Suryaa.co.in

Features

భగత్‌సింగ్‌ను తొలగించి..హెగ్డేవార్ పాఠం పెట్టారు

భగత్ సింగ్ తమ్ములం భరతమాత బిడ్డలం అని నినాదాలు ఇచ్చే ఆర్ఎస్ఎస్ సంఘీయులు, కర్ణాటక రాష్ట్రంలో పదవ తరగతి పిల్లలకు ఉన్న భగత్ సింగ్ పాఠాన్ని తొలగించి వేశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పాఠాన్ని దానికి బదులు చేర్చారు. భగత్ సింగ్ బలంగా నమ్మి ప్రచారం చేసిన లౌకిక ప్రజాస్వామ్య భావాల పట్ల వారిలో దాచిపెట్టుకున్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.

ఉపఖండ స్థాయిలో భగత్ సింగ్ కు ఉన్న కీర్తి ప్రతిష్టలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటిదాకా అడ్డగోలుగా వాడుకున్న సంఘీయులు, భగత్ సింగ్ పట్ల తమలో దాచిపెట్టుకున్న వ్యతిరేక భావాలను ఇప్పుడు బహిరంగంగా ప్రకటించడానికి సాహసిస్తున్నారని అర్థం.

ఇది వారి విలువల పతనాన్ని బహిరంగ పరిచే అంశంగా కూడా ఉంటుంది.
మేము ఇప్పటి దాకా భగత్ సింగ్ ను లౌకిక ప్రజాస్వామ్య విలువల ప్రతీకగా మరియు ఉపఖండ స్థాయిలో నిజమైన దేశభక్త నాయకునిగా బలంగా ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తూ వచ్చాము. లౌకిక శక్తులు ఈ విషయాన్ని మరింత శ్రద్ధగా విస్తారంగా నూతన తరాలలో పాదుకునేటట్లు చేయటం చాలా అవసరం. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తారని ఆశిస్తున్నాము.
ఈ సందర్భంగా మరొకసారి 18 సంవత్సరాల క్రితం లౌకిక ప్రజాస్వామ్య సాహితీ సాంస్కృతిక వేదిక ఆమోదించిన తీర్మానాన్ని మిత్రుల దృష్టికి తీసుకు వస్తున్నాము…
జనసాహితి ఉభయ తెలుగు రాష్ట్రాలు అమరుడు భగత్ సింగ్ ను లౌకిక ప్రజాస్వామ్య సాంస్కృతిక చిహ్నంగా ప్రకటించాలి.

భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యాగం చేసిన అనేకమంది అమరవీరులలో భగత్ సింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. 23 ఏళ్ల వయసులో కేవలం 7 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిర్దుష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తి చేసి ఆచరించిన మార్గదర్శకుడు భగత్ సింగ్.
రాజకీయాలలో మతానికి స్థానం వుండరాదనీ, మతం వ్యక్తుల అభిమతంగా మాత్రమే ఉండాలని భగత్ సింగ్ బోధించారు. సందర్భం వచ్చినపుడు స్వాతంత్రోద్యమం కోసం మత సాంప్రదాయాలను పక్కకు నెట్టటానికి నిరభ్యంతరంగా సంసిద్ధుడైన నిజమైన లౌకికజీవి సర్దార్ భగత్ సింగ్.

1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో ఉరితీయబడిన అమరుడు భగత్ సింగ్ ; హిందూ-ముస్లిం-సిక్కు తదితర అన్ని మతాల ప్రజల మధ్య సామరస్య జీవనానికీ, యావత్తు ఉపఖండ ప్రజల నడుమ శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచాడు.ఉపఖండ స్ధాయిలో అందరికీ ఆమోదయోగ్యమైన విశిష్ట వ్యక్తిత్వం భగత్ సింగ్ ది.

అమరుడు భగత్ సింగ్ ను లౌకిక, ప్రజాస్వామ్య సాంస్కృతిక ప్రతీకగా కేంద్రప్రభుత్వం గుర్తించి మార్చి 23వ తేదీని, లౌకిక, ప్రజాస్వామిక సాంస్కృతిక దినంగా ప్రకటించి తదనుగుణమైన కార్యక్రమాలు నిర్వహించాలి.త్యాగజీవి భగత్ సింగ్ రచనలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించాలి.
భగత్ సింగ్ వీలునామాను విద్యార్థులందరికీ పాఠ్యాంశంగా నిర్ణయించాలి.

లౌకిక, ప్రజాస్వామ్య సాహిత్య, సాంస్కృతిక వేదిక (ఆం.ప్ర.)
– దివికుమార్

LEAVE A RESPONSE