Home » బీజేపీ మేనిఫెస్టో విడుదల

బీజేపీ మేనిఫెస్టో విడుదల

‘సంకల్ప పత్రం’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024 ను ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి ‘గ్యాన్’ లక్ష్యంగా (GYAN – గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోని రూపొందించారు. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

వికసిత్ భారత్‌ కు నాలుగు స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై మేనిఫెస్టో దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో జీవితాలకు గౌరవమని, జీవన నాణ్యత అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో అవకాశాల పరిమాణం, నాణ్యతపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

అన్నీ గ్యారంటీలను నెరవేర్చే హామీ ‘మోదీ కీ గ్యారెంటీ’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘మోదీ కీ గ్యారంటీ’ బీజేపీ ఎన్నికల నినాదం అని ఆయన అన్నారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి, దేశానికి ఎలా సేవ చేయాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోని విడుదల చేయడం గమనార్హం.

గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ పార్టీ అగ్రనేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ తమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుతుందన్నారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో దేశప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు తాను సంతోషిస్తున్నానని, చాలా సంతృప్తికరంగా ఉన్నానన్నారు. 2014 సంకల్ప పత్రమైనా, 2019లో ఇచ్చిన హామీలైనా ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చామని చెప్పారు. ‘మోదీ కీ గ్యారంటీ’ 24 క్యారెట్ల అంత నాణ్యమైనదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Leave a Reply