Suryaa.co.in

Andhra Pradesh

సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా వైకాపాను ఎన్డీఏ కూటమికి దరిచేరనివ్వని బిజెపి

-జగన్మోహన్ రెడ్డికి కావలసింది ఢిల్లీలో కేసుల నుంచి విముక్తి మాత్రమే
-గో రక్షక్ పార్టీ బిజెపి అయితే, గో భక్షక్ పార్టీ వైకాపా
-సుయోధనుడికి జరిగిన పరాభవం కంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన పరాభవమే ఎక్కువ
-ముఖ్యమంత్రిగా ఇదే ఆయనకు ఆఖరి ఢిల్లీ పర్యటన
-తెదేపా, జనసేన, బిజెపి కూటమి ప్రచారకర్తగా రోజా
-జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఇద్దరు ఇబ్బందులతో రోడ్డున పడ్డారు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా వైకాపాను ఎన్డీఏ కూటమికి బిజెపి నాయకత్వం దరిచేరనివ్వలేదని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో గత మూడేళ్లుగా కలిసేందుకు వైకాపా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందన్నారు. ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే, మరొకవైపు తమను ఎన్డీఏ కూటమిలో చేరామని బిజెపి నాయకత్వం కోరుతున్నట్లుగా వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి చెప్పేవారన్నారు. ఎన్డీఏలో చేరుతామని వైకాపా నాయకత్వమే, బిజెపి నాయకత్వాన్ని కోరిందని… కానీ దానికి బీజేపీ నాయకత్వం అంగీకరించలేదని తెలిపారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డికి కావలసింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి , ఢిల్లీలో కేసుల నుంచి విముక్తి మాత్రమేనన్నారు. గో రక్షక్ పార్టీ బిజెపి అయితే, గో భక్షక్ పార్టీ వైకాపా అని, ఈ రెండు పార్టీల మధ్య సక్రమ సంబంధానికి తావే లేదన్నారు. అయినా, రాష్ట్ర ప్రజలు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించినా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వమని… నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఆయనని గౌరవించారని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామకృష్ణంరాజు చెప్పారు.

మయసభలో సుయోధనుడికి జరిగిన పరాభవం కంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన పరాభవమే ఎక్కువ
మయసభలో సుయోధనుడికి జరిగిన పరాభవం కంటే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన పరాభవమే ఎక్కువని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. గంట ఐదు నిమిషాల పాటు యాంటీ రూమ్ లో వేచి చూసిన అనంతరం ప్రధానమంత్రి తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ధర్మ దర్శనం మాదిరిగా ముఖ్యమంత్రులు అడిగిన వెంటనే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం పరిపాటి. అందులో భాగంగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి తో భేటీ అయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి తో 15 నుంచి 16 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తో ముఖ్యమంత్రి సమావేశమైన సమయాన్ని సాక్షి దినపత్రిక కూడా పేర్కొనకుండా బ్లాంక్ గా వదిలివేసింది. ఈ విషయంలో సాక్షి దినపత్రిక యాజమాన్యం కాస్త మొహమాట పడినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో జగన్మోహన్ రెడ్డి భేటికి అపాయింట్మెంట్ లభించదని మూడు రోజుల క్రితమే రచ్చబండ కార్యక్రమంలో నేను చెప్పాను. అయినా, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరిగా పదే, పదే కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నించారు.

అయినా, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ దక్కకపోవడంతో, శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలో ఉంటే పరువు పోతుందని భావించి మూట ముల్లె సర్దుకొని, ఎయిర్పోర్టులోనే నాలుగు మెతుకులు తినేసి బయల్దేరారు. కేవలం అమిత్ షా అపాయింట్మెంట్ కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా, ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఒకవైపు అమిత్ షా తో భేటీకి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించకపోగా, మరొకవైపు అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశమై, రాజకీయాల గురించి చర్చించారు. తాను కోరుకున్న అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. బహుశా ముఖ్యమంత్రిగా ఇదే ఆయనకు ఆఖరి ఢిల్లీ పర్యటన అయ్యే అవకాశం ఉంది. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి ఆయన వస్తారని నేను భావించడం లేదు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాలు తమకే దక్కుతాయని, అన్యాయంగా ఎవరు పోటీ చేయకుండా చూడాలని కోరినట్లు తెలిసిందన్నారు.

