Suryaa.co.in

Features

సమన్వయంతో కూడిన సంస్కరణవాది భాగ్యరెడ్డి వర్మ

(రాహుల్ శాస్త్రి)

పంచములుగా పరిగణింపబడిన వర్గపు అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 1906 – 1935 మధ్య కాలంలో సామాజిక సంస్కరణకు బాటలు వేశారు. మాదరి వెంకయ్య, రంగమాంబలకు మే, 22, 1888న జన్మించిన ఆయనకు గురువు సలహా మేరకు బాగ్యరెడ్డి అని పేరు పెట్టారు.

మాల కులానికి చెందిన వారి వెనుకబాటుతనం, కష్టాలను అందరి దృష్టికి తీసుకువెళ్ళేందుకు భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్మిత్ర మండలిని స్థాపించి ఉపన్యాసాలు, హరికథ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇదే ఆ తరువాత 1911లో మాన్య సంఘం గా రూపొందింది. ఈ సంఘానికే ఆ తరువాత కాలంలో ఆది హిందూ సామాజిక సేవ సంస్థగా పేరు పెట్టారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలను నివారించడం వంటివి ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు. 1910లోనే హైదారాబాద్ లోని ఇసామియా బజార్, బొగ్గులకుంట తదితర ప్రదేశాలలో తెలుగు మధ్యమ పాఠశాలలు ప్రారంభించారు భాగ్యరెడ్డి వర్మ. కొద్ది కాలానికే మొత్తం 21 పాఠశాల్లో రెండు వేలకు పైగా విద్యార్ధులు చేరారు. 1929లో ఈ పాఠశాలలను సందర్శించిన మహాత్మా గాంధీ వీటిలో హింది భాషా బోధన కూడా ప్రారంభించాలని సూచించారు. అయితే 1931లో అనారోగ్య కారణాల వల్ల పాఠశాలల నిర్వహణను భాగ్యరెడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పగించవలసివచ్చింది. అయినా తెలుగు మధ్యమంలోనే బోధన సాగాలనే షరతుపై ఆయన ఆ పని చేశారు. 1948 సంవత్సరం వరకు నిజాం ప్రభుత్వం ఈ తెలుగు మధ్యమ పాఠశాలలను నడిపింది.

శాకాహారాన్ని ప్రోత్సహించిన భాగ్యరెడ్డి వర్మ మద్యపాన నివారణకు కూడా బాగా కృషి చేశారు. దివాన్ బహదూర్ ఎస్. ఆర్. మలని స్థాపించిన జీవ రక్షా జ్ఞాన ప్రచారక మండలిలో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. సేఠ్ లాల్జీ మేఘ్ జీ కార్యదర్శిగా ఉండేవారు. మద్యపాన నివారణకోసం యువకుల బృందాల ద్వారా భజన మందిరాలు ఏర్పాటు చేశారు. మద్యపానానికి ఖర్చు చేసే సొమ్మును తమకు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలు భిక్షాటన చేసేవారు. అలా సేకరించిన మొత్తాన్ని దాతలకు బంగారం రూపంలో తిరిగి ఇచ్చేవారు. ఈ ఉద్యమంలో మహిళలను బాగా ప్రోత్సహించేవారు. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా సాగిన మద్యపాన నివారణ ఉద్యమం మంచి ఫలితాలనే ఇచ్చింది.

ఆర్యసమాజ్ తో సన్నిహిత సంబంధం కలిగిన భాగ్యరెడ్డి వర్మ హిందువులను ఇస్లాంలోకి మతం మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1913లో ఆర్యసమాజ్ మాదరి భాగ్యరెడ్డిని `వర్మ’ అనే బిరుదుతో సత్కరించింది. అలాగే ఒక ప్రత్యేక సభలో ధర్మ వీర్ వామన్ నాయక్ ఆయనకు `శివశ్రేష్టి’ అనే బిరుదు ప్రదానం చేశారు.

నిజాంకు చెందిన హైదారాబాద్ లో కులీనులు, మేధావుల వివరాలతో రూపొందిన `పిక్టొరల్ హైదరబాద్’ అనే పుస్తకంలో భాగ్యరెడ్డి వర్మ గురించిన సమాచారం కూడా ఉంది. ఆ పుస్తకంలో ప్రస్తావించిన ఏకైక హరిజన నాయకుడు ఆయనే. ఆ పుస్తకాన్ని వ్రాసిన కృష్ణస్వామి ముదిరాజ్ ఇలా అన్నారు – “హిందువులు, హిందుత్వపు చరిత్ర వ్రాసినప్పుడు అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డి పేరు తప్పకుండా వస్తుంది.’’

