ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం మనది. అనేక మతాలకు, సంస్కృతులకు నిలయం.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంపద మానవ వనరులు మన దేశంలో ఉండడం గర్వకారణం.కానీ దురదృష్టవశాత్తు దేశంలో నివసించే మానవులందరికీ మాత్రం సరైన సమాన ప్రాధాన్యత లేదు.గౌరవం లేదు . కనీసం మనిషిని మనిషిగా చూసే పద్దతి, మానవత్వం లేదు. కానీ కుల వ్యవస్థ ఉంది. తదనుగుణంగా అంటరానితనం ఉంది. దీని కారణంగా సమాజంలోని మనుషులకు మనుషులకు మధ్యన వివక్ష ఉన్నది.
అలాంటి పరిస్థితుల్లో మనిషిని మనిషిగా చూసే వ్యవస్థ కోసం , అంతరానితనం నిర్మూలన కోసం కృషిచేసిన వారిలో అగ్రగణ్యులు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారు. అయితే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ మరణానంతరం సమాజంలోని అణగారిన ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృషి చేసింది మాత్రం రాం విలాస్ పాశ్వాన్. విద్యార్థి జీవితం నుండి తన చివరి శ్వాస వరకు కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అణగారిన ప్రజల కోసం రాం విలాస్ పాశ్వాన్ పోరాడినాడనడంలో సందేహం లేదు.
అట్టడుగు వర్గాలకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు దేశంలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన దివంగత రాం విలాస్ పాశ్వాన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా విశేష కృషి చేశారు. చివరిగా ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం ఆయన మద్దతు పలికారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ అందుకు తగిన కృతజ్ఞతలు వారికి తెలియచేయడంలో నాయకులు, తెలంగాణ పేరుతో సంస్థలను పెట్టి అధికారంలోకి వచ్చి పాలన చేస్తున్న పార్టీల అధినేతలు ఎక్కడ ఉన్నారో సమాజంలోని మేధావులు, సామాన్య ప్రజలు గమనించాలి. ఇది నిజం.
వెనుకబడిన వర్గాల కోసం, వెనుకబడిన ప్రాంతాల కోసం విద్యార్థి దశ నుంచే మద్దతివ్వడం, వారి అభివృద్ధికి కృషి చేయడం రాం విలాస్ పాశ్వాన్ గారికి వెన్నతో పెట్టిన విద్య. దళితుల ఆశాజ్యోతిగా పేరు పొందిన రామ్ విలాస్ పాశ్వాన్ యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం సిద్దించి అట్టడుగు వర్గాల దళితులకు సముచిత న్యాయం జరుగుతుందని గ్రహించి, తెలంగాణ ఉద్యమానికి మొదటినుంచి మద్దతు ఇచ్చారు.
2003లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన తన లోక్ జనశక్తి పార్టీ ర్యాలీ ద్వారా జాతీయస్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేశారు. అట్టి ర్యాలీ, బహిరంగసభకు తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యమకారులు కార్ల ర్యాలీ తో తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో పాల్గొనడం నుండి మొదలు ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడ గట్టడంతో పాటు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీఆర్ఎస్ల ఎన్నికల పొత్తును కుదిరించడంలో (టీఆర్ఎస్ కు 42 స్థానాలు) పాశ్వాన్ చొరవ కీలకం. అందుకు కొన్ని సీట్లు లోక్ జనశక్తికి ఇచ్చి గెలిపించుకుంటామని టీఆర్ఎస్ అధినేతలు సాక్షాత్తూ మీడియా ముందే చెప్పిన విషయం బహిరంగ రహస్యం.
కానీ లోక్ జనశక్తి నాయకులకు సీట్ల సర్దుబాటు విషయంలో టీఆర్ఎస్ నాయకులు పట్టనట్టు వ్యవహరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ ఉద్యమ అధి నేతల కృతజ్ఞత లోపంపట్ల రాం విలాస్ పాశ్వాన్ కొంతకాలం అసహనంతో ఉన్నారనే సంగతి బహిరంగ రహస్యమే. అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అలాంటి గొప్ప నేతకు కనీసం నివాళ్లు కూడా అర్పించని పార్టీల నేతల తీరు తెన్నులు బాధాకరం.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఏ ప్రభుత్వంతో కలిసి పనిచేసినా అంతిమంగా అట్టడుగు వర్గాల జాతి ప్రయోజనాలకే పాశ్వాన్ తొలి ప్రాధాన్యతనిచ్చారు. అట్టడుగు స్థాయి నుండి నాయకులను బలోపేతం చేయడం ద్వారానే పార్టీ శక్తివంతంగా వుంటుందని, పార్టీ శక్తివంతంగా వుంటేనే నిమ్నవర్గాలకు అభివృద్ధి తో పాటు అధికారం దక్కుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే ” సబ్ కా సాత్ – సబ్ కా వికాస్” అని అంటుండేవారు. ఈ నినాదాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా చెపుతున్నారు.