కూటమి ప్రచారకర్తగా రోజా సెల్వమణి
తెదేపా, జనసేన, బిజెపి కూటమి ప్రచారకర్తగా సినీ హీరోయిన్, రాష్ట్ర మంత్రి రోజా సెల్వమణి ఉపయోగపడుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రోజా సెల్వమణి, కూటమి ప్రచార కర్తగా ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం అందరికీ రావడం సహజమని ఈ సందర్భంగా గతంలో ఆమె ప్రసంగించిన 30 సెకండ్ల వీడియోను ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.

దశలవారీగా మధ్య నిషేధం చేపడుతూ, ఎన్నికల నాటికి పూర్తిగా మద్యాన్ని నిర్మూలించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగరని పేర్కొన్న రోజా, తన చెల్లి షర్మిళ పట్ల ఎటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తారో జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని మహిళల పట్ల ప్రదర్శిస్తారన్నారు. అంటే రాష్ట్రంలోని మహిళలు వారి తల్లిదండ్రులకు పుట్టలేదని దిక్కుమాలిన దరిద్రపు కొడుకుల చేత సోషల్ మీడియాలో కామెంట్లను పెట్టిస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఇద్దరు ఇబ్బందులతో రోడ్డున పడ్డారు. ఒకరేమో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. మరొకరికి సెక్యూరిటీని తగ్గించారు. గతంలో ఉన్న సెక్యూరిటీ కి అదనంగా ఇద్దరు గన్మేన్లని ఇచ్చిన వారు కూడా రాష్ట్ర పోలీసు శాఖ సిబ్బందేనని ఆయన పేర్కొన్నారు.

మద్య నిషేధం గురించి తండ్రి, కొడుకుల మాటలను విశ్వసించవద్దని గతంలో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి, దశలవారీగా మద్య నిషేధం అమలు చేసి ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయకపోతే ఓట్లు అడగనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం ఏరులై పారుతోంది. దానికి జగన్ మోహన్ రెడ్డి ఏమని సమాధానం చెబుతారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరితే, జనాల జేబులకు చిల్లులు పడుతున్నాయి . సేల్స్ ఎక్కువగా జరగలేదని చూపించడానికి దొంగ మద్యాన్ని విక్రయించారు.

బూమ్ బూమ్ మద్యం పేరిట దొంగ సరుకు అమ్మితే తాగిన వారు డామ్, డామ్ అని అంటున్నారు . మద్యం కోసం గతంలో విశాఖపట్నంలోని తాలూకా, కలెక్టర్ కార్యాలయాలను తాకట్టు పెట్టడం చూశాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా సెల్వమణి ప్రసంగించిన 30 నిమిషాల వీడియోను ప్రదర్శించి, ఇదేమిటని ప్రశ్నిస్తే చాలు… ఆమె తెదేపా, జనసేన, బిజెపి కూటమికి ప్రధాన ఎన్నికల ప్రచారకర్తగా మారుతారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

యాత్ర 2 చిత్రంలో చెల్లెలు, బాబాయ్ క్యారెక్టర్ లేదట…!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో ఆయన సోదరి షర్మిల, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పాత్రలు లేవటని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. వెదవ పనులన్నీ చేసే వ్యక్తిని యాత్ర 2 సినిమాలో మహా పురుషుడిగా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉంది. యాత్ర చిత్రం అనేది ఒక మంచి మనిషిపై మంచిగా తీసిన సినిమా అయితే, యాత్ర 2 సినిమా లో ప్రతి నాయకుడిని హీరోగా చూపట్టే ప్రయత్నం చేయడం వల్లే, సినిమా థియేటర్లను జనం కరువయ్యారు.

హైదరాబాదులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో 200 నుంచి 300 సీట్లు ఉంటే కేవలం నాలుగైదు టికెట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. హైదరాబాదు వరకు వెళ్లడం ఎందుకు సార్… కడపలోనే అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ చేసుకునేవారు కరువయ్యారని ఒక వ్యక్తి నాకు బుకింగ్ చార్ట్ పంపించారు. ఈ సినిమాను ఫ్రీగా చూపెట్టినా కూడా జనం చూసేందుకు సిద్ధంగా లేరు. యాత్ర 2 చిత్రం కోసం నిర్మాత 40 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసినా, ప్రేక్షకాధారణకు నోచుకోకుండా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డిని జనం తిరస్కరించినట్లేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

యాత్ర 2 చిత్రం తొలి రోజు ప్రేక్షకులను ఎమ్మెల్యేలే బలవంతంగా సినిమా థియేటర్లకు తీసుకు వెళ్లారు. రాజమండ్రిలో ఏకచిత్ర నటుడు కూడా ఈ సినిమాకు ప్రజల్ని బలవంతంగా తీసుకు వెళ్లడమే కాకుండా, యాత్ర 3 వస్తుందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది . యాత్ర 3 సినిమాలో ఏముంటుందని విలేకరులు ప్రశ్నించగా, ప్రజలు ఎలా అపార్థం చేసుకుని ఓడించారనే సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందించవచ్చునని ఎద్దేవా చేశారు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమయింది. వ్యూహం సినిమా విడుదలైన పది రోజుల తర్వాత శపథం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావచ్చు… ముఖ్యమంత్రి గురించి వరుసగా బయోపిక్ లు రూపొందిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు సినిమాలను రూపొందించడం లేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు… చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, ఆయన గురించి బయోపిక్ లు రూపొందించాల్సిన అవసరం లేదు.

బాపట్ల ఎంపీ యదార్థ జీవిత గాధను చిత్రంగా రూపొందిస్తున్నట్లు, ఆయన్ని భవిష్యత్తు నాయకుడిగా ప్రోజెక్టు చేస్తారేమోనని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. యాత్ర 2 చిత్రాన్ని ఓటిటిలో, యూట్యూబ్ లో విడుదల చేసిన కూడా ప్రేక్షకులు సమయం బొక్క అని తిలకించారని పేర్కొన్నారు.

నిజమైన ప్రజాసేవకులైన వాలంటీర్లకు రానున్న ప్రభుత్వంలోనూ ఉద్యోగావకాశాలు
నిజమైన ప్రజాసేవకులైన వాలంటీర్లకు రానున్న ప్రభుత్వంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. వాలంటీర్లకు వైకాపా ప్రభుత్వం వలవేస్తోంది. వారిని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో సన్మానించాలని నిర్ణయించారు.

ఆడ వాలంటీర్ అయితే చీరలు, మగవారికి కొత్త బట్టలు కుట్టించి శాలువా కప్పి ఎమ్మెల్యేలు సత్కరించనున్నట్లు తెలుస్తోంది. 5000 రూపాయలకే దారుణమైన, దరిద్రమైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సన్మానించనున్నారట. వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు వాలంటీర్ల ముసుగు తొలగించి పార్టీ కార్యక్రమాలకు వారిని వైకాపా నాయకత్వం వినియోగించుకోనున్నట్లు తెలిసిందన్నారు. ఈ రెండు నెలల పాటు పెన్షన్లు ఎవరు ఇస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు… ఏమైనా జరగవచ్చునని, పెన్షన్లు ఇవ్వకపోవచ్చునని, సచివాలయ సిబ్బంది ఇచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఎవరైతే ఎమ్మెల్యేలు చేసే సన్మానంలో పాల్గొంటారో వారి పేర్లను గుర్తించి, రానున్న ప్రభుత్వంలో ఉద్యోగంలో నుంచి తొలగించడం జరుగుతుంది. సన్మానం వద్దు… శాలువా వద్దని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఏ కార్యక్రమం కోసం అయితే వారిని తీసుకున్నారో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే వారికి రానున్న ప్రభుత్వంలోనూ ఉద్యోగ అవకాశం ఉంటుందన్నారు.

శంఖారావం కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతుంది
శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ నెల 11 వ తేదీ నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న శంఖారావం కార్యక్రమం ఘన విజయం సాధిస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. గతంలో నిర్వహించిన యువ గళం పాదయాత్రలో తిరగలేని ప్రాంతాలను , శంఖారావం లో భాగంగా ఆయన పర్యటించనున్నారన్నారు.

LEAVE A RESPONSE