భాగ్యరెడ్డి వర్మ మంచి వక్త. 1906 – 1931 మధ్య కాలంలో ఆయన 3,348 ఉపన్యాసాలు ఇచ్చారు. 1917లో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సమావేశాల్లో మొదట ఆయనకు మాట్లాడటానికి కేవలం 10 నిముషాల సమయమే ఇచ్చారు. కానీ సమావేశాలకు హాజరైన ప్రతినిధులు ఎంతగా ముగ్ధులయ్యారంటే భాగ్యరెడ్డి వర్మ ఏకంగా అరగంటపాటు ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత మాట్లాడిన మహాత్మా గాంధీ ఆయన చెప్పిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. సంస్కరణ గురించి భాగ్యరెడ్డి వర్మ వ్యక్తపరచిన అభిప్రాయాలు, సూచించిన మార్గాలు ఆచరణయోగ్యంగా ఉన్నాయని భావించిన జగద్గురు శంకరాచార్య (కుర్తకోటి) ఒక సందర్భంలో వేదికపై తనతోపాటు భాగ్యరెడ్డి వర్మకు కూడా స్థానం కల్పించారు. అదే వేదికపై రాజ ధనరాజ్ గిరి కూడా ఉన్నారు. 1925లో ఆది హిందూ భవన్ ను ప్రారంభించడానికి కూడా శంకరాచార్య సుముఖత వ్యక్తం చేసినా, కొందరు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ఆలోచనకు స్వస్తి చెప్పారు. ఆది హిందూ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ కవి, పండితుడు, సనాతన సంస్కరణవాది అయిన కావ్యకంఠ గణపతి శాస్త్రి (ముని) హాజరయ్యారు.

బెజవాడలో జరిగిన(1917) మొదటి ఆంధ్ర దేశ పంచమ సమావేశాలకు భాగ్యరెడ్డి వర్మ హాజరయ్యారు. జనాభా లెక్కల సేకరణలో మద్రాస్ ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం హరిజనులను ఆది ఆంధ్రులు, ఆది హిందువులుగా గుర్తించాయి. ఏలూరులో జరిగిన(1921) ఆది ఆంధ్ర సమావేశాల్లో భాగ్యరెడ్డి వర్మను `సంఘమాన్య’ అనే బిరుదుతో సత్కరించారు.

అనవసరమైన విధానపరమైన పద్దతులు తొలగించి సామాజిక భావనను పెంపొందించడం కోసం పంచాయతీ వ్యవస్థను మోహల్లా పంచాయత్ ల ద్వారా సంస్కరించే ప్రయత్నం చేశారు. దీనికి కొత్వాల్ రాజ బహదూర్ వెంకట్రామ రెడ్డి ఎంతో నైతిక మద్దతు అందించారు. దీని వల్ల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడమే కాక దురాచారాలను రూపుమాపడానికి సాధ్యపడింది. సత్ఫలితాలను ఇచ్చిన కొత్త వ్యవస్థ దురదృష్టవశాత్తు ఎక్కువ కాలం నిలబడలేదు.

పేద ప్రజానీకంలో ఆరోగ్య అవగాహన పెంచడం కోసం 1912లో స్వస్తి దళ్ ను నిర్వహించారు. ప్లేగ్ వంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు వాటి నివారణలో ఈ దళ్ ఎంతో అద్భుతంగా పనిచేసింది.

మంచి చిత్రకారుడు కూడా అయిన భాగ్యరెడ్డి వర్మ ఒక సారి తన చిత్రాలను రవీంద్రనాథ్ టాగూర్ కు చూపించారు. అలాగే 1925లో చేతి వృత్తుల ఉత్పత్తులు, చిత్రాలు, శిల్పాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను సందర్శించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాగున్న కళాఖండాలకు పురస్కారాలు కూడా అందజేశారు.

`భాగ్యనగర్ పత్రిక’ ద్వారా కూడా భాగ్యరెడ్డి వర్మ తన సామాజిక సంస్కరణను ప్రచారం చేశారు. అలాగే జక్కుల సత్తయ్య సహకారంతో 1918లో `ది పంచమ’ అనే ఆంగ్ల మాసపత్రికను కూడా ఆయన ప్రారంభించారు.

సామాజిక సంస్కరణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి, ప్రశంసిస్తూ హిందువులలో అన్ని వర్గాలకు చెందినవారు ఆయనకు మద్దతు తెలిపారు. ఆది హిందూ సామాజిక సేవా సంస్థ ను స్థాపించిన తరువాత అందులో అధ్యక్ష పీఠంతోపాటు మూడువంతుల సభ్యులు సవర్ణులకు కేటాయిస్తూ భాగ్యరెడ్డి వర్మ నిర్ణయం తీసుకున్నారు. దీనినిబట్టి ఆయన చేపట్టిన కార్యం అన్ని వర్గాల వారిని కలుపుకుని పోయే విధంగా ఉండేదని అర్ధమవుతుంది.
1930లో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ భాగ్యరెడ్డి వర్మ 18 ఫిబ్రవరి, 1939లో శివరాత్రి రోజున తుది శ్వాస విడిచారు.

This article was first published in 2019
– వీఎస్‌కె తెలంగాణ సౌజన్యంతో..

LEAVE A RESPONSE