5 జూలై 1946న బీహార్‌లోని షహర్బన్ని జిల్లా ఖగారియాలో సియాదేవి జమున్ పాశ్వాన్లకు జన్మించిన రాం విలాస్ పాశ్వాన్ పాట్నా యూనివర్శిటీ నుండి ఎం ఏ, ఎల్ ఎల్ బి, డి.లిట్ పూర్తి చేసారు. డీఎస్పీ ఉద్యోగాన్ని వదులుకున్న పాశ్వాన్ ఉరకలేసే ఉత్సాహంతో యువకుడిగా ఉన్నప్పుడే సంయుక్త సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి 1969లో అలౌలి(ఖంగారియా) అసెంబ్లీ నియోజక వర్గం నుండి 23 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పాశ్వాన్.
ఆ తరువాత ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా, ఎనిమిది సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆరుగురు ప్రధానుల హయాంలో ఎనిమిది సార్లు కేంద్ర మంత్రి. లోక్‌సభలో సభా నాయకునిగా పనిచేశారు. 1974లో కొత్తగా ఏర్పడిన లోక్‌దళ్ పార్టీలో ప్రవేశించి ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి1975 లో అరెస్ట్ య్యారు.
1977లో విడుదలైన తర్వాత జనతాపార్టీ నుండి మొదటిసారిగా హాజీపూర్ నియోజకవర్గం ఎంపీగా 1977లో రామ్ విలాస్ పాశ్వాన్ 89.3% ఓట్ల తేడాతో గెలిచాడు. భారతదేశ సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇక 2009 లో జరిగిన ఎన్నికల్లో మినహా ఇస్తే వరుసగా 1980, 1989 1996 మరియు 1998-99, 2004, 2014లలో ఎంపీగా ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2019లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర ఆహార, వినియోగదారుల, ప్రజా పంపిణీ మంత్రిగా పనిచేశారు. వి.పి.సింగ్ నుండి మొదలుకుని నరేంద్రమోడీ వరకు ఆరుగురు ప్రధానమంత్రుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఘనత రాం విలాస్ పాశ్వాన్దే. అనారోగ్యంతో చికిత్స పొందుతూ 8-10-2020న చివరి శ్వాస విడిచారు.
(మంత్రి ఉన్నప్పుడే ). పాశ్వాన్ గారి మరణం పట్ల దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తమకొక పెద్ద దిక్కును కోల్పోయినట్టు ప్రకటించారు. వారి విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో (25.01.2021న) గౌరవించింది.
జనతా పార్టీలో కొనసాగుతూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కుల కోసం దళితసేనను ఏర్పచి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తరింపచేసి దళితుల్లో ఆత్మ విశ్వాసం నింపడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దళిత ముస్లిం మహా సభను విజయవంతంగా నిర్వహించారు.
2000లో స్వంతంగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని స్థాపించారు. వీపీ సింగ్ మంత్రివర్గంలో సంక్షేమ, కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ,ఎస్టీలపై జరిగిన ఘటనలపై స్పందించి ఆయా ప్రాంతాలను సందర్శించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు చేపట్టిన ధర్నాలో పాల్గొని వారిలో ఉత్తేజాన్ని నింపారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చే దళిత నాయకులకు ధైర్యం కల్పించి మద్దతుగా నిలిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు ఘటనలతో చలించిన రామ్ విలాస్ పాశ్వాన్ అప్పటికే రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కుల రక్షణ చట్టం ఒక్కటే ఎస్సీ, ఎస్టీ లకు సరిపోదని, పౌర హక్కుల రక్షణ చట్టం సరిగ్గా ఉపయోగపడడం లేదని గ్రహించి అటువంటి ఘటనలకు అడ్డుకట్టవేసేందుకు ఇక దేశంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక చట్టం తేవాలనే ఉద్దేశ్యంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ను తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తరపున కోర్టులో రివ్యూ పిటిషన్ ను వేయించడంమే కాకుండా దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎంపీల బృందంతో ప్రధానిని కలిసి ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలయ్యేలా 2018లో పార్లమెంట్ ద్వారా సవరింప చేశారు.
ఇక దేశంలో వెనుకబడిన కులాల అభివృద్ధి సంక్షేమం కోసం బీపీ మండల్ కమీషన్ అమలు కోసం విశేష కృషిచేసి బీసీలకు అండగా నిలిచారు. కె ఆర్ నారాయణ, అబ్దుల్ కలాం వంటి వారు రాష్రపతి కావడంలో పాశ్వాన్ పాత్ర ఎనలేనిది.
భారత పార్లమెంట్లో బాబా సాహెబ్ బీ.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయించడంలో డాక్టర్ అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డును దక్కించడంలో కీలకపాత్రను పోషించారు. వికలాంగులకు రిజర్వేషన్లు, మండల్ కమీషన్ విషయంలో ప్రధాన పాత్ర వహించారు. కార్మిక మంత్రిగా కార్మికులు అందరికీ సమానపని సమానవేతనం అమలు జరిగేలా ప్రత్యేక చట్టాలు తెచ్చారు.
