటనే అక్కడున్న డాక్టర్ స్పందిస్తూ.. ఆ ఆహార పదార్థాల్లో ఏవి ఎంతకాలం తినవచ్చు..నిల్వ అయ్యాక ఏవి ఎప్పుడు పాడవుతాయో చెప్పగా , లెక్కల్లో నిపుణుడైన ఇంజనీర్ డాక్టర్ అంచనాల ప్రకారం మొత్తం ఆహారం అలా తమందరికీ ఎన్నాళ్ళ వరకూ వస్తుందో లెక్క కట్టాడు. దాంతో మిగిలిన వాళ్ళు ఆ డాక్టర్, ఇంజనీర్ల తెలివిని మెచ్చుకున్నారు.

ఇప్పుడు బందీల్లో ఒకరైన లాయర్ వంతు..తన తెలివిని ప్రదర్శిస్తూ బయటపడ్డాక దుండగులకు ఏయే సెక్షన్ల కింద ఎంతమేర శిక్ష పడుతుందో వివరించారు వకీలు గారు.వారిలోనే ఉన్న రాజకీయ నాయకుడు మొత్తం ఆహార పదార్థాలు తన ఒక్కడికే దక్కితే అందరూ పోయినా, తాను మాత్రం ఎక్కువ కాలం బ్రతికి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు..ఇలా అందరూ ఎవరి తెలివి తేటలు వాళ్ళు ప్రదర్శిస్తూ పక్కన ఉన్నవాళ్ళ అభినందనలు అందుకుంటుంటే బందీల్లో ఉన్న చాకలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు..

అది చూసి మిగిలిన వారు అతగాడిని హేళన చేశారు.కాసేపు వాళ్ళ గోల విన్న ఆ చాకలి చివరగా తన మౌనాన్ని వదిలి…మీరంతా మీమీ తెలివితేటలతో ఇక్కడున్న ఆహారపదార్థాల గురించి విశ్లేషణలు చేశారు.సంతోషం..నాకు అన్ని తెలివి తేటలు లేవు.అందుకే ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగో చూసాను..అదిగో ఆపైన కొన్ని పెంకులు వదులుగా ఉన్నాయి..ఇక్కడున్న పెట్టెలు అన్నిటినీ వరసగా ఒకదాని మీద ఒకటి పెడితే నేను పైకి ఎక్కి పెంకులు తప్పించి బయటకు వెళ్లి అటు నుంచి తలుపుల తాళాలు బద్దలు కొట్టే మీ అందరినీ విడిపిస్తాను అన్నాడు..అతను చెప్పిన ఆ ప్రకారమే తన పథకాన్ని అమలు చేశాడు.అందరూ సులువుగా తప్పించుకున్నారు.

అందుకే అన్నారేమో.. చదువుకున్నోడి కంటే చాకలి మేలని..విద్యాధికులకు క్షమాపణలతో..కాకపోతే ఒక్కోసారి మేధస్సు కంటే సమయస్ఫూర్తి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నది నిజం..ఆరు పన్నెండ్లు ఎంత అంటే ఫోను తీసి కాలిక్యులేటర్ ఓపెన్ చేసి లెక్క కడుతున్న రోజులు.. బుర్రలకు బూజులు పట్టవా మరి.!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
 విజయనగరం
9948546286

Leave a Reply