Suryaa.co.in

Editorial

కదిలింది.. ‘కమల’రథం!

– పొత్తులపై నేతల అభిప్రాయసేకరణ
– లిఖితపూర్వకంగా రాసిచ్చిన నేతలు
– తొలుత పొత్తులు లేవని సంకేతాలిచ్చిన వైనం
– టీడీపీతో పొత్తుకు సంతోష్‌జీ విముఖత?
– ఇప్పుడు పొత్తుపై అభిప్రాయసేకరణ
– మారుతున్న బీజేపీ మనోగతం
– పొత్తు ఉంటేనే కొందరి పోటీ
– లేకన్నా మరికొందరు సిద్ధం
– సోము, విష్ణును బరిలో దించాలంటూ పెరుగుతున్న డిమాండ్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో బీజేపీ రాజకీయ వ్యూహం మారుతోందా? ఒంటరి పోరు ఆలోచన నుంచి.. పొత్తుపై యోచనకు మారుతున్న, బీజేపీ అభిమతం ఏమిటన్నది ఈ నెలాఖరి వరకూ స్పష్టమవుతుందా? తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ భేటీ సంకేతాలు, అందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి.

అనుభవమయితేగానీ తత్వం బోధపడదన్న సామెత, ఏపీలో బీజేపీకి అక్షరాలా వర్తిస్తుంది. నిండా మునిగిన తర్వాతగానీ కళ్లు తెరవని కమలం, చివరి దశలో మేల్కొని దిద్దుబాటకు దిగడం ఆసక్తికరంగా మారింది. అసలు ఏపీలో ఎవరితోనూ పొత్తులు వద్దని, ఐదారు సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవలసిన పనిలేదన్నది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్‌ సంతోష్‌జీ మనోగతం. ఆయన తన వద్దకు వచ్చిన సీనియర్ల వద్దే అదే వైఖరి స్పష్టం చేశారట. మన లక్ష్యం ఏపీలో అధికారం చేపట్టడమేనని, అందుకు కావలసిన రోడ్‌మ్యాప్‌ తయారుచేయాలని సూచిస్తూ వస్తున్నారు.

తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో మాత్రం అందుకు భిన్నమైన వైఖరి ప్రదర్శించడం నేతలను ఆశ్చర్యపరిచింది. సమావేశానికి హాజరైన పార్టీ జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్‌జీ స్వయంగా పొత్తు ప్రస్తావన తీసుకురావడం నేతలను ఆశ్చర్యపరిచింది. తొలుత అసలు ఎన్నికల్లో పొత్తు ఉండదన్న భావనతో, నాయకులు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత పొత్తు ఉంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఎలా ఉంటుంది? అని ఆయనే ప్రశ్నించారట. దానితో పొత్తుల విషయంలో పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చిందని నేతలకు అర్ధమయిపోయింది.

మళ్లీ ఆయనే పొత్తులపై ఎక్కడా చర్చించవద్దని.. టీడీపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న అంశంపై మీ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని అందరికీ తెల్లకాగితాలు ఇచ్చారట. దానితో నేతలు పొత్తుపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా రాసి సీల్డ్‌కవర్‌పెట్టి శివప్రకాష్‌జీకి ఇచ్చినట్లు సమాచారం.

దీన్నిబట్టి ఏపీలో పొత్తు అంశంపై బీజేపీ నాయకత్వంలో కదలిక వచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు పొత్తే వద్దన్న పరిస్థితి నుంచి.. పొత్తు ఉంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణ వరకూ వ్యవహారం వచ్చిందంటే.. మరికొద్దిరోజుల్లో దానికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభ ం అవుతుందని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. ‘పొత్తులపై సానుకూల నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని’ ఓ సీనియర్‌ నేత వెల్లడించారు.

నిజానికి పార్టీ ఏపీలో మళ్లీ బలపడాలంటే.. టీడీపీతో పొత్తు అనివార్యమని పలువురు సీనియర్లు చాలాకాలం నుంచి, బీఎల్‌ సంతోష్‌జీ నుంచి నద్దా వరకూ సూచిస్తూ వస్తున్నారు. అయితే నాయకత్వం వారి సూచనలు వినడమే తప్ప, దానిపై సూటిగా స్పందించిన దాఖలాలు లేవు. తెలంగాణ ఎన్నికల తర్వాత, ఒక నిర్ణయం తీసుకుందామని మాత్రమే చెప్పి పంపిస్తున్నారు.

ఎన్నికల రాజకీయాల్లో పార్టీ బతకాలంటే.. టీడీపీతో పొత్తు ఉండాలన్నది వీరి వాదన. టీడీపీతో కలసి పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయని, దాని ఆధారంగా రాష్ట్రంలో పార్టీని సొంతంగా నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంటేనే, కొత్తవారి చేరికలు ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇలాంటి వారికి టీడీపీ సత్సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.

అయితే టీడీపీతో పొత్తు లేకుండానే పార్టీ బలపడాలని, టీడీపీతో పొత్తు ఉంటే ఏపీలో బీజేపీ ఎప్పటికీ ఎదిగే అవకాశాలు ఉండవన్నది మరికొందరి వాదన. పొత్తు లేకపోతే అందరికీ పోటీ చేసే అవకాశాలు వస్తాయని, సొంతగా పోటీ చేస్తే పార్టీ బలపడి, తర్వాత ఎన్నికల్లోనయినా అధికారంలోకి వస్తామన్నది వీరి భావన. వీరిలో పలువురికి వైసీపీతో సత్సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.

టీడీపీతో పొత్తు ఉంటే బరిలోకి దిగేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే మాత్రం.. పార్టీవాదులు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. పొత్తుతో సంబంధం లేకుండా.. హిందూపురం నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, విశాఖ నుంచి ఎంపి జీవీఎల్‌ నరసింహారావు-కాశీవిశ్వనాధరాజు, అసెంబ్లీ నుంచి సోము వీర్రాజు, మాధవ్‌, విష్ణువర్దన్‌రెడ్డి, విష్ణుకుమార్‌రాజు, జయప్రకాష్‌, రాంకుమార్‌, నాగోతు రమేష్‌నాయుడు, భానుప్రకాష్‌రెడ్డి, చల్లపల్లి నర్శింహారెడ్డి, తపనచౌదరి, కోలాఆనంద్‌, పాతూరి నాగభూషణం తదితరులు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒంగోలు లేదా నర్సరావుపేట ఎంపి స్థానానికి పోటీ చేయవచ్చంటున్నారు.

గతంలో వివిధ సాకులు చెప్పి తప్పించుకున్న వారంతా, ఇప్పుడు పొత్తులు లేకపోయినా, పోటీకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనంలో విపరీతమైన బలం- యూత్‌లో ఇమేజ్‌- పార్టీలో క్రేజ్‌ ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి రూరల్‌ నుంచి, కదిరి నుంచి విష్ణువర్దన్‌రెడ్డిని ఈసారి తప్పనిసరిగా నిలబెట్టాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. బీజేపీ నుంచి ఈసారి అసెంబ్లీకి సోము, విష్ణువర్దన్‌రెడ్డి అడుగుపెట్టడం ఖాయమని పార్టీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారిద్దరి గెలుపు కోసం రాష్ట్రంలోని కార్యకర్తలు కూడా, అక్కడికి వెళ్లి పని చేస్తారని చెబుతున్నారు.

ఇక జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ గత కొద్దికాలం నుంచి అనంతపురం జిల్లాపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో సంబంధం లేకుండా, సొంతగానే గెలిచే వ్యూహంతో ఆయన ఇప్పటినుంచే, హిందూపురంపై దృష్టి సారిస్తున్నారు. ఏబీవీపీతో సహా వివిధ క్షేత్రాలకు సంబంధించిన కార్యకర్తలతో, సత్సంబంధాలున్న సత్యకుమార్‌.. హిందూపురంలో ప్రత్యేక వ్యూహంతో, ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం.. పార్టీలతో సంబంధం లేకుండా మద్దతునిస్తామని, ఈపాటికే హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదరహితుడు, పనిమంతుడిగా పేరున్న సత్యకుమార్‌ ముందస్తుగా చేస్తున్న ఎన్నికల ప్రచారాన్ని, హిందూపురం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాగా విశాఖలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు.. దాదాపు ఏడాదికిపైగా పోటీకి సన్నద్ధమయి, ఆ మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ-కార్మిక-విద్యార్ధి-కుల సంఘాలతో, వారానికోసారి భేటీలు నిర్వహిస్తున్నారు. జీవిఎల్‌ తర్వాత ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నది, సత్యకుమార్‌ మాత్రమే కనిపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాన్నీ ఎంపిక చే సుకోకపోవటం ఆశ్చర్యం.

LEAVE A RESPONSE