Home » మీరు పోటీ చేయండి…లేదు మీరే పోటీ చేయండి!

మీరు పోటీ చేయండి…లేదు మీరే పోటీ చేయండి!

– బద్వేలులో పోటీపై బీజేపీ-జనసేన విచిత్ర వాదనలు
– తప్పించుకునే ఎత్తుగడలో బీజేపీ-జనసేన
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా మిత్రపక్షాలు ఎన్నికల సమయంలో సీట్ల సంఖ్య విషయంలో వాదులుకుంటాయి. తమకు ఇన్ని సీట్లు కావాలని, ఫలానా సీట్లలో అయితే తాము పోటీ చేస్తామని తన మిత్రపక్షంతో వాదిస్తుంటాయి. కానీ..విచిత్రంగా ఏపీలో మిత్రపక్షాలయిన బీజేపీ-జనసేన మాత్రం.. ఉప ఎన్నికలో మీరు పొటీ చేయమంటే, లేదు మీరే పోటీ చేయమని వాదించుకున్న వైచిత్రి ఇరు పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది.
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై బీజేపీ-జనసేన అగ్రనేతల మధ్య చర్చలు జరిగాయి. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సంఘటనా మంత్రి మధుక ర్; జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొన్నారు. మంగ ళగిరికి వచ్చిన పవన్‌తో, బీజేపీ నేతలు బద్వేలు ఉప ఎన్నికపై చర్చించారు. ఆ సందర్భంగా సోము వీర్రాజు .. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసినందున, ఈసారి బద్వేలు ఉప ఎన్నికలో మీరే పోటీ చేయమని జనసేనను కోరినట్లు సమాచారం.
అయితే… జనసేన నేతలు ఈ విషయంలో తెలివిగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎలాగూ తిరుపతి ఉప ఎన్నికలో మీరే పోటీ చేశారు కాబట్టి, బద్వేలులో కూడా మీరే పోటీ చేయండి. మేము మద్దతునిస్తామని’ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. పైగా ఇటీవలి జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీకి కడప జిల్లా నుంచే ఎక్కువ స్థానాలు వచ్చినందున, మీరు పోటీ చేస్తేనే బాగుంటుందని సూచించారు. బీజేపీ బరిలోకి దిగితేనే గట్టి పోటీ ఉంటుందని, జాతీయ నాయకులు కూడా ప్రచారానికి వస్తారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా పక్షపాతం లేకుండా భయంతో పనిచేస్తుందని విశ్లేషించారు. దానితో ఖంగుతిన్న బీజేపీ నేతలు.. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానానికి తెలియచేస్తామని, ఎవరు పోటీ చేసినా ఒకరికొకరు మద్దతు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు.
బద్వేలులో పోటీపై ఇరు పార్టీల ఎత్తుగడ పరిశీలిస్తే, బీజేపీ-జనసేన నేతలు పోటీ చేయకుండా తప్పించుకునే వైఖరి కనిపిస్తోంది. ఎలాగూ ఓటమి తప్పదన్న అంచనాతో ఇరుపార్టీలూ, సాధ్యమైనంత వరకూ పోటీకి దూరంగా ఉండాలనే కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బద్వేలు మాజీ ఎమ్మెల్యే జయరాములు టీడీపీ నుంచి బీజేపీలో చేరినందున, బీజేపీకి అభ్యర్ధి సమస్య ఉండదు. కానీ ఆయన పార్టీలో చేరిన తర్వాత పెద్దగా క్రియాశీలకంగా పనిచేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ ఎలాగూ వైసీపీ-టీడీపీ మధ్యనే ఉన్నా.. విజయావకాశాలు వైసీపీకే ఎక్కువ ఉంటాయి కాబట్టి, పోటీ చేసి ఓడిపోయామన్న అనవసర అప్రతిష్ఠ ఎందుకన్న ఆలోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కనిపిస్తోంది.
పైగా సోము వీర్రాజు అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో, పార్టీ ఘోర ఓటమి పాలయింది. చివరకు ఆయన తన సొంత తూర్పు గోదావరి జిల్లా సహా, ఎక్కడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా నిలబెట్టలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. దానితో జనసేన-టీడీపీ అవగాహనతో కలసి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ పోటీ చేసి ఓడిపోయి.. మరో అప్రతిష్ఠను మూటకట్టుకునే బదులు, జనసేనకు సీటివ్వడం ద్వారా ఓటమి నుంచి తప్పించుకోవడం మంచిదన్న వ్యూహం బీజేపీలో కనిపిస్తోంది. ప్రధానంగా.. ఉప ఎన్నికకు జాతీయ నాయకత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేకపోవడం కూడా బీజేపీ వెనుకంజకు మరో కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తిరుపతిలో మాదిరిగా ఈసారి కూడా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నెత్తిన ఆర్ధిక భారం వేసినా, గతానుభవంతో ఆయన ఎంతవరకూ అందుకు సిద్ధపడతారన్నదీ సందేహమంటున్నారు.
అయితే.. జనసేన నాయకత్వం ముందు.. బీజేపీ నాయకత్వం ఎత్తుగడ పారినట్లు కనిపించడం లేదు. గట్టి పోటీ ఇచ్చే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనే, తమకు సీటివ్వని బీజేపీ నాయకత్వం.. ఓడిపోయే బద్వేలు సీటు అంటకట్టి, ‘జనసేనకు సీటు ఇచ్చినా ఓడిందన్న’ ప్రచారం చేసుకుంటుందని, ముందుగానే అంచనా వేసింది. పైగా ఇప్పటికిప్పుడు బద్వేలులో జనసేనకు అభ్యర్ధి దొరకడం కష్టం. బద్వేలుపై బీజేపీ నాయకత్వం కొద్ది నెలల ముందే తమకు స్పష్టత ఇచ్చి ఉంటే, అప్పుడు కచ్చితంగా తమ పార్టీనే రంగంలోకి దిగేదని జనసేన సీనియర్లు చెబుతున్నారు. అందుకే పోటీ విషయంలో జనసేన ఎత్తు పై ఎత్తు వేసినట్లు కనిపిస్తోంది.

కోర్ కమిటీలో చర్చించరా?

కాగా.. బద్వేలు ఉప ఎన్నిక పోటీపై కోర్ కమిటీ ఏర్పాటుచేయకుండానే, జనసేనతో చర్చలు జరపడంపై బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బద్వేలులో పోటీ చేయాలా? వద్దా? అక్కడ పార్టీ బలాబలాలేమిటి? పోటీ బీజేపీకి అనుకూలంగా ఉంటుందా? జనసేకి అనుకూలంగా ఉంటుందా? సామాజిక సమీకరణలేమిటి? అన్న కీలక అంశాలపై చర్చించేందుకు, కోర్ కమిటీ ఏర్పాటుచేయాల్సి ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే కోర్ కమిటీ ఏర్పాటుచేయకుండా, సోము వీర్రాజు, మధుకర్ ఇద్దరే జనసేన నేతల వద్దకు వెళ్లడంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన సంఘటనా కార్యదర్శి, ఒక వర్గానికి నాయకుడిగా వ్యవహరిస్తుండటం తొలిసారి, ఇప్పుడే చూస్తున్నామని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Leave a Reply