మత విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు బిజేపి కుట్ర

Spread the love

– హోం మంత్రి మేకతోటి సుచరిత

కర్నూలు జిల్లా ఆత్మకూరు లో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బిజెపి కేంద్రమంత్రి సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు.

బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కి ఆత్మకూరు లోని మసీదు నిర్మాణంకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు ఆపించే ప్రయత్నం చేయాల్సి ఉండేదన్నారు. అంతేకానీ మంది మార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోదయోగ్యమైనది కాదన్నారు.

మసీదు వద్ద ఘర్షణ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వెళ్లి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ వాళ్లు వెళ్లకుండా అక్కడక్కడే తిరగడం వలన గొడవ మరింత పెద్దదయిందన్నారు.పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్ రెడ్డి వాహనంపై దాడి చేయడంతో.. పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్ తో పాటు మిగిలిన వారిని స్టేషన్ కు తరలించారు. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి తో పాటు తన అనుచరులకు పోలీసులు రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడటం జరిగిందని హోంమంత్రి తెలిపారు.

ఆత్మకూరు సంఘటనకు ప్రధాన కారకుడైన శ్రీకాంత్ రెడ్డి తో పాటు మరో ఐదు మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదుచేసి జైలు పంపించినట్లు హోం మినిస్టర్ సుచరిత పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి పై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు హోంమంత్రి తెలిపారు. వీరందరిని కూడా కర్నూలు, కడప, అనంతపురం జైళ్లకు పోలీసులు తరలించారన్నారు.

భారతీయ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఆత్మకూరు ఘటనను రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమైన చర్య అని హోంమంత్రి మండిపడ్డారు.

రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నిందుతుడిని కూడా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నామని హోం మినిస్టర్ సుచరిత స్పష్టంచేశారు. మన రాష్ట్రంలో పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పనిచేసే స్వేచ్ఛను గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారన్నారు. ఆత్మకూరు ఘటనలో పోలీసులు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నేరస్తులను శిక్షించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పైనా, సీఎం జగన్ మోహన్ రెడ్డి పైనా బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ మత రాజకీయాలను గమనిస్తూనే వున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడటం మానుకోవాలని బీజేపీ నాయకులకు హోంమంత్రి సుచరిత సూచించారు.

Leave a Reply