రైల్వే శాఖా మంత్రిగా పనిచేసినపుడు సుమారు 50వేల మంది హమాలీల సర్వీసులను రెగ్యులర్ చేశారు. టెలికామ్ శాఖా మంత్రిగా ఉన్నపుడు అన్ని జిల్లాలలో టెలికాం అడ్వైజరీ కమీటీ సభ్యులుగా అనేక మంది నాలంటి బలహీన వర్గాల నాయకులకు అవకాశం ఇచ్చారు. అప్పుడే నాకు రాష్ట్ర స్థాయి టెలికం సలహా కమిటీ సభ్యుడిగా అవకాశం రావడం జరిగింది.
ఆ కమిటీలో 4 సార్లు ఎంపీగా పనిచేసిన వారితో పాటు అనేక మంది హేమా హేమీలున్నారు. అందులో అతి చిన్న వయస్సు నాదే. టెలికం శాఖలో మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి తేవడం, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ట్రేడ్ యూనియన్ గుర్తింపునిచ్చారు. నాలుగవ తరగతి ఉద్యోగులకు టెలిఫోన్ సౌకర్యం కల్పించి,వారి సేవలను పూర్తిగా వినియోగించుకోనేలా చేశారు. అదే విధంగా ఇతర శాఖల్లోమంత్రిగా పనిచేసినప్పుడు ఇటువంటి అవకాశాలను అన్ని వర్గాలకు ఇచ్చారు.
బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్నపుడు గ్యాంగ్ మెన్లకు సైతం 5లక్షలు మెడికల్ ఫెసిలిటీ ఇప్పించారు. 2004 లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కేంద్రమంత్రిగా ఎరువులు రసాయనాలు, ఉక్కుశాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రైతు సంక్షేమం, వ్యవసాయం,నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆనాటి కేంద్ర ఎరువుల సలహా మండలి సభ్యుడిగా నేను ( ఇనుగాల భీమారావు ) చేసిన విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం పనులు మొదలైయ్యాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారికి ఆరోగ్య పథకం అందించడంలో ఉన్న పరిమితిని పెంచారు. ఉపాథి దొరకక వలస వెళుతున్న కార్మికులకు రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు ‘వన్ నేషన్ – వన్ రేషన్ ‘ను ప్రవేశపెట్టి అమలు శ్రీకారం చుట్టారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వల్ల దేశంలో పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం ద్వారా ఉచిత రేషన్ అందించారు.
పేద అణగారిన వర్గాల నాయకుడిగా, మాయావతి రాకముందే మరియు ఆమె గురువు కాన్షీరామ్ ప్రవేశానికి ముందు కూడా పాశ్వాన్ భారతదేశ రాజకీయ రంగంలో ఒక స్టార్. తనను తాను ‘దళిత నాయకుడిగా’ గుర్తించడానికి అంగీకరించినా భారతదేశ అణగారిన ప్రజల నాయకుడుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.రాం విలాస్ పాశ్వాన్ అధికార రాజకీయాలను మరియు సామాజిక న్యాయ సాధనను సమన్వయం చేయడానికి ప్రయత్నించారు.
భారతదేశానికి రాం విలాస్ పాశ్వాన్ ఒక మణిహారం. భారత రత్నం. కేంద్ర ప్రభుత్వ భారత రత్న అవార్డుకు అక్షరాలా అర్హుడు పాశ్వాన్. అట్టి భారత రత్న అవార్డుతో గౌరవించాల్సిన అవసరం ఉన్నది.
రాం విలాస్ పాశ్వాన్ గారి మరణం తర్వాత లోక్ జనశక్తి పార్టీ లోని 6 గురు లోక్ సభ సభ్యుల్లో మెజారిటీగా 5 గురు సభ్యులున్న గ్రూప్ కు ప్రాధాన్యతగా కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. అట్టి గ్రూప్ కు రాంవిలాస్ పాశ్వాన్ గారి సోదరుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పారస్ గారు నేతృత్వం వహిస్తున్నారు. వారు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, దళిత సేన జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
దేశంలో భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారి తర్వాత అన్నివర్గాలకు సేవలందించడంలో తన జీవిత పర్యంతం వరకు రాం విలాస్ పాశ్వాన్ గారు విశేష కృషిచేశారనడంలో అతిశయోక్తి లేదు. పద్మభూషణ్ దివంగత రాం విలాస్ పాశ్వాన్ గారు దేశానికి , సమాజానికి చేసిన సేవలను భావి భారత పౌరులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. సమ సమాజ నిర్మాణం కోరుకునే నాయకులదే.
దేశంలో దళితులు/బహుజనులు అనేక గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో నేటి యువత అందరితో ఉంటూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఏకం చేసి వారికి అండగా ఉండాలనే రామ్ విలాస్ పాశ్వాన్ గారి ఆశయాల సాధన కోసం ఎన్ని అవాంతరాలనైనా ఎదుర్కొని, ఉన్న అంతరాలను తొలగించుకొని ముందుకు సాగితేనే… రాం విలాస్ పాశ్వాన్ గారికి నిజమైన నివాళి. సమ సమాజ నిర్మాణానికి రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు, దేశానికి ఒక దిక్సూచి పద్మభూషణ్ రాం విలాస్ పాశ్వాన్ గారు.
( జులై 5 పద్మభూషణ్ రాం విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా)